NTV Telugu Site icon

Off The Record: కేటీఆర్‌ ఇప్పుడెందుకు స్టేట్‌ టూర్‌కు ప్లాన్‌ చేస్తున్నారు..? బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటి..?

Ktr

Ktr

Off The Record: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాలని డిసైడయ్యారు. అన్ని జిల్లాలకు వెళ్ళి, పార్టీ మీటింగ్స్‌ పెట్టి కేడర్‌లో ఉత్సాహం నింపాలన్నది ప్లాన్‌ అట. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైందట. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తాజాగా తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్‌ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఎవరి స్థాయిలో వారు శక్తివంచన లేకుండా పని చేయాలని ఆదేశించారు. కేడర్‌తో వరుస సమావేశాల ద్వారా తిరిగి జోష్ పెంచాలన్నది అధిష్టానం ప్లాన్‌గా తెలుస్తోంది. ముందు అన్ని జిల్లాల్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించి ఫైనల్‌గా వరంగల్‌లో రాష్ట్ర స్థాయి సభకు నిర్ణయించారు. అదే సమయంలో కేటీఆర్ గ్రామీణ ప్రాంతాల పర్యటన ఖరారుతో… రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

మొదటిగా ఈనెల 19న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో పర్యటిస్తారు కేటీఆర్. ఈ సమావేశాల్లో గ్రామస్థాయి కార్యకర్త నుంచి జిల్లా లెవల్‌ వరకు అంతా పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయట. ఈ టూర్స్‌ వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం పార్టీ కేడర్‌ని రీఛార్జ్‌ మోడ్‌లోకి తీసుకురావడం అయితే… అంతర్లీనంగా అంతకు మించి ఉండి ఉంటాయని విశ్లేషిస్తున్నారు కొందరు. పార్టీలో ప్రస్తుతం కేటీఆర్‌కు క్లాస్‌ ఇమేజ్‌ ఉంది. రూరల్‌ కేడర్‌లో ఆయన మీద సానుకూలత ఎంతవరకు ఉందో క్లారిటీలేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటుంటాయి. అందుకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గ్రామీణ బాట పట్టి… అన్ని ఏరియాల్లో, అన్ని వర్గాల్లో పార్టీపై పట్టు బిగించే ఎత్తుగడ ఉండి ఉండవచ్చంటున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక అడపాదడపా కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైంది బీఆర్‌ఎస్‌. అంశాల ప్రాతిపదికన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక నుంచి అలా కాకుండా జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల జిల్లాల్లోకి సరిగా వెళ్లలేకపోయామని, దీనిద్వారా కార్యకర్తలను, ప్రజల్ని కలవలేకపోయామన్న చర్చ జరుగుతోంది పార్టీలో. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, మాస్‌లోకి దూకుడుగా వెళ్ళేందుకు కేవలం సోషల్ మీడియాకు పరిమితమై ఉంటే సరిపోదని, క్షేత్ర స్థాయికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తేనే రిజల్ట్‌ ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే సోషల్ మీడియా వార్‌ని ఓవైపు కొనసాగిస్తూనే… మరోవైపు గ్రౌండ్ లెవెల్‌లో పోరాటాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టినా… అది కొందరికే చేరుతుందని, అదే…. మండల, గ్రామ స్థాయిలో ఏదో అంశాన్ని తీసుకుని పోరాటం చేస్తే…ప్రభావవంతంగా ఉంటుందన్నది బీఆర్‌ఎస్‌ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు కేటీఆర్‌ రూరల్‌ టూర్‌తో…. ఆ లక్ష్యం నేరవేరడంతోపాటు… ఆయన కూడా మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున ఎమ్మెల్సీ కవిత జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు హరీష్‌రావుకు ఆల్రెడీ మాస్‌ లీడర్‌ ఇమేజ్‌ ఉంది. ఆయనకు గ్రామీణ ప్రాంతాల్లోనే పట్టు ఎక్కువని కూడా చెప్పుకుంటాయి పార్టీ వర్గాలు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్‌ మీద కూడా రూరల్‌ టూర్‌ ప్రెషర్‌ పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయన కూడా జిల్లాల పర్యటనలకు రావాలని పార్టీ ద్వితీయశ్రేణి, కేడర్‌ గట్టిగా అడుగుతున్నారట. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక… బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో…. అధికారిక టూర్స్‌ తప్ప… పార్టీ పరంగా ఆయన జిల్లాల పర్యటనలు చేసే అవకాశం దక్కలేదంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం ద్వారా పార్టీ మీద పూర్తి గ్రిప్‌ తెచ్చుకోవాలని భావిస్తున్నారట. అందుకే మొదట పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జిల్లా సమావేశాలు పెట్టి… మెల్లిగా రాష్ట్రమంతటా తిరిగే ప్లాన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే… ముందుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ గెలిచిన ఏకైక నియోజకవర్గం సూర్యాపేటతో మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. ఈ టూర్స్‌ బీఆర్‌ఎస్‌కు ఎంత వరకు ఉపయోగపడతాయో, వ్యక్తిగతంగా కేటీఆర్‌ మాస్‌ లీడర్‌గా ఎదగడానికి ఎంత వరకు దోహదం చేస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. టూర్‌ మొదలయ్యాక పార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలన్నది ఇంకొందరి మాట. డొంక రోడ్లలో గులాబీ కారు ఎంత స్పీడ్‌తో దూసుకుపోతుందో చూడాలి మరి.