OTR : బాలకృష్ణ వరుస విజయాలకు అసలు కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో కులానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అందులోనూ ఏపీలో అయితే… మరో మాటే ఉండదని అంటారు. కానీ… ఆ నియోజకవర్గంలో మాత్రం కులం లేదు, కాకరకాయ లేదు… బలం ముఖ్యం అంటున్నారు వైసీపీ లీడర్స్. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా….? కొండను ఢీ కొట్టాలంటే కులం సరిపోతుందా అంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా కులాల కోలాటం? కులం కూడు పెట్టదు… మతం మంచినీళ్లవ్వదని అంటారు. అది వాస్తవం కూడా. ఆ రెండూ జరక్కపోయినా…. కులం ఓట్ల పండగ చేస్తుందన్నది మాత్రం రాజకీయ సత్యం. కానీ… శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మాత్రం అది కూడా తేడాగానే ఉందట. ప్రత్యేకించి వైసీపీ చేసిన కుల ప్రయోగాలన్నీ విఫలమవుతున్నాయన్నది లేటెస్ట్ టాక్. ఇక్కడ కులం కంటే ఇతరత్రా బలం చాలా ముఖ్యమని ఫ్యాన్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశంపార్టీకి కంచుకోట. అప్పట్లో ఎన్టీఆర్‌ని, ఆ తర్వాత హరికృష్ణను గెలిపించారు ఇక్కడి ఓటర్లు. ఇప్పుడైతే… బాలకృష్ణను ఏకంగా వరుసగా మూడు సార్లు అసెంబ్లీకి పంపారు. ఇలా టిడిపి వరుస విజయాలకు ఇక్కడి ప్రజలు పసుపు జెండాకు అండగా ఉండటం ఒక కారణమైతే… ప్రత్యర్థుల బలహీనత మరో అతి ముఖ్యమైన కారణం అన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. గతంలో కాంగ్రెస్ పరిస్థితిని పక్కన పెడితే…. ప్రస్తుతం వైసీపీది కూడా అదే పరిస్థితి అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ బలమైన వైసీపీ నాయకుడిగా ఉన్న నవీన్ నిశ్చల్ బాలయ్యని ఢీకొట్టారు. గెలవలేదుగానీ….. దాదాపు గెలిచినంత పని చేశారు. అప్పుడు బాలకృష్ణ తొలిసారి పోటీ చేయడంతో హిందూపురం ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపారు. ఇటు నవీన్ నిశ్చల్‌కు బలమైన క్యాడర్ ఉంది. దానికి పార్టీ బలం కూడా తోడవడంతో… అప్పుడు బాలకృష్ణ మెజార్టీని తగ్గించగలిగారు. కానీ… ఆ తర్వాతి నుంచి ఫ్యాన్ పార్టీ చేస్తున్న ప్రతి ప్రయోగమూ విఫలమవుతూనే ఉంది. సొంత కేడర్ ఉన్న నవీన్ నిశ్చల్‌ను పక్కనపెట్టి.. 2019 ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌ను ఇక్కడికి తీసుకొచ్చారు. హిందూపురంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారన్న కారణంతో.. కేవలం ఎన్నికలకు కొన్ని రోజులు ముందు ఇక్బాల్‌ను దింపారు. కానీ… బాలయ్య ముందు ఆయన ఏమాత్రం నిలవలేకపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. హిందూపురంలో మాత్రం సైకిల్ జోరు కొనసాగింది. అప్పటికైనా మేల్కొనకుండా…. 2019 మతాల ఈక్వేషన్ నుంచి 24లో కులాల ఈక్వేషన్‌కు టర్న్ అయింది వైసీపీ అధిష్టానం. అప్పటివరకు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కురుబ దీపికను తెరపైకి తీసుకొచ్చారు.
దీపిక భర్త వేణుగోపాల రెడ్డి వైసీపీలో కీలకంగా ఉండేవారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, వీరికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన సహకారంతో దీపికకు టిక్కెట్ దక్కిందని అంటారు. ఆమె బీసీ కాబట్టి ఆ ఓట్ బ్యాంక్, భర్త వేణుగోపాల్ రెడ్డి ద్వారా రెడ్డి ఓట్ బ్యాంక్, కలిసి మొత్తం మన వైపే వస్తుందని లెక్కలేశారు వైసీపీ పెద్దలు. కానీ 2024 ఎన్నికల్లో కూటమి వేవ్‌కు తోడు వైసీపీలోని అంతర్గత విభేదాలు గట్టిగా దెబ్బ కొట్టాయి. అంతకు ముందు రెండు పర్యాయాల కంటే రెట్టింపు మెజారిటీతో ఈసారి బాలకృష్ణ విజయం సాధించారు. అలా వరుసగా మూడు విడతలు బాలకృష్ణ విజయం సాధించడానికి టీడీపీ బలం ఒక కారణమైతే….. అంతకంటే ఎక్కువగా వైసీపీ బలహీనతే పెద్ద కారణం అన్న విశ్లేషణలున్నాయి. పైగా ఇప్పుడు మూడోసారి ఓటమి తర్వాత కూడా రియలైజేషన్ లేకుండా వైసీపీలో కీలకంగా ఉన్న నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి లాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. పెద్ద పొరపాటు చేశారన్నది స్థానికంగా కేడర్‌లో ఉన్న అభిప్రాయం. కురుబ దీపిక, నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డికి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు నడుస్తున్నాయి. ముగ్గురూ హిందూపురం టికెట్ కోసమే ప్రయత్నాలు చేస్తూ ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహించుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయాలపై కొండూరు, నవీన్ బహిరంగంగా విమర్శలు చేయడంతో పాటు దీపిక నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దాంతో వారిని సస్పెండ్ చేసింది అధిష్టానం. అప్పటి నుంచి ఆ ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించాల్సిన అధిష్టానం క్షేత్ర స్థాయిలో బలం ఉన్న నేతల్ని సస్పెండ్ చేయడం వల్ల పార్టీ మరింత బలహీనపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు అధికారంలో ఉన్న బాలకృష్ణ హిందూపురంలో మరింత బలంగా పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ… వైసీపీ మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రత్యర్థి బలాన్ని మరింత పెంచుతోందన్నది పొలిటికల్ వాయిస్.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!