Off The Record about Sangh Parivar Warning: ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ క్షేత్రాల మధ్య తరచూ సమావేశాలు జరుగుతుంటాయి. రాబోయే కాలంలో ఏం చేయాలో ప్రణాళికలు రూపొందించుకోవడంతోపాటు.. ఇప్పటి వరకు చేసిన పనులపై ఆ సమావేశంలో పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ శివారుల్లో సంఘ్ పరివార్ క్షేత్రాల సమావేశాన్ని మాత్రం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ పెద్దలతోపాటు బీజేపీ, ఏబీవీపీ, వీహెచ్‌పీ, బీఎంఎస్, బీకేఎస్, ఉపాధ్యాయ సంఘం నేతలతోపాటు ఇతర పరివార్ క్షేత్రాల ముఖ్యులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న పోరాటం.. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై సుధీర్ఘ చర్చ చేశారట.
Read Also: Off The Record about Putta Sudhakar: టీడీపీ కేడర్‌కు అంతుచిక్కని పుట్టా తీరు.. పోటీ చేస్తారా..?
సమావేశానికి వచ్చే వాళ్లకు ఎన్నికలపై తగిన సలహాలు.. సూచనలు ఇవ్వాలని ముందుగానే చెప్పడంతో ఆ మేరకు అంతా పూర్తి కార్యాచరణతో వచ్చారట. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో బీజేపీ చేయాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన అంశాలను చాలానే ప్రస్తావించారట. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న పనులతో ఎన్నికల్లో గెలవాలంటే సరిపోదని స్పష్టంగా చెప్పేశారట. ఇంకా చేయాల్సింది చాలానే ఉందని కుండ బద్దలు కొట్టేశారట సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రముఖులు. బీజేపీ ఇంకా అగ్రెసివ్‌గా జనాల్లోకి వెళ్లాలని.. పోలింగ్ బూత్‌ల కేంద్రంగా ఇంకా పార్టీ బలపడలేదని చెప్పారట. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని అనుకుంటే దెబ్బతింటారని కుండబద్దలు కొట్టేశారట సంఘ్ పెద్దలు.
బీజేపీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని.. అంతా ఒకతాటిపై ఉన్నామనే విశ్వాసం కేడర్‌కు కల్పించాలని సమావేశంలో సూచించారట. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి పార్టీ సిద్ధాంతాలు.. కార్యపద్ధతిపై అవగాహన కల్పించాలని.. లేకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని హెచ్చరించినట్టు సమాచారం. నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలపై అనుకున్న స్థాయిలో పోరాటం చేయడం లేదని.. డ్రగ్స్, లిక్కర్ స్కామ్ వంటి కీలక అంశాలపై మరింత బలంగా ఉద్యమించాలని చెప్పారట. వీటి విషయంలో ఎందుకు గట్టిగా పోరాటం చేయడం లేదని ప్రశ్నించారట. కేసీఆర్ హఠావో వంటి నినాదాలు ఎలా ఉన్నా.. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పాలి కదా అని సూచించారట. హిందువులు.. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు… లవ్ జీహాద్ వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయట. పరివార్ క్షేత్రాలు చేసిన సూచనలు నోట్ చేసుకున్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్.. రాష్ట్రంలో ఏడు రకాల వ్యతిరేక శక్తులతో పోరాటం చేస్తున్నామని వెల్లడించారట. సంఘ్ పరివార్ క్షేత్రాల సహకారం కూడా బీజేపీకి కావాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిర్వహించిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను.. తక్కువ సమయంలో బీజేపీ ఏ మేరకు అమలు చేస్తుందో చూడాలి.