టీకాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్ వచ్చారు. ఎవరేం చెప్పినా వింటున్నారు? ఎవరు అడిగినా అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు? వివరాలు తెలుసుకుని ఆయన ఏం చేస్తున్నారు? బయటకు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ వ్యక్తం చేయకుండా.. తాను చేయాల్సింది ఏంటో చేసేస్తున్నారా? దీంతో పార్టీ నేతలకు ఆయన అంతరంగం అంతుచిక్కడం లేదా?
అందరూ చెప్పింది ఆలకిస్తున్నారు
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మాణిక్‌రావు థాక్రే వచ్చాక.. పార్టీ నాయకులను పిలిచి మాట్లాడుతున్నారు. అభ్యంతరాలు ఉన్నవారికి ఎక్కువ సమయం ఇచ్చి.. వారు చెప్పేది ఓపికగా వింటున్నారు. మరి.. థాక్రే ఏమనుకుంటున్నారు? అనేది పెద్ద మిస్టరీ. ఏఐసీసీ నుంచి మొదలుకొని పీసీసీ వరకు ఎవరిపై ఎలాంటి ఫిర్యాదు చేసినా ఆలకిస్తున్నారు థాక్రే. ఇప్పటికే పలు దఫాలుగా హైదరాబాద్ వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్తున్నారు. వస్తే పార్టీ కార్యకలాపాల్లో బిజీ అయిపోతున్నారు. దీంతో థాక్రే వర్కింగ్ స్టయిల్ ఏంటి? ఆయన ఏం చేస్తున్నారో తమకే అర్థం కావడం లేదని ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. వాస్తవానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాణిక్‌రావు థాక్రే సన్నిహితుడని టాక్. అంతా ఖర్గే గైడ్‌లైన్స్‌లోనే ఇంఛార్జ్ పనిచేస్తున్నారని సమాచారం.
ఠాగూర్, థాక్రే పనితీరు పూర్తిగా భిన్నమా?
గతంలో AICC వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాగూర్ టీ కాంగ్రెస్‌లో ఎవరికీ సమయం ఇచ్చేవారు కాదనే విమర్శలు వచ్చాయి. పార్టీలో ఎవరి అభిప్రాయాలు ఠాగూర్ వినేవారు కాదని గగ్గోలు పెట్టేవారు. ఇప్పుడు మాణిక్కం ఠాగూర్ ప్లేస్‌లో మాణిక్‌రావు థాక్రే వచ్చారు. ఠాగూర్ పనితీరుకు.. థాక్రే వర్కింగ్ స్టయిల్‌కు అస్సలు పొంతన లేదు. థాక్రే ఎవరేం చెప్పినా వినడమే కాదు.. అడిగినవాళ్లందరికీ కాదనకుండా టైమ్ కేటాయిస్తున్నారు. ఒకవేళ సమయం అడిగి రాకపోతే.. థాక్రేనే ఫోన్ చేసి ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారట.
అందరినీ పాదయాత్రలు చేయమన్న థాక్రే
మొన్నటి వరకు టీ కాంగ్రెస్‌లో పాదయాత్రలపై పంచాయితీ ఉండేది. కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతి లేకుండా పాదయాత్ర ఎలా చేస్తారు అనే కామెంట్స్ వినిపించేవి. థాక్రే మాత్రం ఈ సమస్యకు రాష్ట్ర నేతల ఊహకందని విధంగా పరిష్కారం సూచించారు. ఏ ఒక్కరో కాదు.. అందరూ పాదయాత్రలు చేయండి అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం నేతల వంతైంది. పీసీసీ నేతలతోపాటు సీఎల్పీలో కీలకంగా పనిచేసిన నాయకులు కూడా పాదయాత్ర చేయాలని అని చెప్పడమే కాదు.. అవి ఎలా చేపడతారో అని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నాయకుల వెంటపడి మరీ కోఆర్డినేట్ చేస్తున్నారు కూడా.
టీ కాంగ్రెస్ పరిస్థితిపై హైకమాండ్‌కు థాక్రే నివేదిక?
ఇటీవలే కాంగ్రెస్ హైకమాండ్‌తో థాక్రే సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని అధిష్ఠానానికి చెప్పినట్టు సమాచారం. ఓ నివేదిక కూడా ఇచ్చారట. అయితే థాక్రే ఏం చెప్పారో.. ఎలాంటి నివేదిక ఇచ్చారో బయటకు పొక్కలేదు. ఆ విషయం ఆలస్యంగా తెలియడంతో అవాక్కయ్యారు నాయకులు. ఇప్పుడు కొత్త ఇంఛార్జ్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద సవాలే. పొత్తులపై కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అందుకే థాక్రే ఈ సమస్యను ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.