NTV Telugu Site icon

Off The Record: సిక్కోలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాల కుంపట్లు

Mlc Elections,

Mlc Elections,

Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల MLC అభ్యర్థిగా వైసీపీ నర్తు రామారావును ఎంపిక చేసింది. లోకల్‌ బాడీలో వైసీపీకి పూర్తిస్థాయి బలం ఉండటంతో నర్తు నామినేషన్‌ వేస్తే ఏకగ్రీవమే అని అనుకున్నారు. నర్తు రామారావు యాదవ సామాజికవర్గం నాయకుడు. అయితే ఈ ఎమ్మెల్సీ సీటును ఆశించారు వైసీపీలోని తూర్పుకాపు సామాజికవర్గం నేతలు. ఇప్పుడు సీటు రాకపోవడంతో రెబల్‌గా మారారు. స్వతంత్ర అభ్యర్ధిని బరిలో దించడంతో రాజకీయం మలుపు తీసుకుంది. తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన ఆనేపు రామకృష్ణ నామినేషన్‌ వేయడం.. అధికారుల స్క్రూటినీలో ఆయన నామినేషన్‌ ఓకే కావడం.. జిల్లాలోని అధికారపార్టీ నేతలకు మరింత బీపీ తెచ్చిపెట్టిందని టాక్‌.

Read Also: Off The Record: దుర్గగుడిలో చెల్లుబాటు కాని మంత్రి మాట..! మాజీ మంత్రిదే పెత్తనం..!

ప్రస్తుతం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్‌గా మారిపోయింది. బరిలో ఉన్న అధికారపార్టీ అభ్యర్థి నర్తు రామారావుది ఇచ్ఛాపురం. నర్తును అభ్యర్థిగా ఎంపిక చేయడానికి ముందు అధికారపార్టీలో అంతర్గతంగా చాలానే అంతర్మథనం జరిగిందట. ధర్మాన సోదరులు చక్రం తిప్పడంతో నర్తు తెరపైకి వచ్చారని చెబుతున్నారు. దీనిపై తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు రుసరుసలాడుతున్నారు. తమకు DCCB ఛైర్మన్‌ మినహా మరెలాంటి పదవి దక్కలేదన్నది వారి వాదన. కాలింగ, వెలమలతోపాటు జిల్లాలో కీలక సామాజికవర్గంగా ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదని ఫైర్‌ అవుతున్నారు. ప్రత్యేకంగా సమావేశమై రామకృష్ణను అభ్యర్థిగా ఫీల్డ్‌లోకి దించేశారు. దీంతో ఇప్పుడేం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Read Also: Off The Record: సీడబ్ల్యూసీలో చోటు దక్కే ఆ ఒక్క కాంగ్రెస్‌ నేత ఎవరు?

జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో 729 ఓట్లు ఉన్నాయి. వీటిలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు 196 మంది కాగా.. కాలింగ సామాజికవర్గం ఓట్లు 109, వెలమ సామాజికవర్గం ఓట్లు 93, యాదవ సామాజికవర్గం ఓట్లు 44 ఉన్నాయి. ఈ గణాంకాలే అధికారపార్టీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. తూర్పుకాపు సామాజికవర్గం నేతలను బుజ్జగించే పనులు మొదలయ్యాయి. అయితే అసంతృప్తితో ఉన్న నాయకులు బుజ్జగింపులకు లొంగుతారా లేదా అనేది ప్రశ్న. అన్నీ అనుకున్నట్టు సాగితే ఎన్నిక ఏకగ్రీవమే. కాదూ కూడదు.. తేల్చుకోవాలని తూర్పుకాపు సామాజికవర్గం నాయకులు నిర్ణయిస్తే పోటీ తప్పదు. క్యాంపులు, బేరసారాలకు తెరలేచే అవకాశం ఉంది. అయితే అధికారపార్టీ నాయకులు మాత్రం అంత వరకు రాదని.. ఇది పార్టీ నిర్ణయం కావడంతో… ఎవరు ఏ సామాజికవర్గమైనా వైసీపీ నిర్ణయానికి కట్టుబడి ఓటు వేస్తారని ధీమాగా ఉన్నారు. గెలిచేది పక్కా అయినప్పటికీ.. మధ్యలో ఎదురైన ఈ పరిణామాలు స్పీడ్‌బ్రేకర్లు వంటివని అభిప్రాయ పడుతున్నారట. అభ్యర్థి ఎంపికలో కీలక పాత్ర పోషించి.. అధిష్ఠానాన్ని ఒప్పించిన ధర్మాన సోదరులే.. ఈ సమస్యనూ పరిష్కరిస్తారని చెబుతున్నారట. మొత్తానికి అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటీ కావడంతో MLC ఎన్నిక హాట్ హాట్‌ చర్చగా మారిపోయింది.