Off The Record: తెలంగాణ క్యాబినెట్ మంత్రుల మధ్య సమన్వలోపం కొట్టొట్టినట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల తరచూ జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమని, దానివల్ల కొత్త రకం ఇబ్బందులు కూడా వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో మరో శాఖ మంత్రి సమీక్షలు నిర్వహించడం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో మంత్రుల సమీక్షలంటేనే హడలిపోతున్నారట ఉన్నతాధికారులు. ఇటీవల సచివాలయంలో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రులు. సమయాలు కూడా దాదాపు ఒకేలా ఉంటుండటంతో… ఏ మీటింగ్‌కు అటెండ్ అవ్వాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు ఆఫీసర్స్. కొద్ది రోజుల క్రితం ఓ మంత్రి దేశంలోనే అతిపెద్ద జాతర నిర్వహణకు సంబంధించిన విషయాలపై సమీక్ష చేశారు. కానీ… అందులో సంబంధిత మంత్రులు ఎవరూ లేరు. అయినాసరే… మీటింగ్ పెట్టేసిన సదరు మంత్రి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మీడియా బ్రీఫింగ్‌ను కూడా తానే ఇచ్చేయడంపై మిగతా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారట. మరోవైపు కొంత కాలంగా ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమీక్షా సమావేశాలంటేనే భయపడి పోతున్నారు. హైదరాబాద్ నలువైపులా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రుల అంశంపై రెండు శాఖల మధ్య సమన్వయం లోపించిందనే చర్చ జరుగుతోంది.
Read Also: OG : రేపు ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ గెట్ రెడీ
ఆసుపత్రుల భవనాలను నిర్మించేది ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్. నిధుల విడుదల, పర్యవేక్షణ ఆరోగ్య శాఖది. ప్రతిష్టాత్మక నిర్మాణాలు కావడంతో ఆయా శాఖల మంత్రులు వరుసబెట్టి రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. ఒకరోజు ఒక మంత్రి. ఇంకో రోజు ఇంకో మంత్రి రివ్యూ చేయడంతో… టైమంతా అటే సరిపోతోందని వాపోతున్నారు అధికారులు. ఎప్పుడు ఏ మంత్రి ఆఫీసు నుంచి ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఫీలవుతున్నాయి అధికార వర్గాలు. ఇటీవల ఓ మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని అటవీ శాఖ సమస్యలపై సెక్రటేరియట్ లో రివ్యూ చేశారు. దానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే… సంబంధిత శాఖ మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా కీలకమైన అధికారులతో సమీక్ష చేయడంపై ఆ మినిస్టర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంలోని పలు కీలక శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎంగా ఆ అధికారం ఆయనకు ఉంది. అయితే… అదే సమయంలో సంబంధిత మంత్రులు లేకుండానే మీటింగ్స్ జరిగిపోతుండటంపై వాళ్ళు నొచ్చుకుంటున్నట్టు సమాచారం. కొన్ని సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్స్‌లో ఆ క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులకు కనీస సమాచారం కూడా ఉండటం లేదన్న నిట్టూర్పులు వినిపిస్తున్నాయి సచివాలయంలో. కాగా… కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి రివ్యూ పేరుతో గంట వ్యవధిలోనే మంత్రులకు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి సమీక్షకు రావాలని ఆదేశిస్తున్నారని, దాంతో ఉరుకులు పరుగుల మీద వెళ్లాల్సి వస్తోందనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హయ్యర్ ఆఫీసర్స్. ముఖ్యమంత్రి సమీక్షలకు కొన్నిసార్లు నోట్స్ ప్రిపేర్ చేసుకునే సమయం ఉండటం లేదని.. దానివల్ల ఆ అంశంపై ముఖ్యమంత్రికి సరిగ్గా వివరించ లేక పోతున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు. కాగా సీఎం రివ్యూకు సంబంధించి కొన్ని సందర్భాల్లో కింది స్థాయి ఉద్యోగులు చెబితే తప్ప కీలక అధికారులకు సమాచారం ఉండక పోవడం చర్చనీయాంశంగా మారింది. మినిస్టర్స్ జిల్లాలకు ఇంఛార్జి మంత్రులుగా కూడా వ్యవహరిస్తున్నారు. తమ శాఖతో పాటు వారు ఇంచార్జిగా ఉన్న జిల్లాలోని ఉన్నతాధికారులతో సమీక్షలు చేసే అధికారం వారికి ఉంటుంది. అయితే జిల్లా స్థాయి అధికారులు కాకుండా కీలక అధికారులు పాల్గొనాల్సి వచ్చినప్పుడు మంత్రులు తమ సహచరులకు సమాచారం ఇస్తే సమస్యే ఉండని అంటున్నారు. కొందరు కేబినెట్ సహచరుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇగోల వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని, అంతా స్నేహపూర్వకంగా ఉంటే… ఈ సమస్యలు రావన్న అభిప్రాయం బలంగా ఉంది సచివాలయ వర్గాల్లో.
