NTV Telugu Site icon

Off The Record: కాంగ్రెస్‌ దళిత ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? తిరుగుబాటు స్వరమా?

Cong

Cong

Off The Record: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా..? అంటే… జరుగుతున్న పరిణామాలు అదే విషయం చెబుతున్నాయన్నది పొలిటికల్‌ పరిశీలకుల మాట. ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంకి అవమానం జరిగిందంటూ… ఆయనకు మద్దతుగా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ దగ్గరికి వెళ్లడాన్ని ఈ కోణంలోనే చూడాలంటున్నారు. అలాగే స్పీకర్ దగ్గరికి వెళ్లిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసిన కామెంట్స్ కూడా హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.
ఈ చర్యలు, మాటల ద్వారా కాంగ్రెస్‌ దళిత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయాలనుకుంటున్నారా? లేదంటే వ్యవస్థలో జరుగుతున్న లోపాల్ని ఎత్తిచూపాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఒకవేళ నిజంగా లోపాల్ని ఎత్తి చూపాలనుకుంటే.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యని చెప్పుకునే వెసులుబాటు ఉంది. అలా కాదని, ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడాన్ని ఏ కోణంలో చూడాలో అర్ధం కావడం లేదంటున్నాయట పార్టీ వర్గాలు.

ఒక రకంగా ఇది ప్రతిపక్షాలకు అస్త్రం ఇవ్వడమేనన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలు కొందరు కూడా అసహనంతో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మంత్రుల సమావేశం దగ్గర నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఖచ్చితంగా అభ్యంతరకరమేనని, అయితే ఆ విషయాన్ని జిల్లా పోలీసు పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినా, లేదంటే.. సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలిసి సమస్య చెప్పుకునే వీలున్నా… ఆ రెండు మార్గాలను కాదని నేరుగా స్పీకర్‌ దగ్గరికి వెళ్ళడమంటే కావాలని రచ్చ చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారట కాంగ్రెస్‌లోనే కొందరు. ఇప్పటికే ప్రోటోకాల్‌ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేస్తుంటే… ఇప్పుడు సొంత పార్టీ శాసనసభ్యులే స్పీకర్‌ని కలిసి ఫిర్యాదు చేయడం, మీడియాకు ఎక్కడం లాంటి చర్యల్ని పార్టీ పెద్దలు కొంత సీరియస్‌గానే పరిగణిస్తున్నట్టు సమాచారం. అలాగే మానకొండూరు ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో సీఐని పోలీస్ కమిషనర్ వేధిస్తున్నారని అంశాన్ని ప్రస్తావించడంపై కూడా భిన్న రకాల చర్చ జరుగుతోంది. ఇద్దరు పోలీస్‌ అధికారుల మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని ఎమ్మెల్యే హోదాలో ఉన్నతాధికారుల దృష్టికో, ప్రభుత్వ పెద్దలు దృష్టికో.. తీసుకెళ్ళి పరిష్కరించాలి తప్ప దాన్నో సమస్యగా చూపించడం ఏంటన్నది కాంగ్రెస్‌లోని ఓ వర్గం క్వశ్చన్‌. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారని, అక్కడ సమస్యలు చెప్పినా పరిష్కారం కాకుంటే సీఎం కి విషయం చేరవేసే వ్యవస్థ కూడా ఉందని, అది ఇది కాదని నేరుగా స్పీకర్ కి ఫిర్యాదు ఇచ్చి బయటికి తప్పుడు సంకేతాలు పంపినట్టు అయిందని చర్చించుకుంటున్నారట పార్టీ నేతలు.

ప్రస్తుతం ప్రోటోకాల్ కు సంబంధించిన వివాదంపై ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేసేంతవరకు బాగానే ఉన్నా… తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన కామెంట్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. గతంలో ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా వాటిని సెట్ చేశారు ప్రభుత్వ పెద్దలు. కానీ.. ఈసారి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆలోచించాల్సిన విషయం. మరోవైపు తమ చర్య మిస్‌ఫైర్‌ అవుతుందని, ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చి పార్టీని ఇరకాటంలో పెట్టినట్టు అవుతుందని ఎమ్మెల్యేలు ఊహించలేకపోయారా అన్న చర్చ సైతం జరుగుతోంది. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించిన అధికారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిందే. అయితే… అదే సమయంలో వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి… ఆచితూచి వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. ఐతే.. కాంగ్రెస్‌లోని కొందరు దళిత నేతలు ఈ వ్యవహారంపై త్వరలో సీఎంని కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వేముల వీరేశం ఎపిసోడ్‌లో బాధ్యుడైన ఏసీపీని సస్పెండ్‌ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ, ప్రభుత్వ పెద్దలు ఎలా డీల్‌ చేస్తారో చూడాలి మరి.

Show comments