Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఒకటి యలమంచిలి. ఇక్కడ కాపు, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. గతంలో లేకున్నా… ఓట్ బ్యాంక్ ఆధారంగా ఇక్కడ పోటీ చేసేందుకు కాపు నేతలు ఆరాటపడటం దశాబ్ద కాలంగా కనిపిస్తోంది. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహా ఎక్కువ సార్లు గెలిచింది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. దీంతో ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వ్యూహాలు కాపుల చుట్టూనే తిరుగుతుంటాయి. 2024 ఎన్నికల్లో కూటమి టిక్కెట్ కోసం జనసేన నుంచి సుందరపు, టీడీపీ తరపున ప్రగడ నాగే శ్వరరావు పోటీపడ్డారు. చివరికి గ్లాస్ కోటాలోకి వెళ్ళగా అంత కలిసి పనిచేసి నియోజకవర్గంలో ఇంతకు ముందు లేనట్టుగా సుమారు 49వేల మెజార్టీ సాధించారు. కానీ.. గెలుపు తర్వాతే అసలాట మైదలైందట. ఎలక్షన్స్ ముగిసిన కొద్ది రోజులకే కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు రాష్ట్ర రహదారుల అభివ్రుద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించాక కూటమి రాజకీయం రసకం దాయంలో పడింది. ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై టీడీపీ హైకమాండ్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్తున్నాయట. అలా… కూటమి కుమ్ములాటలు పరస్పరం డ్యామేజ్ చేసుకునే స్థాయికి వెళ్తున్నాయన్నది నియోజకవర్గంలో టాక్.
ఇక్కడే వైసీపీ పాత్ర ఏంటన్న చర్చ జరుగుతోంది. పరిస్థితిని గమనించిన వైసీపీ అధిష్టానం అడ్వాంటేజ్ కోసం ఎత్తులు వేస్తున్నా… నియోజకవర్గ నాయకులు మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి…నియోజకవర్గంలో కింగ్ మేకర్ ఇమేజ్ సంపాదించిన సీనియర్ నేత యూవీ రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబురాజు వివిధ కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన పొలిటికల్ జర్నీ కొనసాగిస్తారా…?. లేదా…? అనే స్ధాయిలో చర్చ జరిగింది. ఐతే, పవర్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడుగా ముద్రపడ్డ కన్నబాబురాజు తీసుకున్నది షార్ట్ గ్యాపేనంటూ తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే.. ఇక్కడే పార్టీ అధిష్టానం లెక్కలు మారిపోయాయి. ఎమ్మెల్యే కాపు కాబట్టి… ఆయనతో ఫైటింగ్ కోసం కాపు లీడరే కరెక్ట్ అనుకుంటూ… మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని చోడవరం నుంచి యలమంచిలి షిఫ్ట్ చేసింది. అందుకు మాజీ ఎమ్మెల్యే వైపు నుంచి కూడా అభ్యంతరాలు లేవు, ఆల్‌సెట్ అనుకుంటున్న టైంలో కథ కొత్త మలుపు తిరిగింది. ఈ నియోజకవర్గంలో కాపుల తర్వాత రాజకీయంగా ప్రభావితం చేయగలిగేది గవర్లు. ఆ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్ గత ఎన్నికల్లోనే యలమంచిలి టిక్కెట్ ఆశించారు.
కానీ… అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కన్నబాబు రాజుకే ఛాన్స్ దక్కింది. బొడ్డేటిలో ఆ అసంతృప్తి అలా రగులుతూనే ఉందట. ఈ పరిస్థితుల్లో… ధర్మశ్రీ కాపు, లోకల్ కార్డు పట్టుకుని తిరుగుతుంటే నియోజకవర్గ పార్టీలో రియల్ ప్లేయర్లుగా బొడ్డేటి, రమణమూర్తిరాజులు కనిపిస్తున్నారు. ఎవరికి వారు ఉనికి కోసం ఆరాటపడుతుండటం, పోటాపోటీగా వ్యవహరించడం గ్రూపులకు ఆజ్యం పోస్తోందని అంటున్నారు యలమంచిలి ద్వితీయ శ్రేణి నాయకులు. అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా వున్న బొడ్డేటి ప్రసాద్…..ఇటీవలి జగన్ టూర్లో బలప్రదర్శన చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా ఏ మాత్రం తగ్గలేదు. వాళ్ళిద్దరి మధ్య కొత్తగా వచ్చిన ధర్మశ్రీ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చిందట. రమణ మూర్తి రాజు, బొడ్డేటి మధ్య పోటీతో కేడర్‌లో మళ్ళీ కలవరం మొదలైందన్న చర్చ నడుస్తోంది.నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగానే ఉన్నా…, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కు కూటమిలోనే వ్యతిరేకత కనిపిస్తున్నా… దాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం వెనకబడుతున్నామని మాట్లాడుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు. పార్టీలో మూడు ముక్కలాటకు ముగింపు పలకకపోతే స్థానిక ఎన్నికల్లో… కనీస ప్రభావం కూడా చూపలేకపోవచ్చన్న భయమ వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోందట. ఓవరాల్‌గా చూస్తే… కూటమి కుమ్ములాటలతో ఆళ్ళో రకం, మూడు ముక్కలాటతో ఈళ్ళో రకంలా ఉన్నారన్నది యలమంచిలి టాక్.
