OTR : తాండూరు గులాబీ దళానికి దిక్కెవరు..! కారు స్టీరింగ్ ఎవరి చేతిలో?

Brs

Brs

కేడర్‌ జోష్‌గా ఉంది. కానీ… నడిపే లీడర్‌ ఎవరో తెలీదు. కారు జోరుగా పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. కానీ… గేర్‌ మార్చే వాళ్ళు ఎవరో తెలీడం లేదు. డ్రైవింగ్‌ సీట్లో ఉండీ లేనట్టుగా ఉన్నది ఒకరైతే… అసలు లేకున్నా ఉన్నట్టు భావిస్తున్నది మరొకరు. దీంతో స్టీరింగ్‌ తిప్పుడులో చిన్న తేడా కొట్టినా యాక్సిడెంట్‌ ఖాయమన్నది కేడర్‌ కంగారు. ఏ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో ఉందా పరిస్థితి? ఏంటా గందరగోళం? తాండూరు బీఆర్ఎస్‌లో నాయకత్వానికి సంబంధించిన గందరగోళం పెరుగుతోంది. పార్టీకి కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఆయన్ని సస్పెండ్ చేశారా? లేక కేవలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశించారా? అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోవడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మరోవైపు తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జిగా పంజుగుల శ్రీశైల్ రెడ్డి కొనసాగుతున్నారా? ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించారా? లేక రోహిత్ రెడ్డి వ్యవహారంలో తుది నిర్ణయం వచ్చే వరకు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారా? అన్న విషయంలో కూడా గందరగోళం నెలకొంది. ఈ ఏడాది మార్చిలో మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ క్రమశిక్షణా విభాగం షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరడంతో పాటు, తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అందులో ఆదేశించారు. దీంతో రోహిత్ రెడ్డి పార్టీ సభ్యత్వం కొనసాగుతోందా? ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందా? లేదా అన్న సందేహాలు గులాబీ శ్రేణుల్ని వెంటాడుతున్నాయి.

నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు పంజుగుల శ్రీశైల్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కూడా తాండూరు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో శ్రీశైల్ రెడ్డి అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. అదంతా ఒక ఎత్తయితే… నియోజకవర్గ ఇన్‌చార్జిగా అధికారికంగా కొనసాగడం మరో అంశం. ఈ రెండు విషయాల మధ్య స్పష్టత లేకపోవడం వల్లే పార్టీ కేడర్‌లో సందిగ్ధత పెరుగుతోందట. తాండూరు గులాబీ రాజకీయాల్లో పైలట్ రోహిత్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి ఇద్దరూ కీలకంగా కనిపిస్తున్నారు. ఒకవైపు రోహిత్ రెడ్డి విషయంలో పార్టీ తుది నిర్ణయం ఏంటన్నది తెలియాల్సి ఉండగా, మరోవైపు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు ఎవరు నిర్వహించాలన్న దానిపై స్పష్టత కరవైంది. నాయకత్వం ఎవరిదో తెలియకపోతే పార్టీ కార్యక్రమాల నిర్వహణ, స్థానిక సమస్యలపై పోరాటం, భవిష్యత్ రాజకీయ వ్యూహాల అమలుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు, నియోజకవర్గ స్థాయి రాజకీయాల్లో పార్టీని సమన్వయం చేసే నాయకుడి విషయంలో స్పష్టమైన నిర్ణయం అవసరమని కార్యకర్తలు భావిస్తున్నారు. తాండూరు బీఆర్ఎస్‌లో నెలకొన్న ఈ పరిస్థితిపై పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేయాలన్న వాయిస్‌ పెరుగుతోంది.

పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో క్రమశిక్షణా చర్యల ఫైనల్‌ రిజల్ట్‌ ఏమిటి? శ్రీశైల్ రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారా? పార్టీ భవిష్యత్ కార్యాచరణకు ఎవరు నాయకత్వం వహించాలి? అన్న అంశాలపై స్పష్టత వస్తేనే గులాబీ శ్రేణుల్లో నెలకొన్న అయోమయం తొలగే అవకాశం ఉంది. ప్రస్తుతం తాండూరు బీఆర్ఎస్‌లో కనిపిస్తున్నది నాయకత్వ పోరాటమా? లేక నాయకత్వంపై స్పష్టత లేని పరిస్థితా? అన్నది కూడా తేలడంలేదు. అధిష్ఠానం జోక్యం చేసుకుని ఈ గందరగోళానికి తెర దించాలన్న డిమాండ్‌ కేడర్‌లో పెరుగుతోంది.