Site icon NTV Telugu

Off The Record: ఏపీ బీజేపీ నేతలు మేధావులమంటూ ఢిల్లీ నేతల కళ్ళకు గంతలు కడుతున్నారా?

Ap Bjp

Ap Bjp

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో అంతా మేథావులేనా? ఎ టు జడ్‌…, టాప్‌ టు బాటమ్‌…. ఒక్కరంటే ఒక్కరు కూడా సాధారణ నాయకుడు లేకుండా…. అంతా అపర మేథావులైపోయారా? అలా ట్యాగ్‌లైన్స్‌ తగిలించేసుకుని ఢిల్లీ నాయకత్వం కళ్ళకు గంతలు కడుతున్నారా? అసలిప్పుడీ మేథో చర్చ ఎందుకు మొదలైంది పార్టీలో? ఎవరికి వారు భుజకీర్తులు తగిలించుకు తిరగడానికి కారణాలేంటి?

Read Also: Off The Record: వైసీపీ నేత గోరంట్ల మాధవ్ సైలెంట్ అయ్యారా? చేసారా? మొత్తం ఆ వీడియోనే చేసిందా?

ఏపీ బీజేపీలో నాయకుల తెలివితేటలు పెరిగిపోయి.. పొంగి పొర్లి.. డ్యాంలు కట్టినా ఆగకుండా బద్దలు కొట్టుకుని మరీ బయటికి ప్రవహించేస్తున్నాయా? అంటే.. వాస్తవం ఏంటో తెలియదుగానీ.. వాళ్ళు ఇస్తున్న బిల్డప్‌లు చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తోందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. వీళ్ళ ముందు.. బిల్డప్‌ బాబాయ్‌లు కూడా ఎందుకూ పనికిరారని చెప్పుకుంటున్నారు. పార్టీలో స్వయంప్రకటిత మేథావులు పెరిగిపోయి మొత్తానికే ముంచేలా ఉన్నారన్న భయాలు కూడా ఉన్నాయట కేడర్‌లో. ఇంతకీ, అసలు విషయం ఏంటంటే.. మోడీ 11 ఏళ్ళ పాలన మీద రాష్ట్రమంతటా విస్తృతంగా చర్చ పెట్టాలని, ఇందులో మేథావుల్ని ఇన్వాల్వ్‌ చేయమని ఆదేశించిందట పార్టీ ఢిల్లీ నాయకత్వం. ఆ చర్చల సారాంశాన్ని మాకు పంపమని కూడా హైకమాండ్‌ పెద్దలు చెప్పినట్టు తెలిసింది. మరి ఆంధ్రప్రదేశ్‌లో మేథావులు దొరకలేదో, లేక వాళ్ళు వీళ్ళు ఎందుకు? అసలు రాష్ట్రంలో మనకంటే మేథావులు ఎవరున్నారని అనుకున్నారోగానీ.. ఏపీ బీజేపీ లీడర్స్‌ అంతా..తమలో తాము మోడీ 11ఏళ్ళ పాలనపై మాట్లాడేసుకుని, ఆహా ఓహో అనేసుకుని, అదే రిపోర్ట్‌ కాపీని ఢిల్లీకి టపాలో వేసేస్తున్నారట. పార్టీ నాయకులే మొక్కుబడి తంతు జరిపి.. మమ అనిపించేయడం చూసి కాషాయ కేడర్‌ ముక్కున వేలేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Read Also: Off The Record: ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఒక్కసారిగా కూల్ అవడానికి కారణాలేంటి?

అయితే, సమాజాన్ని ప్రభావితం చేసే, తమ ముద్ర గట్టిగా వేయగలిగిన ప్రభావశీలుర్ని వెదికి చర్చలు జరిపి.. ఫీల్‌గుడ్‌ తీసుకురమ్మని ఢిల్లీ పెద్దలు చెబితే…. వీళ్ళు మాత్రం మేమే మేథావులం, మాకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకోవడం ఏంటో అర్ధం కావడంలేదని కేడర్‌లో గుసగుసలు పెరిగిపోతున్నాయట. ఎన్టీఆర్‌ జిల్లా లాంటి చోట్ల అయితే… జిల్లా స్థాయి నేతలంతా ఒక హోటల్‌లో కూర్చుని లంచ్‌ మీటింగో, డిన్నర్‌ మీటింగో పెట్టుకుని చర్చలు జరిగాయని అనిపించేసినట్టు తెలిసింది. ఎందుకలా చేస్తున్నారు? పార్టీ విషయంలో సరిగా ఎందుకు దృష్టి పెట్టడం లేదంటే…. పదవుల పరమైన అసంతృప్తి ఉందన్నది ఇంటర్నల్‌ టాక్‌. ఇక జిల్లా అధ్యక్షులే… మేథావుల్లా ఫీలైపోతూ… చర్చలు ముగించేస్తున్నట్టు సమాచారం. దీంతో… అసలు వీళ్ళంతా చర్చల సారాంశాన్ని ఏమని అధిష్టానానికి నివేదిస్తున్నారన్న డౌట్‌ ఉందంటున్నారు కొందరు నాయకులు. క్షేత్రస్ధాయి బలోపేతం దిశగా మేధావులతో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వమంటే…. జిల్లా నాయకులు దాన్ని కూడా గంగలో కలిపేస్తున్నారన్న అసంతృప్తి రాష్ట్ర పార్టీ ఆఫీస్‌లో వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. పదవులు రాక, నిరాశతోనే… జిల్లాల్లో ఎవరికి వారు మేథావుల అవతారం ఎత్తారా అన్న సెటైర్స్‌ కూడా వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. పదవులు ఎలాగూ లేవు.. ఈ రకంగా అయినా ఆత్మసంతృప్తి పొందుతున్నారనే చర్చ జరుగుతోంది. ఏదో ఒక హోటల్‌లో కార్యక్రమం పేరుతో టైంపాస్‌ చేయడమే మేథావితనమని అనుకుంటున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. మొత్తం మీద ఏపీ బీజేపీలో మేథోమధన చర్చలు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి.

Exit mobile version