Site icon NTV Telugu

Off The Record: వైసీపీలో ఆ టికెట్ దక్కేది ఎవరికి?

Toorpu

Toorpu

శ్రీకాకుళం, తూ.గో. జిల్లా వైసీపీలో టికెట్ రేస్.. మరి ఛాన్స్ ఎవరికీ దక్కేను ? | OTR | Ntv

టికెట్‌ తెచ్చుకుంటే చాలు.. పోటీ చేసి గెలిచి ఈజీగానే చట్ట సభలో అడుగు పెట్టేయొచ్చు. లెక్కలు పక్కాగా ఉండటంతో అక్కడ నేతల ఆశలు కూడా బలంగానే ఉన్నాయి. కాకపోతే సామాజిక సమీకరణాలే అధికారపార్టీలో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

కుల సమీకరణాలే అభ్యర్థుల ఎంపికలో కీలకం
ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని అధికార వైసీపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు చర్చగా మారుతున్నాయి. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్లేస్‌లో శ్రీకాకుళంలోనూ.. మరో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలోనూ MLC ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు సీట్లు తాజా ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి. అందుకే టికెట్‌ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు వైసీపీలోని ఆశావహ నేతలు. అయితే సామాజిక సమీకరణాలు కీలకం కాబోతున్నాయనే చర్చలో ఎవరు నిలుస్తారు.. ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.

శ్రీకాకుళం జిల్లాలో తూర్పుకాపులకు ప్రాధాన్యం?
శ్రీకాకుళం జిల్లాలో లీడింగ్‌ కమ్యూనిటీలు కాలింగ, వెలమ, తూర్పుకాపు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాలింగులకే ప్రాధాన్యం దక్కింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, జడ్పీ ఛైర్మన్‌ పిరియా విజయలక్ష్మిలు కాలింగ సామాజికవర్గమే. మంత్రి ధర్మాన ప్రసాదరావు వెలమ సామాజికవర్గం. డీసీసీబీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు తూర్పుకాపు. దీంతో సామాజిక కోణంలో ఎమ్మెల్సీ టికెట్‌ తూర్పు కాపులకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీసీలకే టికెట్‌ ఇవ్వాలని అనుకుంటే.. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నర్తు రామారావు, తదితరుల పేర్లు పరిశీలించొచ్చని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో వెలమ, తూర్పు కాపు కులాలు బలమైన సామాజికవర్గాలు కావడంతో.. రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకునే అభ్యర్థి ఎంపిక ఉంటుందని సమాచారం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకు ఎమ్మెల్సీ సీటు?
ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఆల్‌రెడీ వైసీపీ ఖాతాలో ఉంది. అనంత ఉదయబాబు శాసనమండలి సభ్యుడు. టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. ఖాళీ కాబోతున్న చిక్కాల ప్లేస్‌లోనే ఇప్పుడు ఎన్నిక ఉండనుంది. ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల MLC కోటాలో మొత్తం ఓటర్లు దాదాపు రెండు వేల వరకు ఉన్నారు. ఈ దఫా కోనసీమ ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

శెట్టిబలిజలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ..?
శెట్టిబలిజలకు ఎమ్మెల్సీ ఆఫర్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది. శెట్టిబలిజ సంఘం నేత కుడుపూడి సూర్యనారాయణరావు, ఇదే సంఘానికి చెందిన యువ నేత వాసంశెట్టి సుభాష్‌తోపాటు MRPS నాయకుడు బొమ్మి ఇజ్రాయెల్‌ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందట. అమలాపురం అల్లర్ల తర్వాత శెట్టిబలిజ యువకులపై కేసులు పెట్టడంతో వాళ్లంతా గుర్రుగా ఉన్నారు. దాంతో ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కుడుపూడి లేదా వాసంశెట్టిలకు ఛాన్స్‌ ఇస్తారని సమాచారం. వాసంశెట్టి కోసం ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే మంత్రులు విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ వ్యతిరేకిస్తున్నారట. అమలాపురం అల్లర్ల తర్వాత కాపులు, శెట్టిబలిజల్లో ఐక్యత వచ్చి కొత్త సమీకరణాలకు తెరలేచింది. రానున్న ఎన్నికల్లో SC రిజర్డ్వ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన వాళ్లకు మద్దతు తెలియజేయాలని కాపు, శెట్టిబలిజలు నిర్ణయించాయి. దాంతో మాదిగలను దగ్గర చేసుకునేందుకు ఇజ్రాయెల్‌ను ఎంపిక చేస్తారనే వాదనా ఉంది. మొత్తానికి రెండు జిల్లాల్లోనూ కుల సమీకరణాలే అభ్యర్థుల ఎంపికలో కీలకం కాబోతున్నాయి.

 

Exit mobile version