Off The Record: ఆ నాయకుడు మళ్ళీ గుడ్ మార్నింగ్ అంటూ జనం మధ్యకు రాబోతున్నారా? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కమ్మేసిన వైరాగ్యం ఇప్పుడు పూర్తిగా పోయిందా? ఇప్పుడు మళ్లీ ఎందుకు జనంలోకి రావాలనుకుంటున్నారాయన? జనం ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటా శుభోదయం కథకమామీషు?
ఏపీ పాలిటిక్స్‌లో గుడ్ మార్నింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ క్రియేట్ చేశారాయన. 2024లో ఓటమి తర్వాత తన ప్రోగ్రామ్‌కు బ్రేక్ ఇచ్చారాయన. 2007-08 టైంలో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కేతిరెడ్డి. ఉదయం 6 గంటలకే కాలనీల్లోకి వెళ్లే వారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రజలను కలుసుకునే వారు.
డ్రైనేజీ సమస్య నుంచి ప్రభుత్వ పథకాల వరకు.. వ్యక్తిగత సమస్య నుంచి అన్నింటినీ అడిగే వారు. ఏదైనా సమస్య ఉందంటే.. దాన్ని ఎలా పరిష్కరించాలి..ఏ అధికారి బాధ్యత వహించాలన్నది అక్కడికక్కడే చెప్పేవారు. అదే ఆయన్ని ప్రజలకు దగ్గర చేసింది.. రెండు సార్లు ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిపించింది. అన్నింటికీ మించి….. ఈ నినాదంతో రెండు రాష్ట్రాల్లో ఫేమ్ అయ్యేలా చేసింది. ఒకప్పుడు ఎక్కడ య్యూట్యూబ్ ఓపెన్ చేసినా.. రీల్స్ చూసినా గుడ్ మార్నింగ్ కార్యక్రమం కనిపించేది.
ఇక 2024ఎన్నికల్లో ఓటమి తర్వాతే అసలు కథ మొదలైంది. అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరించినా… జనం నన్ను ఓడించారు, అయినా బాధలేదుగానీ….. అసలు ముక్కు మోహం తెలియని వ్యక్తి నియోజకవర్గానికి వచ్చి.. ఓట్లు అడిగితే గుద్దేశారని, ప్రతి రోజు తాను ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ కష్టపడితే చివరికి ఇదా ఫలితం అంటూ వైరాగ్యంలోకి వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ఆపేశారు. అయితే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఆపడానికి మరో బలమైన కారణం కూడా ఉందని చెప్పుకున్నారు అప్పట్లో.
ఆయన గుడ్ మార్నింగ్ కు వెళ్లేది.. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కాదని, ఎక్కడ ఏ ఆస్తి ఉంది.. ఎవర్ని బెదిరిస్తే.. డబ్బు వస్తుందో తెలుసుకునేందుకేనని ఎన్నికల టైంలో కూటమి నాయకులు బలంగా ప్రచారం చేశారు. కేతిరెడ్డి ఓటమిలో ఇది కూడా ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఓటమి తర్వాత.. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మాజీ ఎమ్మెల్యే. తాను ప్రజలకు ఇంత దగ్గరగా ఉంటే నిందలు వేశారని, దాన్ని అంతా నమ్మేశారంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అంతే కాదు తాను ఎవర్ని బెదిరించానో, ఎవరి ఆస్తులు లాక్కున్నానో బయటకు వచ్చి చెప్పండని సవాల్ చేశారు. కానీ ఈ 18నెలల కాలంలో అలాంటి కంప్లయింట్స్ ఏవీ లేవు.
Off The Record : కవిత రాజీనామా ఆమోదానికి ఇక లైన్ క్లియర్ అయినట్టేనా?
ఈ క్రమంలో.. న్యూ ఇయర్ సందర్భంగా మరో నిర్ణయం తీసుకున్నారు కేతిరెడ్డి. దాదాపుగా రెండేళ్ళపాటు ఆగిన గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తానని ప్రకటించారు. ఇన్ని రోజులు నా మీద గాలి కూతలు కూశారు, సాక్ష్యాలు చూపించండ్రా అంటే చూపించలేదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయని.. మన పని మనం చేయాలని, అందుకే గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని రీ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చామని.. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తికి ఓట్లువేశారని..ప్రజలకు ఆయన చేసిందేమి లేదన్నారు. కనీసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదన్నారు కేతిరెడ్డి. ప్రజల తరపున వాటిని సాధించేందుకే తాను తిరిగి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నట్టు చెప్పడం ఆసక్తి రేపుతోంది. కేతిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చర్చ జరుగుతోంది. ఈసారి ఆయన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. అలాగే అధికారంలో ఉన్న కూటమి నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.