OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..

Otr

Otr

ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌లో మారుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? మంత్రి కొండా సురేఖ విషయంలో ముందస్తు సంకేతాలు వెలువడుతున్నాయా? మంత్రి హోదాలో ఉన్న నేత ఫోటోలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీల్లో కనిపించకపోవడాన్ని ఎలా చూడాలి? అటు కొండా సైతం ప్రోగ్రామ్స్‌కు అటెండ్‌ అవకుండా ముఖం చాటేయడాన్ని ఎలా చూడాలి?

ఉమ్మడి వరంగల్ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంత్రి కొండా సురేఖ మీద కఠిన చర్యలకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడం, వేటు ఖాయమన్న ప్రచారం జోరుగా జరుగుతున్న టైంలో జిల్లా వ్యవహారాలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్‌లో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి కొండా సురేఖ వెళ్ళలేదు. తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని నారాయణపురం గ్రామస్తులు 20 ఏళ్ళుగా ఆందోళన చేస్తున్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న వివాదం కారణంగా ఇన్నాళ్లు వాళ్ళకు పట్టాలు దక్కలేదు. రెండు దశాబ్దాల నిరీక్షణకు చెక్‌ పెడుతూ… ప్రస్తుత ప్రభుత్వం సమస్యను పరిష్కరించి పట్టాలిచ్చింది. అంతటి ముఖ్యమైన కార్యక్రమం, పైగా కొండా అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, అయినా ప్రోగ్రామ్‌కు ఆమె అటెండ్‌ అవకపోవడం హాట్‌ టాపిక్ అయింది. అంతకు మించి పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక ఫ్లెక్సీలో సురేఖ ఫోటో లేకపోవడం ఇంకా పొలిటికల్‌ కాక రేపుతోంది. ఫ్లెక్సీలో ప్రతిపక్షం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు మరో బీఆర్ఎస్ నేత ఫోటో కూడా ఉందిగానీ…. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి, పైగా వివాదంలో భాగం ఉన్న అటవీ శాఖ బాధ్యతలు చూస్తున్నారు… అయినా ఆమె ఫోటో లేకపోవడం ఏంటంటూ కొండా అభిమానులు నిలదీస్తున్నారు.

మరోవైపు ఇటీవల జిల్లాలో జరుగుతున్న సమీక్ష సమావేశాలకు కూడా కొండా డుమ్మా కొడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్న మీటింగ్స్‌కు పూర్తి దూరంగా ఉంటున్నారామె. ఇద్దరి మధ్య చాలా రోజులుగా వైరం ఉంది. మేడారంలో జరిగిన అభివృద్ధి పనులు మొదలు… ప్రతి దాంట్లో ఇన్చార్జ్‌ మంత్రిగా… పొంగులేటి పెత్తనం పెరిగిపోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సురేఖ. అలాగే… దేవాదాయశాఖలో జరుగుతున్న సమీక్షా సమావేశాలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఇదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం అంతా ఒక్క తాటిపైకి వచ్చారని కూడా కొండా కుటుంబం విమర్శించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ ఒకవైపు, మిగిలిన నేతలందరూ మరోవైపుగా మారిపోయారు. మధ్యలో కాస్త ప్యాచ్‌ వర్క్‌ జరిగినా అది అంతగా అతకలేదని ఆ తర్వాతి పరిణామాలు చెబుతున్నాయి.

ఇక తాజాగా మంత్రి కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఆ తర్వాతి నుంచి అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు సురేఖ. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా రోడ్ల అభివృద్ధి, హౌసింగ్ పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి సైతం దూరంగా ఉన్నారామె. ఇక సోమవారం కేసముద్రంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉండటం, ఆ వేదిక మీద పెట్టిన ఫ్లెక్సీలో కొండా ఫోటో లేకపోవడం గురించి హాట్‌ హాట్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి జిల్లాలో. ఈ ఎపిసోడ్‌ పొంగులేటికి, కొండా దంపతులకు మధ్య ఉన్న వైరాన్ని చాటి చెప్పిందన్న అభిప్రాయం బలంగా ఉంది. అయితే… ఆమె అటెండ్‌ అవుతారా లేదా అన్నది వేరే సంగతిగానీ…. అసలు అధికారిక కార్యక్రమంలో మంత్రి ఫోటో లేకపోవడం ఏంటన్న ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నాయి రాజకీయవర్గాలు. మరోవైపు మహబూబాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశానికి హాజరవలేకపోతున్నానంటూ సురేఖ అధికారులకు సమాచారం ఇచ్చారట. బంధువుల రిసెప్షన్‌కి వెళ్లాల్సి ఉన్నందున రాలేకపోతున్నానని చెప్పి… సున్నితంగా తప్పించుకునే ప్రయత్నం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పొంగులేటితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో ఉన్న వర్గ విభేదాలు కూడా ఇందుకు కారణం అంటున్నారు.

సుస్మిత పటేల్ కామెంట్స్ తర్వాత కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడం వెనుక వేం ప్రోత్సాహం ఉందని నమ్ముతున్నారట కొండా. ఒవైపు అధికారిక ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టకపోవడం, మరోవైపు ఆమె పొంగులేటి తీరును తప్పుపడుతూ దూరంగా ఉంటున్న క్రమంలో మధ్యలో అధికారులు నలిగిపోతున్నారన్నట్టు చెప్పుకుంటున్నారు.