Site icon NTV Telugu

Off The Record: అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి..?

Azharuddin

Azharuddin

Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట్లో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌ అధినాయకత్వం. పార్టీ నాయకుడు, మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ప్రకటించింది. ఎల్లుండి సీఎం రేవ్ంత్‌ రెడ్డి టీమ్‌లో చేరబోతున్నారు అజార్‌. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా మూడు ఖాళీలు ఉండగా… అందులో ఒకదాన్ని అజార్‌కు క్లియర్‌ చేశారు. మిగతా రెండిటిని డిసెంబర్‌లో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజార్‌. ఇంతవరకు బాగానే ఉన్నా… అసలు ఉన్నఫళంగా, ఉరుములేని పిడుగులా… కాంగ్రెస్‌ అధిష్టానం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్న చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ కేబినెట్‌ విస్తరణ కోసం చాలామంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కానీ… ఆ పనిని మాత్రం అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోంది హైకమాండ్‌. పైగా మూడు ఖాళీలు ఉంటే… రెండిటిని వదిలేసి ఇప్పటికిప్పుడు అజార్‌తో ఒకదాన్ని భర్తీ చేయడం వెనక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోణం ఉందని అనుమానిస్తున్నాయి రాజకీయవర్గాలు.

ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. లక్షకు పైగా ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ పెద్దలు నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సందర్భంగా… ముస్లిం మత పెద్దలతో జరిపిన సమావేశాల్లో పార్టీ… మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించిన అంశం చర్చకు వచ్చిందట. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా…తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ సందర్భంగా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. ప్రత్యేకించి కేబినెట్‌ బెర్త్‌ గురించే నిలదీశారట ముస్లిం పెద్దలు.ఇదే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే లైన్‌ క్లియర్‌ చేయించుకున్నట్టు చెబుతున్నారు.ఇటీవల ఓ మైనార్టీ నేత ఇంటికి వెళ్లిన సందర్భంగా కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సంచారం. అందుకే విషయ తీవ్రతను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళారట సీఎం. ఆ క్రమంలోనే స్పాట్‌ అప్రూవల్‌ వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. అందుకే రేవంత్‌ ప్రతిపాదనపై పెద్దగా నాన్చకుండా ఓకే చేసేసిందట. కారణం ఏదైనాగానీ…. దాదాపు రెండేళ్ళ నిరీక్షణ తర్వాత మైనార్టీ కోటాలో అజారుద్దీన్ సిక్స్ కొట్టేశారు. మరిప్పుడు ఆయనతో జూబ్లీహిల్స్‌ పిచ్‌ మీద పార్టీ పెద్దలు ఎలా బ్యాటింగ్‌ చేయిస్తారో, ఆయన ఎలా చేస్తారో చూడాలి.

Exit mobile version