Off The Record: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని అంశాలపై కేసులు, విచారణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. మళ్లీ దానిపై అరెస్టులు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఆ అరెస్టులకు సంబంధించి స్వయంగా హరీష్ రావే మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో కాలేశ్వరం కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు విచారణను ఎదుర్కొన్నారు హరీష్‌రావు. దాంతో పాటు ఇప్పుడు విచారణ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో కూడా కేసీఆర్‌తో పాటు హరీష్ రావుకు కూడా నోటీసులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఇలా నోటీసులు ఇస్తారు అని అంశంపై మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు హరీష్‌రావు.
తనమీద తప్పుడు కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోంది అంటూ చెప్పుకొచ్చారు హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఎలాగైనా అరెస్టు చేయించాలని చూస్తున్నారని అసెంబ్లీ సమావేశాల తర్వాత తనకు నోటీసులు ఇస్తారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలా కక్ష కట్టి అరెస్టు చేస్తే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అని చెబుతున్నారట హరీష్‌రావు. ఇక…అరెస్టు విషయంపై గతంలో కేటీఆర్ కూడా మాట్లాడారు. ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్ ఇలా ఎన్నిసార్లు విచారణ జరుపుతారు…దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని గతంలోనే ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష కట్టి అరెస్టు చేయాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. గతంలో కేటీఆర్ అరెస్టు విషయంపై మాట్లాడటం…తాజాగా హరీష్‌రావు కూడా తనను అరెస్టు చేస్తారని చెప్పడంపై బిఆర్ఎస్‌లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పోటాపోటీగా ఇద్దరు కీలక నేతలు తమ అరెస్టులపై మాట్లాడుతూ ఉండటంతో…అసలు ఏం జరుగుతోందని పార్టీలోని ఇతర నేతలు వాకబు చేస్తున్నారట.
ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలన్నీ ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు చూస్తున్నారు. అధినేత కేసిఆర్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేకపోవడంతో కేటీఆర్-హరీష్ రావులే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు కూడా అరెస్ట్ చేసుకోండి అని చెబుతుండటంతో అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు కేసులు విషయంలో నోటీసులు అరెస్టుల వరకు వెళితే పరిస్థితి ఏంటి అని గుసగుసలాడుకుంటున్నారు పార్టీలోని నాయకులు. 2026 సంవత్సరం మొత్తం మున్సిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 2026 ఎన్నికల సంవత్సరంగా చెబుతున్న ఈ టైంలో ఒకవేళ కేటీఆర్-హరీష్ రావులు అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోందట. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి తప్పు చేయలేదని తమ నాయకులు అరెస్టు అయ్యే అవకాశం లేదని కుండబద్దలు కొడుతున్నారు పార్టీ నేతలు. మొత్తానికి…నోటీసులు అరెస్టులు అంటూ సాగుతున్న ఈ పొలిటికల్ డ్రామా ఎంతవరకు సాగుతుందనేది చూడాల్సిందే.