Off The Record: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైందట వైసీపీ పరిస్థితి. 2019 ఎన్నికల్లో కీలకంగా నిలిచిన చోట ఇప్పుడెందుకు ఇలా తయారైందన్న అంతర్మధనం మొదలైనట్టు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు పనిచేసే నాయకులకు గుర్తింపు ఇవ్వకుండా పైరవీకారులకు పెద్దపీట వేయడం వల్లే డ్యామేజ్ గట్టిగా జరిగిందని ఇప్పుడు లెక్కలేసుకుంటున్నారు జిల్లా నేతలు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నాయకులకు ప్రాధాన్యత విషయంలో పార్టీ కేలిక్యులేషన్ తప్పిందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆ సామాజికవర్గంలో పార్టీ కోసం కష్టపడ్డవాళ్ళను కాకుండా పైపైన మేనేజ్ చేసిన వాళ్లకు ఇవ్వడం వల్లే కీలకమైన జిల్లాలో దెబ్బ పడిందని చెప్పుకుంటున్నారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక ఏలూరు అసెంబ్లీ సీటు నుంచి గెలిచిన ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ నానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఛాన్స్ దక్కింది. ఆయన పదవిలో ఉన్నంతకాలం పైరవీలకే ప్రాధాన్యత ఇచ్చి… 2024లో ఓటమి తర్వాత అర్ధంతరంగా పార్టీని వదిలి పక్కకి జరిగారని అంటున్నారు జిల్లా వైసీపీ లీడర్స్.
ఇక మంత్రివర్గ విస్తరణలో డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కించుకున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సైతం 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. తర్వాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, ప్రభావం చూపలేకపోతున్నారనే కారణాలతో ఏకంగా ఆయన్ని ఇన్చార్జి పదవినుంచి తప్పించాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. కీలక పదవులు దక్కించుకున్న కాపు నేతల సంగతి పక్కనపెడితే…. తన నియోజకవర్గంలో వేరే నాయకులు జోక్యం చేసుకోవడంపై అసంతృప్తికి గురైన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడి న్యూట్రల్‌గా ఉన్నారు. పదవులు అనుభవించిన వారు పనిచేయక, పనిచేసే వాళ్ళకు దక్కక పోవడం వల్లే ఈ మూడు నియోజకవర్గాల్లో వైసిపి పూర్తిగా మైనస్ అయిందని లెక్కలు వేస్తున్నారు. కేవలం ప్రాధాన్యత విషయంలోనే కాకుండా…కాపు సామాజిక వర్గ నేతలకు సీట్లు ఇచ్చే విషయంలోనూ 2024లో తమ అగ్రనాయకత్వం అనవసర ప్రయోగాలు చేసిందని సొంత నేతలే విమర్శిస్తున్నారు. కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే నరసాపురం లోక్‌సభ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయించడంతో పార్టీకి రావలసిన మైలేజ్ దక్కలేదన్న లెక్కలు కూడా ఉన్నాయి.
నరసాపురం పార్లమెంటు పరిధిలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట అసెంబ్లీ సీట్లలో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ. అలాంటి చోట ఆ కులం నేతలకు కాకుండా ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చి విఫల ప్రయోగం చేశారన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో క్షత్రియులు ఇన్చార్జ్‌లుగా ఉంటూ కాపు సామాజికవర్గ నేతలను దూరంగా పెట్టడం వల్ల నష్టం జరిగిందన్న అభిప్రాయం ఉంది. ఇక పాలకొల్లులోవరుస పెట్టి ఇన్చార్జ్‌లను మార్చుతున్నారు తప్ప అక్కడి అవసరాలకు తగ్గట్టుగా కాపు సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యత కల్పించడంలేదన్న వాదన ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందిన నేతలు పైరవీలు చేయడం తప్ప పనిచేయ లేదని.. అధికారం పోయాక వాళ్ళు పక్కకి జరగడంతో పార్టీకి నష్టం జరిగిందని చెబుతున్నారు. ఇక కష్టపడి పని చేసిన వాళ్ళలో కూడా మనం ఎంత చేసినా అంతేనన్న నైరాశ్యం పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని పార్టీ జిల్లా కాపు నాయకులు మాట్లాడుకుంటున్నారు. టీడీపీతో పాటు జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం నేతలకు ప్రాధాన్యత కల్పించే విషయంలో ఇప్పటికైనా పార్టీ పెద్దలు పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు అక్కడి నేతలు. గత ఎన్నికల్లో చేసిన అనవసర ప్రయోగాలు రిపీట్ అవకుండా క్యాడర్ ను పట్టించుకునే వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
