Site icon NTV Telugu

Off The Record : ఇస్నాపూర్‌లో కొత్త రకం రాజకీయ సమీకరణలు..

Isnapur Otr

Isnapur Otr

Off The Record : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు ఈ సారి సంచలనం రేపాయి. ఛైర్మన్‌ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మెజార్టీ ఎవరికీ దక్కలేదు. అటు బీజేపీ ఒక్క వార్డు కూడా గెలవలేదు. మొత్తం 26 వార్డులకుగాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10చోట్ల గెలిచాయి. మిగతా 4 సీట్లలో స్వతంత్ర కౌన్సిలర్లు విజయం సాధించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు భార్య కవిత ఇస్నాపూర్ 4వ వార్డు నుంచి గెలిచారు. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకి కావడంతో తన భార్యకు పదవి ఇప్పించుకోవాలనుకున్నారు నీలం మధు. ఇస్నాపూర్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 14. బీఆర్ఎస్ 2 సీట్ల దూరంలో ఉంటే.. కాంగ్రెస్ 4 అడుగుల దూరంలో నిలిచింది. దీంతో ఇక్కడ గెలిచిన నలుగురు స్వతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారారు. వాళ్ళలో ముగ్గురు కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చి ఆ క్యాంప్‌లో చేరిపోయారు. మరొకరు బీఆర్ఎస్ తో చేతులు కలపగా ఆ పార్టీ బలం 13కు చేరి రాజకీం రక్తి కట్టింది. ఈ పరిణామాల నడుమే… బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్ క్యాంపులో చేరడంతో ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 14 దక్కింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి విప్ జారీ చేశారు. ఇక కాంగ్రెస్‌కే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కుతుందని అనుకునేలోపు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గేమ్‌ మార్చేశారు. తన ఎక్స్ అఫిషియో ఓటుని ఇస్నాపూర్‌లో నమోదు చేసుకున్నారాయన. దీంతో… రెండు పార్టీల బలం మళ్లీ 14కి చేరింది.

సరే…. ఇక టాస్‌లోనైనా అదృష్టం వరిస్తుందని భావించారు కాంగ్రెస్ నేత నీలం మధు. భారమంతా దేవుడిపైనే వేశామన్నట్టు నడుస్తున్న టైంలో ఆ పార్టీ అస్సలు ఊహించని పరిణామం జరిగింది. బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా తన ఎక్స్ అఫిషియో ఓటును ఇస్నాపూర్‌లోనే నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ని గెలిపించడానికే అక్కడ రిజిస్టర్‌ చేసుకున్నారనేది అందరికి తెలిసిన విషయం. కానీ ప్రత్యర్థి పార్టీ ఎంపీ రఘునందన్ రావు అలా ఎందుకు చేశారో ఎవరికీ అంతుచిక్కలేదు. అదే సమయంలో కాంగ్రెస్‌కు మరోషాక్ తగిలింది. ఆ పార్టీ కౌన్సిలర్ మాధవి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి టచ్ లోకి వెళ్లారు. నీలం మధు భార్య కవితకి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ పదవి దక్కడం ఇష్టం లేకే ఆమె బీఆర్ఎస్‌తో చేతులు కలిపారట. మరోవైపు ఛైర్మన్‌ ఎన్నిక రోజున రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓకే కారులో రావడం ఇంకా ఆసక్తి రేపింది. దాంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డే నీలం మధు భార్యను మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ కానివ్వొద్దన్న లక్ష్యం పెట్టుకుని ఎంపీతో చేతులు కలిపినట్టు అంచనా వేశారు అంతా.

ఇక ఎన్నికలో బీఆర్ఎస్‌కు చైర్మన్ పదవి, కాంగ్రెస్ పార్టీకి లాస్ట్‌ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చిన మాధవికి వైస్ చైర్మన్ పదవి దక్కాయి.వాస్తవానికి పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాజకీయ శత్రువులు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా మహిపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు రఘునందన్. ఇటు నీలం మధు ఈ ఇద్దరు నేతలకు రాజకీయ విరోధి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి మహిపాల్ రెడ్డిపై పోటీ చేశారు నీలం. ఆ తర్వాత మెదక్ ఎంపీగా రఘునందన్ పై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఇద్దరికీ ఉమ్మడి రాజకీయ శత్రువయ్యాడు నీలం. ఆ ప్రకారమే ఇద్దరూ చేతులు కలిపి నీలంకు చెక్‌ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఒక వేళ ఇస్నాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే నీలం మధు సతీమణి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ అవుతారు. అప్పుడాయన మళ్లీ రాజకీయంగా బలోపేతం అవుతారు కాబట్టి ఇద్దరూ కలిసి దెబ్బ కొట్టారన్న విశ్లేషణలున్నాయి.

Exit mobile version