Site icon NTV Telugu

Off The Record: ప్రత్తిపాడు టీడీపీలో టికెట్‌ పంచాయితీ..?

Prathipadu,

Prathipadu,

Off The Record: మొన్నటి వరకు ప్రతిపాడు టిడిపి కోఆర్డినేటర్‌గా ఉన్న వరుపుల రాజా.. అనారోగ్యంతో చనిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయన ప్రతిపాడులో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు రాజా స్థానంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. నాయకులు ఎవరి స్థాయిలో వాళ్లు తమ్ముళ్లను ట్యూన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజా మృతి తర్వాత పరామర్శకు టిడిపి అధినేత చంద్రబాబు వచ్చారు. రాజా భార్యను టీడీపీ ఇంచార్జ్‌గా ప్రకటించాలని చంద్రబాబు ఎదుటే నినాదాలు చేశారు అనుచరులు. రాజా కుటుంబానికి అండగా ఉంటామని అధినేత చెప్పినప్పటికీ.. ఇప్పుడే సీటు కన్ఫామ్ చేయాలని పట్టుబట్టారు. ఈ పంచాయితీ తేలకపోవడంతో ప్రత్తిపాడులో కర్చీఫ్‌ వేసేవాళ్లు ఎక్కువయ్యారు.

Read Also: Off The Record: ప్రకాష్‌రాజ్‌ ఏమైపోయారు..? ఎన్నికల్లో పోటీ చేస్తారా?

రాజాకు తాత వరుసయ్యే సుబ్బారావు ప్రత్తిపాడు సీటుపై కన్నేశారట. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ దక్కకపోవడంతో మళ్లీ వైసీపీ శిబిరంలోకి వెళ్లిపోయారు సుబ్బారావు. కానీ.. అక్కడ కుదురుకోలేక మళ్లీ సైకిల్‌ ఎక్కే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు వచ్చినప్పుడు సుబ్బారావు చేసిన హడావిడి చూసిన వాళ్లంతా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బారావు టిడిపి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకి వియ్యంకుడు. ఈ విషయంలో ఆయనకు నెహ్రూ సహకరిస్తారా అనేది డౌట్‌. ఎందుకంటే.. ప్రత్తిపాడు సీటును జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కూడా ఆశిస్తున్నారట. జ్యోతుల నెహ్రూ తనయుడే నవీన్‌. ప్రత్తిపాడు పొరుగు నియోజకవర్గం జగ్గంపేట టీడీపీ ఇంఛార్జ్‌ నెహ్రూనే. పక్క పక్క సెగ్మెంట్లే కావడంతో ప్రత్తిపాడులో పోటీ చేస్తే ఎలా ఉంటుందా అని ఆరా తీస్తున్నారట.

ఇక మొన్నటి వరకు తుని టిడిపి ఇంఛార్జ్‌గా ఉన్న యనమల కృష్ణుడు సైతం తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారట. ప్రత్తిపాడులో యాదవుల ఓట్లు కీలకం. కొన్ని సందర్భాలలో వారే డిసైడింగ్ ఫ్యాక్టర్‌ కూడా. ప్రత్తిపాడులో మొదటి నుంచీ కాపులకు టికెట్‌ ఇస్తున్నారని.. ఈసారి బీసీలను పరిగణనలోకి తీసుకోవాలని కొత్త సమీకరణాలను తెరమీదకు తెస్తున్నారట కృష్ణుడు. ప్రత్తిపాడు టికెట్‌ కోసం నాయకులు చేస్తున్న ప్రయత్నాలు చూసి కేడర్‌ సైతం ఆశ్చర్యపోతోందట. ఎవరి వర్గాన్ని వాళ్లు సిద్ధం చేసుకోవడం చూసి అవాక్కు అవుతున్నారట. మొత్తానికి రాజా మరణం తర్వాత ఇంత వేగంగా టీడీపీలో ఈ పంచాయితీ వస్తుందని పార్టీ పెద్దలు కూడా ఊహించలేదట. మరి.. టీడీపీ అధిష్ఠానం ఈ సమస్యను తేల్చుతుందో.. ఎప్పటిలా నాన్చుతుందో చూడాలి.

Exit mobile version