NTV Telugu Site icon

Off the Record about Varadarajulu Reddy: కాంగ్రెస్‌ కమిటీలో చోటు.. టీడీపీలోనే ఉన్నానన్న సీనియర్‌ నేత..

Varadarajulu Reddy

Varadarajulu Reddy

ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ నూతన‌ కార్యవర్గంలో ప్రొద్దుటూరు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి చోటు కల్పించింది ఆ పార్టీ హైకమాండ్‌. గతంలో ఆయన కాంగ్రెస్‌ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పీసీసీలో పదవి ఇవ్వడంతో అది చూసిన వాళ్లు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారని అనుకున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌లో చేరారని భావించారు. అయితే కాంగ్రెస్‌లో చేరలేదని.. ఇంకా టీడీపీలోనే ఉన్నారనని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు.

Read Also: Off the Record about Bodhan TRS: బోధన్‌ టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే వర్సెస్‌ లీడర్స్‌,, పొమ్మనలేక పొగ పెడుతోంది ఎవరు?

2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో కినుక వహించిన ఆయన సైలెంట్‌ అయ్యారు. ఓ దశలో తాను ఏ పార్టీలో లేనని ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే తిరిగి టీడీపీ గూటికి చేరుకుంటారనే చర్చ సాగుతూనే ఉన్నా దానిపై వరదరాజుల రెడ్డి ఎప్పుడూ స్పందించలేదు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పటి వరకు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఎం. లింగారెడ్డిని జిల్లా అధ్యక్ష పదవికే పరిమితం చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ బాధ్యతలను జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. ఇటీవల ప్రొద్దుటూరులో వైసీపీ, టీడీపీ మధ్య జరిగిన రగడలో ప్రవీణ్‌రెడ్డి అరెస్టయ్యి జైలుకు కూడా వెళ్లారు. ప్రవీణ్‌రెడ్డిని పరామార్శించేందుకు టీడీపీ పెద్దలు కడప సెంట్రల్‌ జైలుకు వచ్చారు. ఆ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డే ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించేశారు. ఈ ప్రకటన ప్రొద్దుటూరు టీడీపీలో కొందరికి రుచించలేదు. టీడీపీ అధిష్ఠానం ప్రకటనపై అసంతృప్తితో ఉ్నారు.

ఎక్కడా బయటపడకపోయినా.. లోలోన నేతలు రగిలిపోతున్నారు. లింగారెడ్డి వర్గం ప్రవీణ్‌ అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉందట. ఈ రెండు వర్గాలు ఇలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా వరదరాజుల రెడ్డి రీఎంట్రీ ప్రొద్దుటూరు టీడీపీ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చబోతోందట. వాస్తవానికి వరదరాజుల రెడ్డి టీడీపీలోకి రాబోరని భావించారు. రాహుల్‌గాంధీ జోడో యాత్ర ఏపీకిఇ వచ్చిన సందర్భంగా వెళ్లి ఆయన్ని కలిశారు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు భావించిన హైకమాండ్‌ ఆయన్ను ఏపీసీసీ కోఆర్డినేషన్‌ కమిటీలో వేసింది. అయితే కాంగ్రెస్‌ కమిటీ జాబితాలో తన పేరు రావడం వరదరాజుల రెడ్డికి ఇబ్బంది తెచ్చిపెట్టింది. అలాగే వదిలేస్తే ఉన్న అవకాశాలు పోతాయని అనుకున్నారో ఏమో.. వెంటనే తేరుకుని తాను కాంగ్రెస్‌లో చేరలేదని.. తాను టీడీపీలోనే ఉన్నానని ప్రకటించారు.

అప్పటి వరకు టీడీపీలో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ఇంఛార్జ్‌ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డే మధ్య పోటీ అనుకుంటున్న వారు వరద ప్రకటనతో టీడీపీలో ఆయన కూడా ఉన్నారనే చర్చ మొదలైంది. అయితే పార్టీ పెద్దల నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాకున్నా.. వరదరాజులు తిరిగి సైకిల్‌ మీదే ప్రయాణిస్తే.. ప్రొద్దుటూరు పాలిటిక్స్‌ రంజుగా ఉంటాయని భావిస్తున్నారట. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తన ఊపిరి ఉండగా టీడీపీని గెలవనివ్వనని సవాల్‌ చేశారు. తనకు ప్రత్యర్థి అయితే తన రాజకీయ గురువు వరదరాజులరెడ్డేనని గతంలో పలుమార్లు ప్రకటించారు రాచమల్లు. మరి, నాలుగేళ్ల తర్వాత మౌనాన్ని వీడి టీడీపీలో ఉన్నానన్న వరదరాజులరెడ్డి ఎత్తగడలు ఎలా ఉంటాయో.. ప్రొద్దుటూరు రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.