NTV Telugu Site icon

Off The Record: శ్రీశైలం ఆలయ పాలకమండలిలో రచ్చ రచ్చ..!

Srisailam

Srisailam

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో TTD బోర్డు బెజవాడ కనకదుర్గమ్మ గుడి పాలకమండళ్లకు ప్రాధాన్యం ఎక్కువ. ఈ రెండు ఆలయాలతోపాటు రాష్ట్రంలో పలు కీలక గుళ్లు ఉన్నప్పటికీ.. అక్కడి ట్రస్ట్ బోర్డుల గురించి పెద్దగా ప్రచారం ఉండదు. మిగతా కీలక ఆలయాల్లో పాలకమండలిని నియమించిన తర్వాత ఒకరోజో.. రెండు రోజులో చర్చ జరుగుతుంది. తర్వాత ఎవరూ పట్టించుకోరు. అలాంటి ఆలయాల్లో శ్రీశైలం కూడా ఒకటి. శ్రీశైలం ఆలయం పాలకమండలి చర్చల్లోకి వచ్చిన సందర్భాలు కూడా చాలా అరుదు. శివరాత్రికో.. కార్తీక మాసంలోనో శ్రీశైలం ఆలయం గురించి మాట్లాడుకుంటారు తప్ప అక్కడ ఛైర్మన్‌ ఎవరు.. బోర్డు సభ్యులు ఎవరు అనే ఆరాలు కూడా పెద్దగా ఉండవు. అలాంటి ఆలయ పాలకమండలిలో ప్రస్తుతం రచ్చ రచ్చ అవుతోంది.

Read Also: Off The Record: ఏపీలో బీఆర్‌ఎస్‌ ప్లాన్స్‌ ఏంటి..? ఒంటరి పోరేనా?

శ్రీశైలం ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఈయనే రెడ్డివారి చక్రపాణిరెడ్డి. ఇక ఈయన ఆలయ ఈవో లవన్న. స్వామి అమ్మవార్ల ప్రసాదాల సరుకుల కొనుగోలుపై స్వయానా ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను ఈవో లవన్న ఖండించారు. అంతేకాదు.. ట్రస్ట్‌బోర్డులోని మరో ఇద్దరు సభ్యులు కూడా ఛైర్మన్‌ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో శ్రీశైలం ఆలయ బోర్డులో ఏం జరుగుతుంది అనేది చర్చగా మారింది. ఛైర్మన్‌ ఎందుకీ ఆరోపణలు చేశారు? వాటిని ఖండించారంటే ఈవో వెనుక ఉన్నదెవరు? సభ్యులు ఓపెన్‌గా ఎందుకు ఛైర్మన్‌ను టార్గెట్‌ చేశారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బోర్డు మీటింగ్స్‌లో అజెండాపై ముందుగానే ఛైర్మన్‌, ఈవో, సభ్యులు మాట్లాడుకుంటారు. తర్వాత అజెండాను సమావేశంలో ఆమోదిస్తారు. అంతేకానీ.. ఒకరిని ఒకరు విభేదించుకోరు. ఆరోపణలు చేసుకోరు. అంతా పాలకపక్షమే కావడంతో సాఫీగా సాగిపోతుంది. కానీ.. ఇక్కడే ఏదో తేడా కొట్టిందని చెవులు కొరుక్కుంటున్నారు.

శ్రీశైలం ఆలయ సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఈ మధ్యనే మార్చారట. ఆయనను తిరిగి కొనసాగించాలని ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి సిఫారసు చేసినట్టు సమాచారం. అయితే సెక్యూరిటీ ఆఫీసరుగా డీఎస్పీ స్థాయి అధికారి ఉండాలని అధికారులు ఛైర్మన్‌కు ముఖంమీదే చెప్పేశారట. తన మాట చెల్లుబాటు కాలేదన్న కోపమో ఏమో.. ప్రసాదాల సరుకుల కొనుగోలుపై చక్రపాణిరెడ్డి ఆరోపణలు చేశారని చెవులు కొరుక్కుంటున్నారట. ప్రసాదాల కోసం వినియోగించే 127 సరుకులను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారనేది ఛైర్మన్ ఆరోపణ. 15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్‌ ఇస్తున్నారని చక్రపాణిరెడ్డి వెల్లడించారు. ఛైర్మన్‌ ప్రస్తావించిన ఈ అంశాలనే బోర్డులోని ఇద్దరు సభ్యులు.. ఈవో లవన్న ఖండించారు. మొత్తానికి సమస్య ఎక్కడ మొదలైనా.. శ్రీశైలం ఆలయంలో ఏదో జరుగుతోందనే అభిప్రాయం భక్తుల్లో కలిగేలా బోర్డు, అధికారుల వైఖరి వుందని గుసగుసల వినిపిస్తున్నాయి.