ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగాలని ఒకరు.. ఒక్క ఛాన్స్ అంటూ మరొకరు.. తాజాగా ఆ ఇద్దరు నేతలు వేర్వేరుగా దూకుడు పెంచడంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇద్దరు నేతల తీరుతో ఎటు వైపు ఉండాలో తేల్చుకోలేక సీనియర్లు సైతం బేజారెత్తిపోతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు… వారిద్దరి మధ్య వివాదం ఏంటి? అసలు ఇదెక్కడి రాజకీయం? వాచ్ దిస్ స్టోరీ.
ఎవరికి వారే యమునా తీరే
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల తీరు కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు జరుగుతున్న నిరసన, ఆందోళన కార్యక్రమాలను… ఎవరికి వారే అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చల్లమల్ల కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నారట. దీంతో ఎటువైపు వెళ్లాలో, ఎవరి వైపు ఉండాలో అర్థంకాని పరిస్థితి నియోజకవర్గ కార్యకర్తల్లో నెలకొందట. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి… రెండుసార్లు కూడా ఓటమిపాలు కావడంతో… ముచ్చటగా మూడోసారి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చల్లమల్ల కృష్ణారెడ్డి… ఆమె కంటే ఒక అడుగు ముందుకు వేస్తుండటంతో మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితి మరోలా తయారైందట.
మునుగోడు ఉప ఎన్నికల్లో స్రవంతికి మరోసారి అవకాశం
2014లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతికి… ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ ఉపఎన్నిక సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మద్దతుతో టికెట్ రేసులోకి వచ్చిన చల్లమల్ల కృష్ణారెడ్డి.. మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ల జోక్యంతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి చలమల్ల కృష్ణారెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వచ్చేసారి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పాల్వాయి స్రవంతి కోరుతున్నారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్‌లో స్రవంతి వర్సెస్ కృష్ణారెడ్డి అన్నట్లుగా పరిస్థితి తయారైందట.
అగమ్యగోచరంగా పార్టీ కార్యకర్తల పరిస్థితి
గత కొద్దిరోజులుగా అధికార పార్టీపై ఆందోళనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఇద్దరు నేతలు వేర్వేరుగా నిర్వహిస్తుండటమే… స్రవంతి, కృష్ణారెడ్డి మధ్య విభేదాలకు నిదర్శనమని అంటున్నారు కార్యకర్తలు. నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఇద్దరు కీలక నేతల పరిస్థితి ఇలా ఉండటంతో అగమ్య గోచరంగా తయారైందట కార్యకర్తల పరిస్థితి. తాజాగా పీసీసీ జనరల్ సెక్రటరీ పదవి రావడంతో మరింత దూకుడుగా పెంచారట కృష్ణారెడ్డి. మండల స్థాయి పదవుల పంపకాల్లో కూడా తన మార్క్ ఉండే విధంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్‌కు తెరదించాలని పార్టీ సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి? అధికార పార్టీని ఢీకొనే దమ్ము ఉన్న నేత ఎవరు? అన్న చర్చ కార్యకర్తల్లో జోరుగా జరుగుతోంది.
కలసి నడవాల్సిన సమయంలో వేర్వేరుగా అడుగులు
మొత్తంమీద మునుగోడు నియోజకవర్గంలో కలిసి నడవాల్సిన సమయంలో వేర్వేరుగా అడుగులు వేస్తుండటం, ఎవరికి వారే అన్నట్లుగా పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతుండటం… పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. సీనియర్లను కంగారు పెడుతోంది. మరి ఈ పరిస్థితి కాంగ్రెస్ పెద్దలు ఎలా చెక్ పెడతారో చూడాలి.