Site icon NTV Telugu

Off The Record: కొండపి నేతల కుప్పిగంతులు

Maxresdefault (2)

Maxresdefault (2)

సీఎం జగన్ ముందు కొండపి వైసీపీ నేతల కుప్పిగంతులు..మూల్యం చెల్లించక తప్పదా..? | OTR | Ntv

పార్టీ పెద్దలతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తుంటారు అధికారపార్టీ నాయకులు. కాకితో కబురంపినా రెక్కలు కట్టుకుని వాలిపోతారు. అలాంటి ఛాన్స్‌ దక్కినా.. గ్రూపులతో రచ్చ చేస్తున్న ఆ నియోజకవర్గ నేతలు మరోలా ప్రవర్తించారు. ఓసారి.. ఓ వర్గమే రావడంతో మీటింగ్‌ను మరో రోజుకు వాయిదా వేశారు. మరో డేట్‌ ఫిక్స్‌ చేస్తే ఈసారి రెండో వర్గం డుమ్మా కొట్టింది. ఇంకేముందీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. హైకమాండ్‌ను ధిక్కరించిన నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రచారం జరుగుతోంది.

అధిష్ఠానం పిలిచినా మీటింగ్‌కు వెళ్లకుండా గేమ్‌ ఆడారా?
పార్టీ అధిష్ఠానం పిలిచినా సమీక్షకు హాజరుకాకుండా గేమ్‌ ఆడింది ఎవరో కాదు.. ప్రకాశం జిల్లా కొండెపి వైసీపీ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలన్నది వైసీపీ పెద్దల ఆలోచన. కానీ.. ఆ ఆలోచనకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు ఇక్కడి పార్టీ నేతలు. గత ఎన్నికల్లో ఓడిన వైసీపీ మాజీ ఇంఛార్జ్‌ మాదాసి వెంకయ్యకు.. ప్రస్తుతం పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబుకు అస్సలు పడటం లేదు. ఈ సమస్యను సెట్ చేయాలని అనుకున్నారు పార్టీ పెద్దలు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో తాడేపల్లి రావాలని కొండెపి వైసీపీ నేతలను పార్టీ పెద్దలు తాడేపల్లికి పిలిచారు. సాక్షాత్తూ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సమీక్ష చేస్తారని చెప్పారట. కానీ.. రెండు వర్గాలు అధిష్ఠానంతోనే గేమ్‌ ఆడే ప్రయత్నం చేశాయట. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నవంబర్‌ 22 మీటింగ్‌కు వెళ్లని వెంకయ్య వర్గం?
మొదట గత ఏడాది నవంబర్‌ 22న తాడేపల్లి రావాలని కొండెపి వైసీపీ ముఖ్య నేతలకు సమాచారం వెళ్లింది. ఆ మీటింగ్‌కు మాజీ ఇంఛార్జ్‌ మాదాసి వెంకయ్య వర్గీయులు వెళ్లలేదు. అశోక్‌బాబును ఇంఛార్జ్‌గా కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాలేదని పార్టీ పెద్దలకు చెప్పారట. దాంతో జనవరి 19న రెండో మీటింగ్‌కు షెడ్యూల్‌ చేశారు. అంతా తాడేపల్లి రావాలని స్పష్టం చేశారట. అయితే రెండో మీటింగ్‌కు ప్రస్తుత ఇంఛార్జ్‌ అశోక్‌బాబు వర్గం డుమ్మా కొట్టేసింది. దీంతో చేసేది లేక రెండో మీటింగూ వాయిదా పడింది. పోయినసారి మీటింగ్‌కు మాదాసి వర్గం రాకపోవడంతో.. టిట్‌ ఫర్‌ టాట్‌లా ఉండాలని అశోక్‌బాబు వర్గం రెండో సమావేశానికి వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఇలా రెండు వర్గాలు గేమ్‌ ఆడటంతో వైసీపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.

కొండెపి వైసీపీలో మూడున్నరేళ్లుగా కుంపటి
గత ఎన్నికల్లో అశోక్‌బాబు వైసీపీ టికెట్‌ ఆశించారు. కానీ మాదాసి వెంకయ్యకు పార్టీ ఛాన్స్‌ ఇచ్చింది. దాంతో అశోక్‌బాబు వర్గం ఎన్నికల్లో వెంకయ్యకు సహకరించలేదని చెవులు కొరుక్కుంటోంది. వెంకయ్య ఓడినా.. ఆయన్ను డీసీసీబీ ఛైర్మన్‌ను చేసింది అధిష్ఠానం. అశోక్‌బాబుకు తిరిగి కొండెపి వైసీపీ పగ్గాలు అప్పగించింది. పార్టీ అధికారంలో ఉన్నా.. ఇద్దరూ కలిసి సాగడం లేదు. ఎవరి గ్రూపు వాళ్లదే. గత మూడున్నరేళ్లుగా ఇదే తంతు. రెండు వర్గాలను కూర్చోబెట్టి సర్దుబాటు చేయాలనుకునుకున్నారు అధినేత జగన్‌. దానికోసమే రెండుసార్లు మీటింగ్స్‌ ఏర్పాటు చేస్తే… ఓ సారి ఓ వర్గం.. మరోసారి మరో వర్గం డుమ్మా కొట్టాయి.

తీరు మార్చుకోకపోతే చర్యలేనని అధిష్ఠానం వార్నింగ్‌?
రెండుసార్లు సమీక్ష వాయిదా పడటంతో..ఈ నిర్లక్ష్యానికి కొండెపి వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇరువర్గాలు సమన్వయం చేసుకుని మరోసారి సమీక్షకు రావాలని ఆదేశాలిచ్చారట. తీరు మార్చుకోకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ముచ్చటగా మూడోసారి నిర్వహించే సమావేశానికి రెండు వర్గాలు వెళ్తాయో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది. వచ్చే మీటింగ్‌లో గట్టిగానే అక్షింతలు పడతాయని.. కొండెపి వైసీపీలో హాట్ హాట్‌ డిస్కషన్‌ జరుగుతోంది.

Exit mobile version