అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కావాలని చేసుకుంటున్నారో లేక అనుకోకుండా జరుగుతోందో కానీ.. సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో రాప్తాడులో జరుగుతున్న సంఘటనలు పీక్ స్టేజ్ కి వెళ్తున్నాయి. గతంలో పరిటాల కుటుంబంపై సుధీర్ఘ పోరాటం తరువాత 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి విజయం దక్కింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తర్వాత ఆయనకు అన్నీ సమస్యలే. అధికారం లేనప్పుడు నాయకులకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే బలం అవుతుంది. అదే అధికారంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ జోక్యం.. ఓవరాక్షన్ అయితే మైనస్‌గా మారడం… పెద్ద సమస్య కావడం ఖాయం. రాప్తాడులో ఏర్పాటు కావాల్సిన జాకీ పరిశ్రమ తెలంగాణకు పోయిందని.. దానికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బెదిరింపులే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా టార్గెట్ చేశాయి. దీనిపై మీడియాలో వరుస కథనాలు రావడం రాజకీయం మరింత వేడిని రాజేసింది. దానికి ఎమ్మెల్యే పదే పదే వివరణలు మీద వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా వివరణలు ఇస్తూనే ఉన్నారు కూడా. సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చందు టీడీపీ అధినేత.. ఆయన తనయుడుతోపాటు మరికొందరిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ కామెంట్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు.. పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అనంతలో టీడీపీ నేతలు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లితే పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌లు చేశారు. ఇదే టైమ్‌లో అనుచరులతో చందు ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తతలకు దారితీసింది.
వ్యవహారం తీవ్ర రూపం దాల్చడంతో వైసీపీ హైకమాండ్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుంది. అందుకేనేమో.. అప్పటి వరకు తగ్గేదే లేదన్నట్టుగా ఉన్న ఎమ్మెల్యే సోదరుడు ఒక్కరోజులో మెట్టు దిగారు. చివరకు తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరారు. అయినప్పటికీ వివాదం మాత్రం ఆగలేదు. తన మీద అనవసర విమర్శలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారనే ఆవేదనతో ఆ మాటలు వచ్చాయని.. సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేశారు. ఆ వివాదం చల్లారక ముందే ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో రాత్రివేళ తోపుదుర్తి చందు హల్చల్ చేశారు. కూడేరు మండలం కడదరకుంటకు చెందిన ఓ భూ వివాదంలో డీవీ నాయుడు, గౌరి శంకర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేకి.. ఎమ్మెల్యే సోదరుడికి కావాల్సిన వాళ్లట. ఇంకేం ఉంది.. సినీ స్టయిల్లో చందు ఎంటర్ అయ్యారు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్ గేట్స్ మూసేశారట. ఆయన స్టేషన్‌లో ఉన్నంత సేపూ బయట నుంచి లోపలికి.. లోపలి నుంచి బయటకు ఎవరినీ అనుమతించవద్దని పోలీసులు ఆదేశించారట. పోలీసులు కూడా ఆయన చెప్పిందే చేశారట. ఈ విధంగా స్టేషన్‌లో ఎమ్మెల్యే సోదరుడు హల్చల్ చేయడం మరో వివాదానికి దారితీస్తోంది.
పరిటాల ఫ్యామిలీని ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న తోపుదుర్తి ఇప్పుడు వరుస వివాదాలతో అంతకుమించి వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటున్నారు. వరస ఘటనలు రాప్తాడు వైసీపీ నేతలకు కూడా ఇబ్బందిగా మారుతోందట. నియోజకవర్గంలో చిన్నపాటి సమస్యలే రాష్ట్రస్థాయి అంశాలుగా మారుతున్నాయని జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.