Off The Record: కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్టుగా… గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి కూడా చాలా రీజన్సే ఉన్నాయి. ఓవరాల్‌గా ఘోర పరాజయం ఒక ఎత్తయితే.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేవలం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్లే నష్టం జరిగిందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే ఉంది. అలాంటి వాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అంటున్నారు. ఇక్కడి శింగనమల, మడకశిర నియోజకవర్గాలనే ఉదాహరణగా తీసుకుంటే… రెండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు చాలా గట్టి దెబ్బే కొట్టాయన్న సంగతి కాస్త ఆలస్యంగా అర్ధమైందట. శింగనమలలో అప్పటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని ప్రయోగాత్మకంగా… సామాన్యుడు, టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చింది వైసీపీ. అసలు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని, కనీసం పది లక్షల రూపాయల ఎన్నికల ఖర్చుకూడా పెట్టే ఆర్థిక స్థోమతలేని వ్యక్తిని బరిలో దింపి ఒకరకంగా వైసీపీ అధిష్టానం సాహసం చేసిందన్న మాటలు అప్పట్లోనే వినిపించాయి.
ఇక మడకశిరలో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడ సిట్టింగ్ తిప్పేస్వామిని కాదని.. ఉపాధి హామీ కూలికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఫ్యాన్ అధిష్టానం. ఆయనకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. ఈ రెండు చోట్ల పార్టీ బలంగా ఉన్నా, దీటైన నాయకులు కొనసాగుతున్నా….ఎన్నికల ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి. ఇలా ప్రయోగాలు చేసి చేయి కాల్చుకున్నాకగానీ…పార్టీ అధిష్టానానికి తత్వం బోథపడలేదట. దాంతో ఇప్పుడు రియలైజ్ అయి…. ఇక మీదట అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకూడదని చాలా గట్టిగా డిసైడ్ అయినట్టు సమాచారం. అందుకే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
ముందుగా శింగనమలలో ఓడిపోయిన అభ్యర్థి వీరాంజనేయులను పక్కన పెట్టి.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన శైలజానాథ్‌కు పగ్గాలు అప్పగించారు. శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. రెండు సార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అందుకే ఆయనకు ఛాన్స్ ఇచ్చారట. ఇప్పటికే శింగనమలలో శైలజానాథ్ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మడకశిర విషయంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. అయితే… ఈ ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లో ఆయా సామాజికవర్గాల నుంచి అంగ బలం, అర్ధబలం ఉన్న నేతలు కనిపించడం లేదట. ఆసక్తి ఉన్న వేరే నియోజకవర్గాల నాయకులైనా సరే… ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే పరిశీలిస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఒకటి రెండు చోట్ల పాత నేతల వారసులకే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సదరు వారసులు ఇప్పటికే ఫీల్డ్‌లో యాక్టివ్ గా ఉన్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో సిట్టింగులను కాదని.. టికెట్లు ఇచ్చిన స్థానాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో చాలా మార్పులే చూస్తామంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలతో ఇప్పటికే ఉన్న వారిలో టెన్షన్ మొదలైంది.
