నోటిదాకా వచ్చిన బుక్క తినేలోపు జారి పోయిందని ఆ మాజీ ఎమ్మెల్యే తెగ ఫీలైపోతున్నారా? అది జారిపోవడం కాదు… ఎవరో బలవంతంగా లాగేశారన్నది ఆమె ఫీలింగా? రెండు నియోజకవర్గాల్లో కీలక బాధ్యతలు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుండి ఎందుకు పక్కకు పెట్టేసింది? ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్న టైంలో వచ్చిన అవకాశం ఎలా చేజారింది? ఇచ్చిన పని సక్కంగా చేయలేదనా? లేక గిట్టని వాళ్ళ పన్నాగమా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఏంటా కథ?
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగారు మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం యాక్టివ్ పాలిటిక్స్ చేశారామె. అయితే….2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హస్తం పార్టీకి హ్యాండిచ్చి.. గులాబీ గూటికి చేరారామె. తిరిగి 2023లో కారు దిగి సొంత పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు లలిత. తిరిగి వచ్చాక సొంత పార్టీలో అంత ప్రాధాన్యత దక్కకపోవడంపై బాగా అసంతృప్తిగా ఉన్నారట. ఐతే… అదే సమయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్‌ఐఆర్‌కు శ్రీకారం చుట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం…. నియోజకవర్గాలకు సీనియర్స్‌ను సమన్వయకర్తలుగా నియామించింది. అందులో భాగంగానే… అవకాశం ఎదురుచూస్తున్న ఆకుల లలితకు.. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల ఎస్.ఐ.ఆర్. కో ఆర్డినేటర్ బాధ్యతలు దక్కాయి. ఆమె కూడా… సీరియస్‌గా తీసుకుని రెండు నియోజకవర్గాల్లో విస్తృత్తంగా పర్యటించారట. ఐతే తాను గతంలో రూరల్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఆ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టారట. కానీ… ఆ వ్యవహారం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి నచ్చలేదంటున్నారు. ఆ క్రమంలోనే… మండల అధ్యక్షులు సహాయ నిరాకరణ చేశారంటూ లలిత పీసీసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అర్బన్, రూరల్ నేతలు తనకు సహకరించడం లేదంటూ పలు సమావేశాల్లో కూడా ప్రస్తావించారామె. మరోవైపు పీసీసీ అధ్యక్షుని సొంత జిల్లాలో.. ఎస్.ఐ.ఆర్. విషయంలో పార్టీ నేతల పనితీరు బాగోలేదంటూ… జూమ్ మీటింగ్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందులో భాగంగానే కో ఆర్డినేటర్ లలితను తప్పించి నల్గొండ సమన్వయకర్తగా ఉన్న ఉన్న వరంగల్ జిల్లా నేత జంగా రాఘవరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారట. పార్టీలో తిరిగి యాక్టివ్ అవుతున్న సమయంలో… ఆమెను ఎస్.ఐ.ఆర్. బాధ్యతల నుంచి ఉన్నఫళంగా తప్పించడం పట్ల హస్తం పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
లలిత ఫుల్‌టైం, బాగానే పనిచేసినా… నివేదికలు ఇవ్వడంలో మాత్రం వెనుకబడ్డారట. అందుకు ఆ రెండు నియోజకవర్గాల నేతలు సహకరించలేదన్నది ఆమె వాదన అయితే…. సాకులు కాదు, రిపోర్ట్ ఎక్కడ అన్నది పార్టీ పెద్దల ప్రశ్న. ఈ రెండు అంశాలను పక్కన పెడితే…. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మింగుడు పడకపోవడమే అసలు కారణం అయి ఉంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు అసెంబ్లీ కో ఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు రెండు నియోజకవర్గాలను చుట్టివచ్చి యాక్టివ్‌గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే…. బాధ్యతల నుంచి తప్పించాక… పార్టీ కార్యక్రమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతల తీరుపై రగిలిపోతున్నారట ఆమె. కొందరు నేతల వల్లే నివేదికలు ఇవ్వడంలో జాప్యం జరిగిందంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు అవకాశం వచ్చినట్లే వచ్చి దూరం కావడం పట్ల ఆమె సన్నిహితులు తెగ ఫీల్ అవుతున్నట్టు సమాచారం.
ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్న మాజీ ఎమ్మెల్యేకి… ఎస్.ఐ.ఆర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని కొందరు నేతలు కావాలనే దూరం చేశారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవి, లేదా ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్న మాజీకి.. పీసీసీ తాజా నిర్ణయం ఆ అవకాశాలను దూరం చేస్తుందా లేక మరో ఛాన్స్ ఉంటుందా అన్నది వేచి చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

