OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?

Otr

Otr

తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారులు పని చేస్తున్నారా…? లేదా? మంచి చెడుల గురించి సర్కార్‌కు సూచనలు ఇస్తున్నారా…? లేక పవర్‌, ప్రోటోకాల్‌ ఎంజాయ్‌ చేస్తూ…. సేదదీరుతున్నారా? వాళ్లు ఇస్తున్న విలువైన సలహాలేంటి? అసలు ఇవ్వడం లేదా? ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అన్నిటికీ మించి ఇప్పుడు కొత్తగా ఈ డౌట్‌ ఎందుకొచ్చింది?

ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం సహజం. అందుకోసం పాలనలో అనుభవం ఉన్నవారిని, ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళని సలహాదారులుగా నియమించుకోవడం కూడా సాధారణమే. ఆ కోవలోనే… తెలంగాణ ప్రభుత్వంలోనూ ఇరిగేషన్‌, వ్యవసాయం, పబ్లిక్‌ అఫైర్స్‌, సంక్షేమం, ప్రోటోకాల్‌ వంటి వివిధ అంశాలకు సలహాదారులు ఉన్నారు. అంత వరకు ఎలాంటి వివాదం లేకున్నా…వాళ్ళు నిజంగా సలహాలు ఇస్తున్నారా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. సలహాదారులు సలహాలు ఇవ్వడం లేదా? ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ప్రభుత్వం తీసుకోవడం లేదా? అంటూ కొత్తగా చర్చలు మొదలయ్యాయి. నిజంగానే నిపుణులు సలహాలు, ఇచ్చి, వాటిని ప్రభుత్వం స్వీకరించి అమలు చేస్తే… అసలు ఇన్ని ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతాయన్న ప్రశ్నలు వస్తున్నాయట పరిశీలకుల్లో. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ముందు సరైన స్థాయిలో సమీక్ష జరగడం లేదా? అన్నది కూడా ఇంకో డౌట్‌. ఇటీవల వరుసగా వివాదాలు, రాజకీయ విమర్శలు, ప్రభుత్వంపై ప్రతిపక్షాల రాజకీయ దాడులు జరుగుతున్నాయి. దీంతో… సలహాదారులేం చేస్తున్నారన్న డిస్కషన్స్‌ పెరిగిపోతున్నాయి.

సలహాదారు అంటే కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి కాదు. ఒక అంశానికి సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించడం, చట్టపరమైన ఇబ్బందులను అంచనా వేయడం, ప్రజలపై ప్రభావాన్ని పరిశీలించడం, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం లాంటి కీలకమైన బాధ్యతలు ఉంటాయి. నిర్ణయం తీసుకున్న తర్వాత వివరణ ఇవ్వడం కాకుండా…. తీసుకోబోయే ముందే ప్రమాదాన్ని గుర్తించడం సలహాదారుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఇప్పుడు ఈ పాయింట్‌ మీదే అసలు చర్చ మొదలవుతోంది. 22-A నిషేధిత భూములకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లక్షలాది ఆస్తుల విషయంలో అయోమయం నెలకొందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది బీఆర్ఎస్. దీంతో… అసలు అంతటి కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు పూర్తిస్థాయిలో పరిశీలించలేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయి? నిపుణుల సలహాలు తీసుకున్నారా? తీసుకుంటే వారి సూచనలు ఏంటి? ఒకవేళ సక్రమంగా చేసి ఉంటే ఎందుకు అమలు కాలేదు? లాంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. అసలు తెలంగాణ ప్రభుత్వంలో సలహా వ్యవస్థ పని చేస్తోందా? లేక అలంకార ప్రాయమేనా? అనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో పదుల సంఖ్యలో సలహాదారులు ఉన్నారు. సీఎం ముఖ్య సలహాదారుగా రిటైర్డ్‌ సీఎస్‌ రామకృష్ణరావు ఉన్నారు. ఇక సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కె.కేశవరావు, హర్కర వేణుగోపాల్, షబ్బీర్ అలీ, జితేందర్ రెడ్డి, ఆదిత్యనాథ్, ఎన్వీఎస్ రెడ్డి, వి. హనుమంతరావు, శివధర్ రెడ్డి, గోవిందహరితో పాటు మరో ఒకరిద్దరు సలహాదారులు ఉన్నారు. వీళ్లలో పోచారం వ్యవసాయ శాఖ, కేశవరావు పబ్లిక్‌ ఎఫైర్స్‌, హర్కర వేణుగోపాల్‌ ప్రొటోకాల్‌, ప్రజా సంబంధాల వ్యవహారాలను చూస్తున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ గౌరవ సలహాదారుడిగా మాజీ సైనికాధికారి, లెఫ్టినెంట్‌ జనరల్‌ హార్పల్‌ సింగ్‌ నియమిస్తూ 2025 ఆగస్టు 20న ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ఇరిగేషన్, ఎత్తి పోతల పథకాల సలహాదారుడుగా కె.పెంటారెడ్డి కొనసాగుతున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా ఉన్నారు.

ప్రభుత్వానికి సంబంధించి ప్రతి నిర్ణయంలో రాజకీయ కోణం ఉంటుంది. కానీ… ప్రజలపై నేరుగా ప్రభావం చూపే భూములు, ఉద్యోగాలు, సంక్షేమం, సాగునీరు, పట్టణాభివృద్ధి వంటి అంశాల్లో పరిపాలనా నిపుణుల సూచనలు కీలకం. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆయా అంశాలకు సంబంధించి ఎవరి సలహాలు తీసుకుంది? అసలు ప్రభుత్వంలోని సలహాదారులు ఏమైనా సలహాలు, సూచనలు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కొందరు కనీసం వారికి సంబంధించిన శాఖల సమీక్షల్లో కూడా పాల్గొనడం లేదని తెలుస్తోంది. అలా అని ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై కీలక అంశాలను చర్చిస్తున్నారా అంటే అదీ లేదని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో… ప్రభుత్వానికి ఉపయోగ పడకుండా… శాఖలకు సలహాలు ఇవ్వకుండా కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉండేందుకు లక్షల రూపాయల జీతాలు, అలవెన్స్‌ చెల్లించడం అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది.