NTV Telugu Site icon

Off The Record: పోతుల సునీత టీడీపీ ఎంట్రీ టఫ్‌గా ఉందా?

Pothula Sunitha

Pothula Sunitha

Off The Record: ఇటీవలే వైసీపీకి బైబై చెప్పిన ఎమ్మెల్సీ పోతుల సునీతకు టీడీపీ ఎంట్రీ అంత ఈజీ కాదన్న టాక్‌ నడుస్తోంది ఉమ్మడి ప్రకాశం పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఆమె రాకను తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు సునీత. అదింకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో టీడీపీలో చేరేందుకు పోతుల పావులు కదుపుతున్నా.. రానీయవద్దంటూ చీరాలలో టీడీపీ నేతలు రోడ్డెక్కుతున్న పరిస్థితి. గతంలో టీడీపీ నుంచి వైసీపీకి మారిన పోతుల సునీత ఆ పార్టీ మౌత్ పీస్‌గా పనిచేశారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా పదవితో పాటు రెండు సార్లు ఎమ్మెల్సీ ఛాన్స్‌ ఇచ్చారు జగన్‌. అయితే… రాష్ట్రంలో అధికారం మారాక అనూహ్యంగా పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు సునీత. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పినా అడుగులు టీడీపీవైపేనన్నది అనుచరుల మాట.

పరిటాల రవి అనుచరులు అయిన పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్‌ మావోయిస్టు రాజకీయాల నుంచి టిడిపిలో చేరారు. చీరాల నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిన సునీతకు 2017లో ఎమ్మెల్సీ ఛాన్స్‌ ఇచ్చారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారం కోల్పోవటంతో మరో మూడేళ్ల పదవీకాలం ఉండగానే… తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారామె. ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది వైసీపీ. ఆ పదవీకాలం 2023 మార్చితో ముగియగా… మరోసారి ఛాన్స్‌ ఇచ్చారు జగన్‌. వైసీపీలో చేరిన నాటి నుంచి…. అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వచ్చారామె.. ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్సీ. తాను ఏ పార్టీలో చేరేది డైరెక్ట్ గా ఇంత వరకూ చెప్పలేదు సునీత. కానీ…. కచ్చితంగా టీడీపీలో చేరుతారనే ఊహాగానాలతో అలర్ట్‌ అయ్యారట చీరాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఆమెను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ స్థానిక గడియార స్తంభం సెంటర్లో టీడీపీ, జనసేన నేతలు ఆందోళనకు దిగటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

అంతటితో ఆగని తమ్ముళ్లు పోతుల సునీత ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి దహనం చేసి ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయటం హాట్ టాపిక్ అయింది. దీంతో ఆమె టీడీపీలో చేరడం అంత తేలిక కాదన్న చర్చ మొదలైంది. ఇప్పటికే చీరాలలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకు వెళ్ళారట స్థానిక టీడీపీ నేతలు.. మరి తమ్ముళ్ళ ఫిర్యాదులపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఆమె ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక తమ్ముళ్ళ మాట ప్రకారం రెడ్ కార్డ్ చూపిస్తారా? అన్న చర్చ మొదలైంది. ఒకవేళ రెడ్ కార్డ్ పడితే సునీత తదుపరి అడుగులు ఎటువైపు అన్నది కూడా సస్పెన్స్‌గానే ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.