Site icon NTV Telugu

Off The Record: పవన్ కల్యాణ్‌ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నాడా..?

Pawan

Pawan

Off The Record: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయింది సుగాలి ప్రీతి కేసు. ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలన్న నినాదం జనంలోకి బాగా వెళ్ళి నాటి వైసీపీ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టడంతో పాటు అదే సమయంలో పవన్‌కు కూడా రాజకీయంగా బలాన్నిచ్చిందని చెప్పుకుంటారు. కానీ.. నాడు అడ్వాంటేజ్‌ అయిన కేసే నేడు అదే పవన్‌కు డిస్‌ అడ్వాంటేజ్‌ అవుతోందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా.. కేసు దర్యాప్తునకు అతీగతీ లేదని, అపోజిషన్‌లో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడిన పవన్‌ ఇప్పుడేం చేస్తున్నారంటూ… ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్వయంగా సుగాలి ప్రీతి తల్లే పవన్‌పై డైరెక్ట్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే.. పవన్ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే అయినా, ఫలితం కనిపించకపోవడంతో.. అది మరోసారి పొలిటికల్‌ టర్న్‌ తీసుకోవడమేగాక… అనుమానాలు సైతం పెరుగుతున్నాయట. పవన్ నిజంగానే ఇప్పటికీ.. ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటున్నారా? లేక పవర్‌లోకి వచ్చాక కేవలం పొలిటికల్‌ యాంగిల్‌లోనే చూస్తున్నారా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి వివిధ వర్గాల్లో. అవి మరింత పెరుగుతూ వైసీపీకి అస్త్రంగా మారి డిప్యూటీ సీఎంను ఇరకాటంలోకి నెట్టే అవకాశం లేకపోలేదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే.. తాజాగా సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

Read Also: Lovers Suicide: “నువ్వు లేని లోకంలో నేను ఉండలేను బంగారం”.. ప్రేమ జంట ఆత్మహత్య..

అయినాసరే, 2017 ఆగస్ట్‌ 18న హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ఈ పదో తరగతి బాలిక ఎలా చనిపోయిందో త్వరగా తేల్చకుంటే మాత్రం రాజకీయంగా పవన్‌ కళ్యాణ్‌ బాగానే ఇరుకున పడవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే… నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసును ఆయన ఆ రేంజ్‌లో హైలైట్‌ చేశారు. అదంతా ఒక ఎత్తయితే… ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం పవన్‌కు ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని మళ్ళీ అందుకుని గట్టిగా స్వరం వినిపించారాయన. కానీ… ఇప్పుడు అధికారంలో భాగస్వామి అయ్యాక అదే విషయంలో క్లారిటీ మిస్ అవుతోందన్న అభిప్రాయం పెరుగుతోంది. రాజకీయ పరిమితులు ఆయన స్టాండ్‌ని మార్చేశాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పవన్ మాటల్లో జాగ్రత్త పెరిగిందని, స్పష్టమైన యాక్షన్ ప్లాన్ లేదన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇదే సమయంలో పవన్ పొలిటికల్‌ బలహీనతలను తనకు అవకాశంగా మలుచుకునే ప్లాన్‌లో ఉంది వైసీపీ. సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ… పవన్‌ను ఫిక్స్‌ చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రతిపక్షం.

Read Also: Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఫలితాలపై లేఖ విడుదల చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి..

సుగాలి ప్రీతి కేసు దర్యాప్తులో ఆలస్యం, స్టీల్ ప్లాంట్‌ విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడాన్నే ఆయుధాలుగా మల్చుకుంటోంది ఫ్యాన్‌ పార్టీ. వీటి ఆధారంగా పవన్‌ను కేవలం మాటల నాయకుడుగా ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్‌లో ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ప్రతిపక్ష నాయకుడిగా పవన్ చూపిన దూకుడు ఒక రకమైన మోరల్ హై గ్రౌండ్ ఇచ్చింది. కానీ అధికారంలో అదే దూకుడు కొనసాగించడం కష్టమైనా… తగ్గ స్థాయిలో కూడా లేదన్న అభిప్రాయం బలపడుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కూటమి పరిమితులు ఆయన చేతుల్ని కట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడ్డం, నిర్ణయాలను కూడా అదే స్థాయిలో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అంతేకాక, ప్రజల్లో ఆయనపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో… నాటి కీలక వాగ్దానాల అమలు విషయంలో ఆయన సీరియస్‌గా రియాక్ట్‌ అవుతారా? లేక అపోజిషన్‌ ప్రచారం చేస్తున్నట్టు పొలిటికల్‌ స్టంట్‌ మాస్టర్‌గా మిగిలిపోతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్షంలో బలంగా పనిచేసిన వ్యూహం, అధికారంలోకి వచ్చాక బలహీనతగా మారి బెడిసి కొడుతుందా..లేక పరిస్థితులు చేయిదాటిపోక మందే పవన్‌ రియాక్ట్‌ అయి… రీ డిఫైన్‌ చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

Exit mobile version