బీఆర్ఎస్ లెక్కలు మారుతున్నాయా? గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్స్ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలకు పదును పెడుతోందా? ఏపీలో అధికార కూటమి యాజ్ ఇటీజ్‌గా ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఏం చేయాలన్న విషయంలో తర్జనభర్జనలు నడుస్తున్నాయా? ఆ విషయంలో గులాబీ లెక్కలు ఎలా ఉన్నాయి? వాళ్ళ అంచనాలేంటి? తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ నవ నిర్మాణం పేరుతో హైదరాబాద్‌లో ఆయన సభ పెట్టాలనుకోవడం, దానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, బదులుగా తన నినాసంలోనే ఆయన ప్రెస్‌మీట్ పెట్టి హాట్ కామెంట్స్ చేయడం చకచకా జరిగిపోయిన పరిణామాలు. అయితే… ప్రెస్‌మీట్‌లో పవన్ చేసిన వ్యాఖ్యల చుట్టూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానన్న జనసేన అధ్యక్షుడి ప్రకటన చుట్టూ చాలా విశ్లేషణలు నడుస్తున్నాయి. ఒకవేళ రంగంలోకి దిగితే…. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా..? లేక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టుగానే కూటమి రూపంలో వస్తారా అంటూ… బీఆర్‌ఎస్‌లో గట్టి చర్చే జరుగుతోందట. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ తప్ప… రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు జరిగే ఎన్నికలేవీ లేవు. ఒకవేళ ఎలక్షన్స్ అంటూ వస్తే… అవి గ్రేటర్‌వేనన్నది అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం. ఇప్పటికే… ఆ దిశగా బీఆర్‌ఎస్ అడుగులు కూడా పడుతున్నాయి. నియోజకవర్గాల వారీగా SIR అవగానతో పాటు సభ్యత్వ నమోదు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే…. గ్రేటర్‌లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా వస్తే… ఏం చేయాలన్న అంశం గురించి బీఆర్ఎస్ నేతలు గట్టిగానే చర్చించుకుంటున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో… కూకట్‌పల్లి లాంటి నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే బీజేపీ మద్దతు ఇచ్చింది. అక్కడ కమలం అభ్యర్థిని కూడా పెట్టలేదు.
అలా… ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో మూడు పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేస్తే… మన వ్యూహం ఎలా ఉండాలన్న విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారట గులాబీ పెద్దలు. బీజేపీ, జనేనకు టీడీపీ కలిస్తే… సిటీ పరిధిలో పడే ప్రభావంపై లెక్కలేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేనలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమన్న సంగతిని బీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటోందట. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం అవకుండా ఉన్న కొన్ని సమస్యల్ని గ్రేటర్ ఎన్నికల్లో ప్రస్తావించి…అవి పరిష్కారం అవ్వాలంటే… తెలంగాణకు చెందిన పార్టీలే ఉండాలని వివరించాలనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు కేటీఆర్ కూడా మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ… జనసేన తెలంగాణలో కొత్తగా పోటీ చేసేదేముంది? గతంలో కూడా పోటీ చేశారు కదా అని అన్నారు. ఆ మాటల ద్వారా….ఈసారి గ్లాస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా..లేక కూటమి భాగస్వామిగా వచ్చినా… మాకు ఇబ్బందేం లేదు, మేం సిద్ధమేనని చెప్పే ప్రయత్నం చేసినట్టు అంచనా వేస్తున్నారు. అయితే…. కూటమిగా పోటీకి దిగితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందని లెక్కలేస్తున్నారు బీఆర్‌ఎస్ పెద్దలు. దాని వల్ల తాము దెబ్బతినకుండా జాగ్రత్తపడి… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్‌కు సెమీ ఫైనల్స్‌గా ప్రొజెక్ట్ చేయాలని భావిస్తోందట గులాబీ పార్టీ. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో కూటమి పార్టీల ప్రభావం తమ అభ్యర్థులపై పడకుండా చూసుకోవాలంటూ ఇటు గ్రేటర్ నేతలు అధిష్టానికి చెబుతున్నారు. కానీ… ఇక్కడే ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా… బీఆర్‌ఎస్ అధినాయకత్వం కొంచెం ఎక్కువ ఆలోచిస్తోందా? అతి జాగ్రత్త పడుతోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి రాజకీయవర్గాల్లో. తెలంగాణలో కూటమి కడతామని ఆ మూడు పార్టీలు ప్రకటించలేదు. అసలు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ… అప్పుడే అంత దూరం ఆలోచించడం ఎందుకన్న మాటలు బీఆర్‌ఎస్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అదే సమయంలో… పవన్‌కళ్యాణ్ తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం వెనక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్న సమాలోచనలు బీఆర్‌ఎస్‌లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో… గులాబీ పార్టీ భవిష్యత్ అడుగులు ఎలా పడబోతున్నాయోనన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయవర్గాల్లో.

