తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తన సొంత జిల్లాలోని సొంత పార్టీ నేతల్ని టెన్షన్ పెడుతున్నారా? కొత్తగా ఇదెక్కడి గోల అంటూ అక్కడి నేతలు తలలు పట్టుకుంటున్నారా? అసలు ఆయన వస్తున్నారంటేనే… ఏం చేయాలో అర్ధంకాని గందరగోళంలో ఉంటున్నారా? ఇంతకీ ఏం చేశారు మహేష్ గౌడ్? ఆయన్ని చూసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులు ఎందుకు కంగారు పడుతున్నారు?
సొంత ఇలాఖా నిజామాబాద్ జిల్లా నుంచి… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అయితే… ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆయనకంటూ సొంత నియోజకవర్గం ఏదీ లేదు. దీంతో… ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటూ రకరకాల లెక్కలు మొదలైపోయాయి. గతంలో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అదే సీట్లో పోటీకి రెడీ అయ్యారు. కానీ.. కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరిలో దిగడంతో.. రాజకీయ సమీకరణల్లో భాగంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ…. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మహేష్ గౌడ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడి పదవి వచ్చింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌గౌడ్…. తాజాగా భవిష్యత్తు రాజకీయాలపై ఆసక్తికర వాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగుతానని అన్నారు. దీంతో… మహేష్‌గౌడ్ జిల్లాలో ఎవరి సీటుకు ఎర్త్ పెడతారోనన్న చర్చలు జరుగుతున్నాయి.
ఆయన మాత్రం నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పునర్విభజన జరిగాక తన సీటు విషయంలో తుది నిర్ణయం తీసుకుంటానని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. దీంతో… ఒకవేళ పునర్విభజన జరక్కుంటే పరిస్థితి ఏంటన్న డౌట్స్ కూడా పెరిగిపోతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్న మహేష్ గౌడ్ సేఫ్ జోన్ వెతుక్కుంటారా? లేక తన సొంత ఊరు ఉన్న బాల్కొండ బరిలో దిగి బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఢీకొంటారా అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు తనకంటూ ప్రత్యేకంగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పరచుకోని మహేష్‌గౌడ్… పీసీసీ చీఫ్‌గా జిల్లా పర్యటనకు వస్తే…. నిజామాబాద్ అర్బన్‌లో తన సొంత ఇల్లు ఉన్నందున అక్కడే మకాం వేస్తున్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని హస్తం గతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారాయన.అలాగని అర్బన్ నియోజకవనర్గంలో పోటీ చేసే ఆలోచనలో లేరట. అదే సమయంలో కొద్ది రోజులుగా తన సొంత ఇలాఖా బాల్కొండపై ఫోకస్ పెంచడాన్ని గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
భీంగల్ మండలం రహత్ నగర్ లో 11 ఎకరాల సొంత స్ధలాన్ని ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారాయన. అలాగే భీంగల్ మున్సిపాలిటీని హస్తగతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… భీంగల్ కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా మారే అవకాశం ఉంది. అదే జరిగితే అక్కడి నుంచి మహేష్‌గౌడ్ పోటీ చేయడం ఖాయమని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఒకవేళ పునర్విభజన జరక్కుంటే మాత్రం… ఆర్మూర్, లేదా నిజామాబాద్ రూరల్‌కు షిప్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అదే జరిగితే…ఇప్పటి వరకు ఆర్మూర్ ఇన్ఛార్జ్‌గా ఉన్న వినయ్ కుమార్ రెడ్డిని ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రూరల్‌కు మారాలనుకుంటే…అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కాదని ఏఐసీసీ మహేష్ గౌడ్‌కు ఛాన్స్ ఇస్తుందా అన్న సందేహాలు సైతం ఉన్నాయి. ఈ రకంగా… మొత్తం మీద పీసీసీ చీఫ్ చేసిన ప్రకటన ఆయన సొంత జిల్లాలో రాజకీయ కలకలం రేపుతోంది. అలాగే… తెర మీదికి నియోజకవర్గాల ముఖ్య నాయకుల్లో సైతం గుబులు పుడుతోందని చెప్పుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో తిష్టవేస్తారో తెలియక ఆ నియోజకవర్గాలను నమ్ముకున్న నేతలు టెన్షన్ పడుతున్నారట. ఒక వేళ ఆయనొస్తే .. రా రామ్మని ఆహ్వానించాలా.. లేక వద్దని చెప్పేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటూ తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.

