NTV Telugu Site icon

Off The Record: వైసీపీలోనే ఉంటానంటారు.. వేడి రాజేస్తారు.. ఎమ్మెల్యేపై బంధువు ఒత్తిడి ఉందా?

Vasantha Krishna Prasad

Vasantha Krishna Prasad

Off The Record: మైలవరం నియోజకవర్గం ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఈ సెగ్మెంటులో వసంత వర్సెస్ దేవినేని అన్నట్టు ఉండేది. గత కొంతకాలంగా మైలవరంలో వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వైఖరి ఆసక్తిగా మారింది. గతంలో ఒకట్రొండు సందర్బాల్లో మంత్రి జోగి రమేష్ వంటి నేతలను ఉద్దేశించి వసంత కొన్ని కామెంట్లు చేసినా.. ఆ తరవాత అధిష్ఠానం జోక్యంతో గొడవ సద్దుమణిగిందనే అంతా భావించారు. కానీ కొంత గ్యాప్ తర్వాత వసంత మళ్లీ మొదలెట్టారు. గుంటూరు తొక్కిసలాటపై ఎమ్మెల్యే వసంత చేసిన వ్యాఖ్యలు అధికారపార్టీ లైన్‌కు భిన్నంగా ఉన్నాయి. ఈ రచ్చ కొనసాగుతుండగానే రాజకీయాల్లో కొనసాగలేను అని ఆయన వాడిన కొన్ని పదాలు కలకలం రేపాయి. అలాగే.. ప్రత్యర్థి పార్టీలపై అకారణంగా కేసులు పెట్టలేనంటూ వసంత చేసిన కామెంట్స్‌ వైసీపీలో చర్చకు దారి తీశాయి.

సహజంగా పార్టీని వీడి వెళ్లే క్రమంలోనే ఈ తరహా కామెంట్లు చేస్తారు. అయితే ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? ఎలా అన్వయించుకుంటారో తెలియనంత అమాయకుడేం కాదని వసంతను ఉద్దేశించి కొందరు అభిప్రాయ పడతున్నారు. అన్నీ తెలిసే పదేపదే అలా మాట్లాడుతున్నారంటే కచ్చితంగా అజెండా వేరే ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే సమయంలో గతంలో వైసీపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడిన వసంత కృష్ణప్రసాద్‌ తండ్రి.. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తాజాగా కేశినేని నానితో భేటీ అయ్యారు. ఓవైపు కొడుకు వ్యాఖ్యలు.. మరోవైపు తండ్రి సమావేశాలు. ఏం సిగ్నల్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారనే విమర్శలు వైసీపీలో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వసంత మాత్రం తాను వైసీపీలోనే ఉంటానని గట్టిగా చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే వివరణ పార్టీ పెద్దలకు ఎంత వరకు కనెక్ట్‌ అయ్యిందన్నదే ప్రశ్న.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా అనేది సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు వసంత కృష్ణప్రసాద్‌. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే.. రాజకీయాలకు దూరంగా ఉంటా కానీ.. పార్టీ మారబోనంటున్నారు వసంత. అలాగే టీడీపీ ఎంపీ కేశినేని నానితో తన భేటీకి రాజకీయాలకు సంబంధం లేదన్నారు వసంత నాగేశ్వరరావు. ఎమ్మెల్యే వసంతకు పార్టీ మారడం ఇష్టం ఉందో లేదో కానీ.. ఆయన మీద మాత్రం ఒత్తిడి చాలనే ఉందట. ముఖ్యంగా వసంతకు తన సమీప బంధువు నుంచి ఎక్కువ ఒత్తిడి ఉన్నట్టు సమాచారం. ఆ ఒత్తిడి చేస్తున్న వ్యక్తి సమీప బంధువు అనే కంటే.. దాదాపు ఇంట్లో మనిషేననే అంటున్నారు. పైగా ఆ ఇంటిలో మనిషి నందమూరి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటారట. దాంతో ఎమ్మెల్యే వసంత తాజా వ్యాఖ్యలకు.. ఆ మనిషి ఒత్తిడికి ఏదైనా లింకు ఉందా అని ఆరా తీస్తున్నారట. ఆ కారణంగానే తండ్రీకొడుకులు ఇద్దరూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో ఉందట. వసంత సన్నిహితులు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు. మరి.. లోగుట్టు ఏంటో కాలమే చెప్పాలి.