నీవు నేర్పిన విద్యయే కదా… నీరజాక్షా అన్నట్టు తెలంగాణ సీఎం… రాజకీయ ప్రత్యర్థులతో అంటున్నారా? వాళ్ళ వ్యూహాన్నే రివర్స్‌లో వాళ్ళ మీదికే ప్రయోగిస్తున్నారా…? కీలకమైన నియోజకవర్గాల్లో బహిరంగ సభల ప్లాన్స్ అందుతో భాగమేనా?వరుస సభల వెనక వ్యూహం ఏంటి..!? ముఖ్యమంత్రి రాజకీయ లెక్కలు ఎలా ఉన్నాయంటున్నారు?
రాజకీయ వ్యూహాలకు గట్టిగా సానపట్టే పనిలో బిజీగా ఉన్నారట తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి గతంలో ఆ పార్టీ అనుసరించిన వ్యూహాన్నే రివర్స్‌లో అప్లయ్ చేయాలనుకుంటున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. ప్రధానంగా ఆ పార్టీ ముఖ్యుల్ని కట్టడి చేయడానికి స్పెషల్ స్కెచ్ వేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సీఎం ఇప్పుడు ఆ నియోజక వర్గాలపై ఫోకస్ పెట్టడం వెనక గట్టి వ్యూహమే ఉందని అంటున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు ఈనెల 30న వెళ్ళబోతున్నారు సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు భారీ బహిరంగ సభను నిర్వహించోతున్నారు. సిరిసిల్లతో పాటు… సిద్దిపేటకు వస్తా… అన్ని లెక్కలు తేలుస్తానంటూ ఇటీవల ప్రకటించారు ముఖ్యమంత్రి. దాంట్లో భాగంగా సిరిసిల్ల సభ తేదీ ఖరారైంది.
అలాగే… వచ్చేనెల రెండో వారంలో సిద్దిపేటలో కూడా భారీ బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. అలాగే… అధికారులు అసైన్డ్ భూముల లెక్కలు తేల్చే పనిలో ఉన్నారట. ఇక ఆ తర్వాత గజ్వేల్‌లో సభ ప్లాన్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇలా…బీఆర్ఎస్‌లోని ముగ్గురు కీలక నాయకుల నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టి అక్కడి కాంగ్రెస్ క్యాడర్‌ని యాక్టివేట్ చేసే పనిలో సీఎం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా… ప్రత్యర్థి పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకుల నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టేది. రాజకీయంగా వాళ్లను నియోజకవర్గానికే పరిమితం చేసే వ్యూహాన్ని అమలు చేసేది. సేమ్ అదే స్కెచ్‌ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసే పనిలో పడ్డట్టు భావిస్తున్నాయి రాజకీయవర్గాలు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో అమలు చేయడంతో పాటు… కాంగ్రెస్‌లోని బలమైన నాయకులకు ఈ నియోజకవర్గాల బాధ్యతలను ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అభివృద్ధితో మొదలుపెట్టి… తర్వాత రాజకీయ వ్యూహాన్ని అమలు చేసే పనిలో ఉన్నారట. వరుసగా ఆ మూడు నియోజకవర్గాల మీద ఫోకస్ చేయటంతో పొలిటికల్ అటెన్షన్ కూడా వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలన్నిటిని కొలిక్కి తీసుకురావడం… తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి తలమునకలైనట్టు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

