బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా? గట్టి వాదనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని చేజేతులా వదులుకుందా? ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని బేస్ చేసుకుని రేపు కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉందా? ఏ స్టాండ్ గులాబీ పార్టీకే బెడిసి కొడుతుందన్న చర్చలు మొదలయ్యాయి? ఏంటా వ్యవహారం? తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. తొలి రోజు సభకు జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్….ఇక ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే… యధావిధిగా కేసీఆర్ మాత్రమే దూరంగా ఉంటారు, పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్‌కు హాజరవుతారన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ…కీలకమైన నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్. సభలో తమని కించపరుస్తూ మాట్లాడుతున్నా సరే… సీఎంని విమర్శించకూడదని చెబుతున్నారనే కారణంతో ఈ విడత అసెంబ్లీ సమావేశాలు మొత్తాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు గులాబీ ఎమ్మెల్యేలు. ఇక్కడే కొత్త అనుమానాలు, సరికొత్త ప్రశ్నలు వస్తున్నాయి విశ్లేషకులకు. గతంలో ఎప్పుడైనా సరే… అసెంబ్లీ సమావేశాలు నిర్వహించండి, చర్చించాల్సిన, ప్రభుత్వాన్ని నిలబెట్టి కడిగేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయంటూ… బస్తీమే సవాల్ అన్నట్టుగా ఉండేది బీఆర్‌ఎస్ వ్యవహారం. అంతకు ముందు అలా… స్పెషల్ డిమాండ్స్ పెట్టి, ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉన్న పార్టీ… తీరా ఇప్పుడు మాత్రం సమావేశాలు జరుగుతుండగానే…. బహిష్కరించి వెళ్ళిపోవడం వెనక కారణాలేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతిపక్షం నిర్ణయంతో… ఈ సమావేశాలకి ప్రధాన అజెండాగా ఉన్న నదీ జలాల పంపిణీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల లాంటి చర్చల్లో బీఆర్ఎస్ పాత్ర లేకుండా అయిపోతోంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల్లో రాజీపడి అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ… ఇటీవల తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది బీఆర్‌ఎస్. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, అసెంబ్లీ వేదికగా వాటిని బయటపెడతామని కూడా చెప్పారు ప్రతిపక్ష నాయకులు. తీరా… ఇప్పుడు అవకాశం వచ్చాక ఇలా సమావేశాలను బహిష్కరించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వ వాదనను అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వినిపించారు. ఆ తర్వాత ప్రసంగ రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ పిక్చర్ ఇచ్చేశారు. ఇలా అధికార పక్షం అంత వివరంగా మాట్లాడినా… ప్రతిపక్షం మాత్రం సభలో తన వెర్షన్ చెప్పకుండా సైడై పోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. గట్టిగా మాట్లాడాల్సిన విపక్షం సమావేశాలను ఎందుకు బహిష్కరించిందన్నది బిగ్ క్వశ్చన్. పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరించినా….. అది పార్టీ వ్యవహారంగానే మిగిలిపోయింది తప్ప… అసెంబ్లీలో రికార్డుల్లోకి వెళ్ళదు. అదే వెర్షన్‌ని సభలో గట్టిగా వినిపించి ఉంటే… ఆన్ రికార్డ్ ఉండేదని, జనంలోకి వెళ్ళడానికైనా, రేపు ప్రభుత్వాన్ని నిలదీయడానికైనా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏడాదిగా… మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఆ దిశలో అడపాదడపా ఆందోళనలు కూడా జరిగాయి. కానీ… ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చకు బీఆర్‌ఎస్ బంక్ కొట్టింది.
మరోవైపు హిల్ట్ పాలసీ గురించి ఇటీవల మాట్లాడుతున్నారు విపక్ష నాయకులు. అందులో ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అవినీతి చేయబోతోందని, దాన్ని మేం బయట పెట్టామని చెప్పుకున్నారు గులాబీ లీడర్స్. కానీ… ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో మాట్లాడే ఛాన్స్ మిస్ అయింది. ఇక జీహెచ్ఎంసీ పునర్విభజనపై కూడా తన వాదనను చెప్పుకోలేకపోయింది బీఆర్ఎస్. ఇలాంటి చాలా… కీలక అంశాలపై ప్రతిపక్షం మాట్లాడలేకపోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతోందట. ఇలాంటి టైమ్‌లో మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే బాగుండేది కదా అన్నది కేడర్ అభిప్రాయంగా తెలుస్తోంది. బయట ఎన్ని నిరసనలు, ఆందోళనలు చేసినా… ఎంతగా మాట్లాడినా, అసెంబ్లీ వేదికగా తమ వాణి వినిపిస్తే ఆ లెక్క వేరు, దాని రీచ్ వేరుగా ఉంటుందన్నది విస్తృతాభిప్రాయం. బయట మీడియా సమావేశాల్లో, పార్టీ సభల్లో ఎక్కడ మాట్లాడినా ఎదురుగా అధికార పక్షం ఉండదు కాబట్టి సమాధానం చెప్పే అవకాశం ఉండదు. కానీ అదే అసెంబ్లీలో అధికార పక్షం ముందు ఈ సమస్యలన్నీ లేవనెత్తితే దానికి సమాధానంతో పాటు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది కదా… ఆ అవకాశాన్ని మనోళ్ళు ఎందుకు మిస్ చేసుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి గులాబీ సర్కిల్స్‌లో.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఏ అంశాల మీదైతే ఆరోపణలు చేస్తోందో…. సరిగ్గా అవే ఇప్పుడు సభలో చర్చకు వస్తున్నాయి.కానీ ఈ టైంలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడంతో… ఎంఐఎం, బీజేపీ, సిపిఐ ఎమ్మెల్యేలు తమ వాదనను వినిపిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో సభలో లేకుండా పోవడం కాంగ్రెస్‌కు కూడా అడ్వాంటేజ్ అవుతుందని, సభలో చర్చించమంటే వాళ్ళు పారిపోయారంటూ రేపటి రోజున కార్నర్ చేసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ కేడరే మాట్లాడుకుంటోందట. ఒక రకంగా ఇది సెల్ఫ్‌గోలేనా అన్న చర్చలు నడుస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో.