OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు పార్టీ పాలిటిక్స్ నుంచి టర్న్ అయి పసుపు నీళ్ళ చుట్టూ తిరుగుతోందా? అసెంబ్లీ ముందు మొదలైన మాటల యుద్ధం… ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ దారిలో శుద్ధిదాకా వెళ్ళి ఇప్పుడే టర్న్ తీసుకుంటోంది? తాజా అరెస్ట్‌ల పర్వం ఏం చెబుతోంది? ఎవరి గోల్ ఎవరికి అడ్వాంటేజ్ అయింది?
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న దగ్గర మొదలైన వివాదం… రోజుకో మలుపు తిరుగుతోంది. స్పీకర్ దళితుడు కావడంతో కాంగ్రెస్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ… కాంగ్రెస్ దళిత నేతలు ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్‌హౌస్ వైపు డప్పులతో నిరసనకు బయలుదేరారు. మధ్యలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఎదురెదురుపడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చినా….. అసలు రాజకీయ కథ ఆ తర్వాతే మొదలైంది.
Also Read
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వెళ్లిన ప్రాంతంలో… ఆ మరుసటి రోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పసుపు కలిపిన నీళ్లు చల్లి శుద్ధి చేసిన దృశ్యాలు బయటకు రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ నేతల దాడి ప్రయత్నానికి ప్రతిగా, వారు చేసిన గొడవల కారణంగానే శుద్ధి చేశామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటే… కాంగ్రెస్ మాత్రం ఈ ఘటనను నేరుగా దళిత ఆత్మగౌరవంతో ముడిపెట్టింది. అక్కడి నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ గేర్ మార్చారు. కేసీఆర్ నివాసంపైకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లడం సరైన పద్ధతేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? అధికార పార్టీనే ఇలాంటి నిరసనలకు ప్రోత్సాహం ఇస్తే ఎలాగంటూ రాజకీయ వర్గాల్లో రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్న సమయంలో… పసుపు నీళ్ల శుద్ధి వ్యవహారం కాంగ్రెస్‌కు ఊహించని బలమైన రాజకీయ అస్త్రాన్ని అందించింది. ఆ పొలిటికల్ వెపన్‌ను సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వాడారన్న అభిప్రాయం ఉంది. అసెంబ్లీ వేదికగానే బీఆర్ఎస్పై ఎదురుదాడి చేశారు కాంగ్రెస్ లీడర్స్. దళితులు నడిచిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారా? అన్న ఒక్క ప్రశ్నతో ఈ మొత్తం వ్యవహారాన్ని కుల వివక్ష కోణంలోకి తీసుకెళ్లారు. రోడ్లను కాదు… అంటరానితనపు మనస్తత్వాన్ని శుద్ధి చేయాలని సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత హీట్ పెంచాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ జరిగిన ఘటనను కార్యకర్తల వ్యక్తిగత చర్యగా కాకుండా… బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతి ఇదేనని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ వైపు నుంచి మొదలైంది.
ఆ రకంగా… పసుపు నీళ్ల ఘటనతో మొత్తం పొలిటికల్ నేరేటివ్‌ని మార్చే యత్నం చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఫామ్‌హౌస్ ముట్టడి అంశం… ఆ తర్వాత దళితులకు అవమానం అనే ఆయుధంగా కాంగ్రెస్ చేతికి దొరికిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక ఇదే సమయంలో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. వరదరాజ్‌పూర్‌కు చెందిన ఏడుగురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఇదే ఎపిసోడ్‌కు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్త పావని గౌడ్‌తో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే… దళితులు వచ్చారని శుద్ధి చేయలేదు… కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి గొడవలు చేశారని, కేసీఆర్‌ను అవమానించారన్న భావోద్వేగంతోనే కొందరు కార్యకర్తలు అలా చేశారన్నది గులాబీ పార్టీ వర్గాల వాదన. దీన్ని కావాలనే దళితులకు ముడిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అయితే రాజకీయాల్లో… ఉద్దేశ్యం కన్నా ప్రజల్లోకి వెళ్లే సంకేతమే కీలకం. వాస్తవానికి శుద్ధి అనే పదమే అత్యంత సున్నితమైనది. అందులోనూ దళిత నేతలు నిరసన చేసి వెళ్లిన వెంటనే అదే మార్గంలో పసుపు నీళ్లు చల్లడంతో… కాంగ్రెస్‌కు కావాల్సిన పొలిటికల్ కంటెంట్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలే అందించినట్లయిందన్న అభిప్రాయం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో దళిత ఓటుబ్యాంక్ అత్యంత కీలకం. అందుకే… కాంగ్రెస్ దీన్ని ఒక్కరోజు వివాదంగా వదిలేయకుండా… బీఆర్ఎస్పై దళిత వ్యతిరేక ముద్ర వేసే స్థాయికి తీసుకెళ్ళినట్టు అంచనా వేస్తున్నారు. స్పీకర్‌పై వ్యాఖ్యలు… ఎరవెల్లి నిరసన… పసుపు నీళ్ల శుద్ధి… కేసులు… అరెస్టులు… ఇలా మొత్తం ఘటనలను ఒకే గొలుసుగా కట్టి కేసీఆర్ అండ్ కోను రాజకీయంగా కార్నర్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యూహాన్ని అర్థం చేసుకుని కౌంటర్ నేరేటివ్ సిద్ధం చేస్తోందట. ఫామ్హౌస్పైకి కాంగ్రెస్ శ్రేణులను ఎందుకు పంపారు? పోలీసులు ఎందుకు అనుమతించారు? అధికార పార్టీ కార్యకర్తల దాడులను ఎందుకు పట్టించుకోవడం లేదు? మా వాళ్ళ మీదే ఎందుకు కేసులు పెడుతున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. వాస్తవానికి ఫామ్‌హౌస్ ముట్టడితో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడాల్సిన పరిస్థితి ఉండగా…..పసుపు నీళ్లతో బీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్ వేసుకుందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి.
గులాబీ సెల్ఫ్గోల్ని సీఎం రేవంత్ రెడ్డి తనకు గోల్‌గా మలుచుకున్నారా? లేక… దళిత కార్డుతో అసలు ఫామ్‌హౌస్ ఎపిసోడ్ మొత్తాన్ని కాంగ్రెస్ డైవర్ట్ చేస్తోందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ పరిస్థితుల్లో… ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం గులాబీ వర్సెస్ హస్తం నుంచి…పసుపు నీళ్ల చుట్టూ తిరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగుతుందా…?లేక దళిత ఆత్మగౌరవం పేరుతో మరింత రాజకీయ మంట అంటుకుంటుందా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!