Off The Record: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్‌ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. అయితే … తాజాగా తనకు భద్రతా కారణాల రీత్యా ప్రొటెక్షన్ కావాలని ప్రభుత్వాన్ని అడిగారట మాజీ ఎమ్మెల్యే. ఏం… ఉన్నట్టుండి ఆయనకు ఏం ఆపద ముంచుకొచ్చింది? అర్జంట్‌గా సెక్యూరిటీ ఎందుకంటే…. చెప్పిన కారణాలు కూడా కాస్త ఆశ్చర్యంగానే అనిపించాయట కొందరికి. ఆ విషయాన్ని ఎక్కడా బయటపెట్టకుండా… అయినా… మాకెందుకులేమ్మా…. అంటూ కామ్ అయిపోయినట్టు తెలిసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిశాక ఒకటి రెండు సందర్భాల్లో పిఠాపురంలో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య కాస్త ఉద్రిక్తతలు తలెత్తాయి. కవ్వింపు చర్యలతోపాటు కార్ల మీద దాడులు కూడా చేసుకున్నారు. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అయినా… అవేమీ ప్రాణాపాయం ఉన్నంత స్థాయి వ్యవహారాలు కావన్నది విస్తృతాభిప్రాయం. పైగా.. ఇక్కడి నుంచి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి చోట మిత్రపక్షం నియోజకవర్గ ఇన్ఛార్జ్‌కి జనసేన కార్యకర్తలు ఎందుకు ప్రాణాపాయం తలపెడతారన్నది స్థానికుల్లో మెదులుతున్న ప్రశ్న. కాకుంటే… ఇక్కడే మరో రకమైన చర్చ కూడా జరుగుతోంది.
మనం అధికార పార్టీలో ఉన్నాం. పైగా పిఠాపురం. ఇవన్నీ పైకి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా… అధికార పదవి మాత్రం లేదు. పోతేపోనీ సర్దుకుందామనుకున్నా… కనీసం గన్‌మెన్ హంగామా అయినా లేకుంటే… మనల్ని ఎవడూ లెక్కచేయడం లేదని వర్మ ఫీలై పోతున్నారట. అందుకే నాకు గన్‌మెన్‌ను ఇచ్చి తీరాల్సిందేనని ప్రభుత్వం దగ్గర పట్టుబట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. సరే… ఆయనేదో ప్రెస్టీజ్ ఇష్యూగా ఫీలైపోయి అడిగేశారనుకో… అయినా, వెంటనే ఇచ్చేయడానికి అదేదో చాక్లెట్టో బిస్కెట్టో కాదుకదా!… అందుకే ప్రొసీజర్ ప్రకారం…. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అడిగిందట సర్కార్. వర్మకి ఏదన్నా థ్రెట్ ఉందా.. పోలీస్ రక్షణ కావాల్నా అన్న ప్రశ్నలకు అంత అవసరం లేదంటూ జిల్లా పోలీస్ అధికారులు రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. అయినాసరే…. అదంతా నాకు తెలీదు.. నేను తిరిగి చూస్తే లెఫ్టూ రైటూ… గన్స్ కనిపించాల్సిందేనని మారాం చేశారట మాజీ ఎమ్మెల్యే. దాంతో.. ఇక చేసేదేం లేక ఆ కోరికనన్నా తీరుద్దామనుకుంటూ వన్ ప్లస్ వన్ సెక్యూరిటీకి ప్రభుత్వ పెద్దలు స్టాంపేసినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా ఆయన ముచ్చట తీరిపోయింది. రూల్స్ ప్రకారం చూసుకుంటే… మాజీ ప్రజా ప్రతినిధుల్లో అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే గన్‌మెన్ సెక్యూరిటీ ఇస్తారు. ఒకవేళ ఆ లిస్టులో లేనివాళ్ళు ఎవరైనా తమకు కావాలంటే మాత్రం… పరిస్థితిని బట్టి కేటాయించి సిబ్బంది జీతాన్ని వాళ్ళ దగ్గరి నుంచే వసూలు చేస్తారు.
అలా.. వర్మకు గన్‌మెన్ కేటాయింపు ఒక ఎత్తయితే… దీన్ని ఆయన అనుచరగణం మరోలా అర్ధం చేసుకుంటోందట. సెక్యూరిటీ వచ్చేసింది కాబట్టి మా సార్‌కు ఇక మంచి నామినేటెడ్ పదవి ఇచ్చేస్తారంటూ తెగ మురిసిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేనా… ఇంకొందరైతే…కాస్త అడ్వాన్స్ అయిపోయి పూజలు సైతం చేయించేస్తున్నారట. కానీ.. పిఠాపురంలో మరో పవర్ సెంటర్‌ని తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా అన్నది ఎక్కువ మంది విశ్లేషకుల్ని వేధిస్తున్న ప్రశ్న. అటు లోకల్ జనసేన కేడర్ సైతం… సార్‌కి ఎలాగూ పదవి లేదు… ఆ…. గన్‌మెన్ మురిపెమన్నా తీర్చుకోనివ్వండర్రా… అంటూ సెటైర్స్ వేస్తున్నారట. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సమయంలోనే ప్రకటించారు చంద్రబాబు. కానీ ఏపీలో ఇప్పుడు 2027 వరకు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. దాంతో… మాజీ ఎమ్మెల్యేని సంతృప్తి పరచడానికే గన్‌మెన్‌ను ఇచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు పిఠాపురంలో. మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్‌తో సంతృప్తి చెందుతారా? లేక తన పాత డిమాండ్స్‌ని అలాగే కొనసాగిస్తారా అన్నది చూడాలి మరి.
