NTV Telugu Site icon

Off The Record: బీజేపీలో ముగ్గురు నేతల మూడుముక్కలాట

Maxresdefault (3)

Maxresdefault (3)

ఆ జిల్లా బీజేపీలో ఆ ముగ్గురు నేతలు పార్టీని గ్రూపులుగా చీల్చేశారా..? l Off the Record l NTV

ఆ జిల్లా బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? అర్బన్ సీటుపై కన్నేసిన ముగ్గురు నేతలు పార్టీని గ్రూపులుగా చీల్చేశారా? ఇప్పుడు ఉనికికోసం ఆపసోపాలు పడుతున్నారా? అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

మూడు ముక్కలాటలా బీజేపీ గొడవలు
ఇందూరు జిల్లాలో హాట్‌ సిట్‌గా ఉన్న నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో.. బీజేపీ నేతలకు అస్సలు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, నియోజకవర్గ ఇంఛార్జ్‌ ధన్‌పాల్‌ సూర్యనారాయణలు ముగ్గూరు అర్బన్‌ సీటుపై కన్నేశారు. గత ఎన్నికల్లోనే చివరి క్షణంలో సీటు చేజారిందనే కసితో ఉన్నారు ధన్‌పాల్‌. ఈసారి మాత్రం పోటీ చేసి తీరుతానని తన వర్గంతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మళ్లీ గెలిచి పట్టు నిలుపుకొంటానంటున్నారు యెండల. వీరిద్దరి మధ్యలో ఒక్కఛాన్స్‌ అంటున్నారు లక్ష్మీనర్సయ్య. దీంతో మూడు ముక్కలాటలా మారిపోయింది నిజామాబాద్‌ అర్బన్‌ బీజేపీ గొడవలు.

ఇప్పటికే ఎంపీ వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యేగా పోరు
బీజేపీ ఎంపీ వర్గంలోని నేతగా ధనపాల్‌కు ముద్రపడింది. టికెట్‌ రాకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతామన్న అనుమానంతో యెండల శిబిరంలో చేరారు లక్ష్మీనర్సయ్య. ప్రస్తుతం వీరి మధ్య కేడర్‌ చీలిపోయింది. వేర్వేరుగా ప్రజాపోరాటాలు చేస్తూ కేడర్‌ను గందరగోళంలో పడేస్తున్నారు నాయకులు. పాత ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేతలపై పార్టీ చేపట్టిన నిరసనలో ఎవరికివారేగా ఉండటంతో బీజేపీ అభాసుపాలైందని కేడర్‌ చిన్నబుచ్చుకుందట. నియోజవర్గంలో బీజేపీ ఎంపీ వర్సెస్‌ యెండల అనేలా ఇప్పటికే కత్తులు దూసుకుంటున్నారు. ఈ వర్గపోరు ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందని కేడర్‌ ఆందోళన చెందుతున్నా.. అధిష్ఠానం పట్టించుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఎవరికి వారు ఉనికి కోసం పోరాటం
బీజేపీకి నియోజకవర్గంలో రెండు కళ్లుగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాల్సి నేతలు.. అంతర్గత విభేదాలతో ఉనికి కోసం పోరాడటం రాష్ట్ర నేతలకు కూడా మింగుడు పడటం లేదట. కమలం పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధించాలంటే.. అగ్రనాయకత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారట. మరి.. కేడర్‌ ఆశిస్తున్నట్టు ఈ మూడు ముక్కలాటకు అధిష్ఠానం ఫుల్‌స్టాప్‌ పెడుతుందో లేదో చూడాలి.