Site icon NTV Telugu

Off The Record: అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా..? వ్యూహం ఏంటి..?

Ycp

Ycp

Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ… 11మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ పార్టీకి టెక్నిక‌ల్‌గా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే… సభలో నాలుగు పార్టీలు ఉండగా… మూడు కూటమి మిత్రపక్షాలే. ఇక మిగిలి ఉంది మేమే కాబట్టి… మాకు ఆ హోదా కావాలన్నది వైసీపీ డిమాండ్‌. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలాపడితే అలా ఇచ్చేసేదికాదని, సభా నియమాల ప్రకారం నడుచుకుంటూ అందుకు తగ్గట్టు జనం ఇచ్చిన తీర్పును బట్టే ఇచ్చేదన్నది ప్రభుత్వ వాదన. ఈ విష‌యంలో వైసీపీ కోర్ట్‌కు వెళ్ళినా లక్ష్యం మాత్రం నేరవేరలేదు. త‌మ‌కు ప్రధాన ప్రతిప‌క్ష హోదా ఇవ్వక‌పోతే స‌భ‌లో ఎక్కువ స‌మ‌యం మాట్లాడే అవ‌కాశం ఉండదు కాబ‌ట్టి మేం… అసెంబ్లీకి రాబోమంటూ… పట్టుదలగా ఉన్నారు మాజీ సీఎం జ‌గ‌న్. ఈ పరిస్థితుల్లో… వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త భయం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే ప్రతీసారి వైసీపీ వాళ్లు స‌భ‌కు రావాలి.. రాకుంటే చ‌ర్యలు త‌ప్పవని అంటున్నారు స్పీక‌ర్, డిప్యూటీ స్పీక‌ర్. బ‌డ్జెట్ సెష‌న్‌లో వైసీపీ సభ్యులు మమ అనిపించినా… టెక్నిక‌ల్‌గా అవి కౌంట్‌లోకి రాలేదు. దీంతో వ‌రుస‌గా 60 రోజులు స‌భ‌కు హాజ‌రుకాని ఎమ్మెల్యేల‌పై చ‌ర్యలు తీసుకోవచ్చని తాజాగా హాట్‌ కామెంట్స్ చేశారు ఏపీ స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు.

Read Also: YS Jagan Key Meeting: 24న వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం.

ప్రస్తుతం సెషన్‌ నడుస్తున్న క్రమంలో… స‌భ‌కు హాజ‌రవకుంటే… అనర్హత వేటు వేస్తామని, మీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా హెచ్చరించారు. ఇదే ఇప్పుడు పొలిటికల్‌ హాట్‌ అయ్యింది. తమ ఎమ్మెల్యేల‌పై చ‌ర్యల అంశంలో గతంలోనే స్పందించారు వైపీసీ అధ్యక్షుడు జగన్‌. వాళ్లకు బుద్ది పుట్టిన‌ట్టు చ‌ర్యలు తీసుకోమ‌నండి… ఎవ‌రు కాద‌న్నారంటూ రియాక్ట్‌ అయ్యారాయన. తాజాగా వైసీపీ ఎల్పీ స‌మావేశంలో కూడా ఇదే అంశం చ‌ర్చకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఈ అంశాన్ని జ‌గ‌న్ ముందు ప్రస్తావించ‌టంతో ఆయ‌న కూడా గ‌తంలో స్పందించిన త‌ర‌హాలోనే చర్యలు తీసుకోనివ్వండి.. చూద్దాం అన్నట్టు తెలిసింది. అసెంబ్లీకి వెళ్లి ప్రజా స‌మ‌స్యల‌పై చ‌ర్చించ‌టానికే క‌దా… మ‌నం స‌మ‌యం అడుగుతోంది. టెక్నికల్‌ రీజన్స్‌తో ప్రతిప‌క్ష హోదా ఇవ్వక‌పోయినా కనీసం నిర్దిష్ట స‌మ‌యం ఇస్తామ‌ని కూడా క్లారిటీగా చెప్పడం లేదు… 40 శాతం ఓట్లు వ‌చ్చిన మ‌న‌ల్ని సాధారణ స‌భ్యులుగా ప‌రిగ‌ణించి రెండు, మూడు నిమిషాల స‌మ‌యం ఇస్తే స‌రిపోదు కదా.. అని జగన్‌ అన్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో… సభకు వెళ్ళని సభ్యుల మీద ఏక‌ప‌క్షంగా చ‌ర్యలు తీసుకోవడం కూడా సాధ్యం కాద‌నేది వైసీపీ వ‌ర్షన్. చ‌ర్యలు తీసుకోబోయే ముందు స్పీక‌ర్ వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులకు వాళ్ళు స‌మాధానం చెప్పాలి. ఆ స‌మాధానాలకు సంతృప్తి చెంద‌క పోతేనే.. స్పీక‌ర్ చ‌ర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ విష‌యంలో ఇప్పటికే వైసీపీ కోర్ట్‌కు వెళ్లి ఉండ‌టం, స్పీక‌ర్ యాక్షన్ తీసుకున్నా తిరిగి కోర్టును ఆశ్రయించే అవ‌కాశం ఉండ‌టం లాంటి కారణాలతో సాగదీత ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేతప్ప ఇప్పటికిప్పుడు యాక్షన్‌ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. దీంతో ఒకరిద్దరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మిన‌హా మిగ‌తా వారిలో దాని గురించి అంత టెన్షన్‌ లేనట్టు తెలుస్తోంది. ఒకవేళ సీరియ‌స్ యాక్షన్ తీసుకున్నా… దానికి విరుగుడు మందును పార్టీ అధినేత జ‌గ‌న్ ఎలాగూ సిద్దం చేస్తారు కాబ‌ట్టి కంగారేం లేదన్నది సీనియర్‌ ఎమ్మెల్యేల అభిప్రాయం అట. స‌భ‌కు హాజ‌రవలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న దాఖ‌లాలు దేశంలో ఎక్కడా లేవని గుర్తు చేస్తున్నారు పొలిటిక‌ల్ పండిట్స్. రాజకీయ సవాళ్ళకు, చ‌ట్టప‌రంగా తీసుకునే చ‌ర్యల‌కు చాలా తేడా ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే… ఇవన్నీ తెలియకుండానే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్‌ చేస్తారా అన్నది ఇంకో క్వశ్చన్‌. దీంతో గవర్నమెంట్‌ యాక్షన్‌, అందుకు వైసీపీ రియాక్షన్‌ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version