Off The Record: విలక్షణ తీర్పులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. పొత్తు ఉంటుందో లేదో తేలక టీడీపీ, జనసేన ఆశావహుల మధ్య కోల్డ్‌వార్ పీక్స్‌కు చేరింది. పొత్తు పొడిస్తే పోటీలో ఉండేది ఎవరు? పొత్తు లేకుండా గెలిచేది ఎవరనే లెక్కలేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఐదు పార్టీలు గెలిచాయి. టీడీపీ నాలుగుసార్లు.. కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీలో ఒక్కోసారి ఈ సీటును తమ ఖాతాలో వేసుకున్నాయి. 1999 నుంచి వరుసగా టిడిపి, కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ గెలుస్తూ వచ్చాయి. ఇదే సెంటిమెంటు వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని భావిస్తోంది జనసేన. గత ఎన్నికల్లో 36 వేల ఓట్లు సాధించిన జనసేన అభ్యర్ధి బొలిశెట్టి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచారు. టిడిపి నుంచి పోటీ చేసిన ఈలి నానికి 54వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓటమి తర్వాత ఈలి నాని పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో వలవల బాబ్జి టీడీపీ కన్వీనర్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టిడిపి, జనసేనలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తే అవకాశం దక్కేది ఎవరికని రెండు పార్టీల్లో స్థానికంగా చర్చ జరుగుతోంది.
Read Also: Off The Record: కలెక్టర్లపై గురి పెట్టిన బండి సంజయ్.. కొందరు ఐఏఎస్‌లు టచ్‌లో ఉన్నారా?
2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి బరిలో దిగడంతో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయకపోతే వైసీపీని ఓడించడం కష్టమనేది ఇక్కడ రెండు పార్టీ నేతల మాట. అయితే జనసేన నుంచి బొలిశెట్టి, టీడీపీ నుంచి వలవల బాబ్జి ఇద్దరూ పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వీరిలో ఎవరికి బరిలో ఉండే అవకాశం దక్కినా రెండోవారు సహకరిస్తారా అనేది అనుమానమే. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో బొలిశెట్టికి సెంటిమెంట్ కలిసి వస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయట. టీడీపీ కంటే స్పీడ్‌గా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారనే వాదన జనసేన వర్గాల్లో ఉందట. పొత్తు పొడిస్తే ఎవరు పోటీ చేస్తారు.. ఎవరు త్యాగం చేస్తారన్నది కూడా ప్రశ్నే. దీనిపైనే తాడేపల్లిగూడెంలో చర్చ సాగుతోంది. తాడేపల్లిగూడెంను రెవిన్యూ డివిజన్‌గా, పోలిస్ సబ్ డివిజన్‌గా ఏర్పాటు చేయించడం.. ఫార్మసీ కాలేజీని ప్రారంభించి ఎడ్యుకేషనల్ హబ్‌గా తయారు చేయడానికి అధికారపార్టీ చూస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వైసీపీ కూడా తాడేపల్లిగూడెంలో పట్టుబిగిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికలు టీడీపీ, జనసేన ఏం చేస్తాయనే ఉత్కంఠ నెలకొంది.