Off The Record: విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయుకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదట. అధ్యక్ష స్థానం ఎవరిని వరిస్తుందా ? అన్న టాక్ నడుస్తోంది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు…మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. పార్టీకి అధ్యక్షుడే కాదు…కార్యాలయం కూడా లేకపోవడం శ్రేణులకు ఇబ్బందులకు గురి చేస్తోంది. పార్టీని ముందు నడిపించే నాయకుడి కోసం పార్టీ హైకమాండ్ అన్వేసిస్తోంది. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా సమర్థులైన వారికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది. అయితే ఆ స్థాయి నాయకుడు ఎవరన్న దానిపై భూతద్దం పెట్టి వెతికినా దొరకడం లేదట. చీపురుపల్లి, శృంగవరపుకోట మినహా…అన్ని చోట్ల కొత్త నాయకత్వమే ఉంది. పార్టీకి అన్ని విధాలా అండగా నిలిచే వారికి…అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తోందట. పార్టీ ఇన్‌చార్జ్‌గా కిమిడి నాగార్జున క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షుడుగా నాగార్జున ఉన్నప్పటికీ అశోక్ బంగ్లాకే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో తప్పా మిగిలిన చోట్ల పెద్దగా కనిపించని పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బంగ్లాకి కళా వెంకటరావు రావడం మానేశారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ కూడా అడపాదడపా కనిపిస్తున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన..ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రమే అటెండ్ అవుతున్నారు.
Read Also: GHMC: హుస్సేన్ సాగర్ నాలాకు భారీ వరద నీరు.. అధికారులు అప్రమత్తం
పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులోకి ఆశావహులు సంఖ్య పెరుగుతూ వస్తోందట. పార్టీ అధికారంలో ఉండడంతో సహజంగానే ఈ పదవి కోసం చూసే వారు అధికంగానే ఉన్నారు. వీరిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య పోటీ నెలకొంది. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు…గత ఎన్నికల వరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పని చేశారు. అయితే ఎన్నికల్లో ఆయన్ను పక్కపెట్టి అన్న కుమారుడు శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆ తర్వాత మంత్రి పదవి దక్కించుకున్నారు శ్రీనివాస్. గుర్తింపు కోసమైనా అధ్యక్షుడు కావాలన్న ప్రయత్నంలో ఉన్నారట అప్పలనాయుడు. కంది చంద్రశేఖర్, సున్వాడ రవిశేఖర్, కరణం శివరామకృష్ణ…సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రేసులోకి వచ్చినప్పటికీ…సమీకరణలతో దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు అధ్యక్ష పదవి తెచ్చుకొని పరువు నిలబెట్టుకోవాలని ఆశతో ఉన్నారట. సున్వాడ రవిశేఖర్ నెల్లిమర్ల మండల టిడిపికి పెద్ద దిక్కు, ఆయన సతీమణి వనజాక్షి టిడీపీ జిల్లా మహిళా విభాగానికి సారధ్యం వహిస్తున్నారు. ఇక కరణం విషయానికి వస్తే గజపతినగరం ఎమ్మెల్యేగా కొండపల్లి అప్పలనాయుడు ఉన్నకాలంలోనే గ్రూపు కట్టిన నాయకుడు. గజపతినగరం టిక్కెటే తనకి దక్కుతుందని భావించారు. చివరి నిమిషంలో శ్రీనివాస్‌కు దక్కింది. దీంతో అంచనాలు అన్నీ తలకిందలయ్యాయి. ఈసారి అధ్యక్ష పదవి వస్తుందన్న బలంగా విశ్వసిస్తున్నారట. పార్టీ జిల్లా అధ్యక్ష మార్పు తథ్యమని తేలడంతో…ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారట. కూటమిలో విభేదాలు తలెత్తకుండా…పార్టీలో సీనియర్లకి, జూనియర్లకి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోందట. పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకుడి కోసం చూస్తోందట టీడీపీ. లాబీయింగ్ ఏ మేరకు పని చేస్తోంది వేచి చూడాలి.
