NTV Telugu Site icon

Off The Record: అన్ని ఆ జిల్లాకేనా..? కాంగ్రెస్లో కొత్త లొల్లి

Nalgonda

Nalgonda

Off The Record: అంతా మీరే చేశారు.. ఇదో పాపులర్‌ సినిమా డైలాగ్‌. అంతా వాళ్లే చేస్తున్నారు. అన్నీ వాళ్ళకేనా? ఇవి తెలంగాణ కాంగ్రెస్‌లో పాపులర్‌ అవుతున్న క్వశ్చన్స్‌. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదన్న సామెత ఆ ఉమ్మడి జిల్లా నేతలకు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఏ జిల్లా గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు? ఎందుకలా జరుగుతోంది?.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్‌ పర్వం పూర్తయింది. నామినేషన్‌ వేసిన అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే. ఇక అధికారిక ప్రకటన లాంఛనమే. ఇక్కడే ఓ సరికొత్త చర్చ జరుగుతోంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. అదే పవరాఫ్‌ నల్గొండ. కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్స్‌ వేసిన కేతావత్ శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, మిత్రపక్షం సీపీఐ తరపున బరిలో ఉన్న నెల్లికంటి సత్యం… ముగ్గురు నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారే. ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. రాష్ట్రంలో పొలిటికల్‌ పవరంతా…నల్గొండ చుట్టూనే తిరుగుతోందా అని చర్చించుకుంటున్నారు.

Read Also: Chandrababu: అమరావతి రీలాంచ్ ప్రోగ్రామ్కి ప్రధాని మోడీని పిలుస్తాం..

ఇక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, మిత్రపక్షం సిపిఐ సామాజిక సమీకరణ లెక్కలు పక్కాగా వేసుకుని జాగ్రత్తలు తీసుకున్నాయి. అలా చేసినా… మూడు టిక్కెట్లు ఉమ్మడి నల్గొండకు వెళ్లడం కాస్త ఆశ్చర్యంగానే ఉందని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఈ ముగ్గురి ఎంపికతో నల్గొండ ప్రాతినిధ్యం మరింత పెరిగినట్టయింది. దీంతో ముందు ముందు కూడా పవర్‌ పాలిటిక్స్‌లో జిల్లా కీలకంగా మారుతుందని మాట్లాడుకుంటున్నారు నల్గొండలో. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి నల్గొండ ప్రాతినిధ్యం పెరిగిపోయిందని, నల్లగొండోళ్ళ డామినేషన్‌ పెరిగిపోతోందని మాట్లాడుకుంటుండగా మరో మూడు ఎమ్మెల్సీలు దక్కడం చర్చనీయాంశం అయింది. ఈ ఎంపిక రాష్ట్ర రాజకీయాల్లో జిల్లా పాత్రను, బలాన్ని, బలగాన్ని, మరింత పెంచిందని హస్తం నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం అన్నీ ఆ జిల్లాకేనా అంటూ పెదవి విరుస్తున్నారట. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే… ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేబినెట్‌లో ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదే టైంలో అదే జిల్లా నుంచి తాజాగా మిత్రపక్షంతో కలుపుకుని ముగ్గురు ఎమ్మెల్సీలు ఎంపికవడం ఒక ఎత్తయితే…. రాష్ట్ర కాంగ్రెస్‌లో వాళ్ళకు మించిన మొనగాళ్ళు మరే జిల్లాలో లేరా అంటూ… కొందరు కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి క్యాబినెట్ లో కీలక శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తమ్ కుటుంబానికి బంధువు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read Also: Sai Kumar : సాయికుమార్ కు కొమరం భీమ్ పురస్కారం

రేపు కేబినెట్‌ విస్తరణ జరిగితే కచ్చితంగా నాకు పదవి కావాల్సిందేనని పట్టుదలగా పావులు కదుపుతున్నారు రాజగోపాల్‌రెడ్డి. ఇక సీనియర్‌ లీడర్‌ జానారెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే చక్రం తిప్పారు. ఈ మధ్య సైలెంట్‌ అయిన జానా ఇప్పుడిప్పుడే రీఛార్జ్‌ మోడ్‌లోకి వస్తున్నారట. ఇక జానారెడ్డి పెద్ద కుమారుడు గత ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. చిన్న కొడుకు జైవీర్ రెడ్డి నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు గుత్తా సుఖేంధర్ రెడ్డి ఇప్పటికే శాసన మండలి చైర్మన్ కాగా… ఆయన వారసుడు గుత్తా అమిత్ ఇటీవలే డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఇలా ఎక్కడికక్కడ నల్గొండ జిల్లా నేతలు ఎక్కువ మంది రాష్ట్ర స్థాయి పదవుల్లో కీలకపాత్ర పోషిస్తుండగా… అటు జిల్లాలో కూడా ఫ్యామిలీ ప్యాకేజ్‌లు నడుస్తున్నాయని, ఇప్పుడు కొత్తగా మూడు ఎమ్మెల్సీ సీట్లు కూడా అదే జిల్లాకైతే మిగతా రాష్ట్రం మొత్తం ఏమైపోవాలని అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట కొందరు కాంగ్రెస్‌ నాయకులు. ఇప్పటికే ఉన్నవి చాలవన్నట్టు రేపు కేబినెట్‌ విస్తరణ జరిగితే… వివిధ కోటాల పేర్లు చెప్పి అందులోనూ మాకు అవకాశం అంటూ అదే జిల్లా నాయకులు పావులు కదపడం ఎంతవరకు సమంజసం అని అడిగే కాంగ్రెస్‌ నేతలు సైతం ఉన్నారట. అలాగే పవరంతా నల్గొండకేనా అన్న సెటైర్స్‌ పడుతున్నాయట. ఈ పరిస్థితుల్లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎంపిక తరువాత ఇక జిల్లాకు ఇప్పట్లో పదవుల అవకాశం ఉండకపోవచ్చన్న చర్చ మొదలైంది. ఆ రోజుకు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.