Off The Record: సొంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వాళ్ళ మీద ఇంటర్నల్ సర్వే, క్లోజ్ మానిటరింగ్ మొదలు పెట్టారట ఆయన. ఎక్కడ పీక్ ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి? ఎవరు లైన్ క్రాస్ అవుతున్నారు? ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? అక్రమాలకు వైపు మళ్ళుతున్నారా లాంటి పూర్తి స్థాయి నివేదికల్ని పవన్ తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అవినీతి, అక్రమాలు, సెటిల్మెంట్లు, ఇతర దందాల్లో మునిగి తేలుతున్న, జనసేన పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయి హెచ్చరికలు వెళ్తున్నాయట పవన్ నుంచి. పైగా సమాచారం కోసం పార్టీ వర్గాల చెప్పే మాటల మీద మాత్రమే ఆధారపడడం లేదు డిప్యూటీ సీఎం. పార్టీలో ఉండే పరస్పర మొహమాటాలు, గ్రూపుల కారణంగా నిఖార్సయిన సమాచారం తన దగ్గరికి రాదన్న ఉద్దేశ్యంతో… ప్రత్యేకంగా గ్రౌండ్ టీమ్‌లను రంగంలోకి దించినట్టు తెలిసింది.
ఈ టీంలు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, కార్యకర్తల ఫీడ్‌బ్యాక్, స్థానిక సమస్యలు…. ఇలా అన్ని వివరాలు సేకరించి రోజువారీ నివేదికల్ని పవన్ టేబుల్ మీద పెడుతున్నట్టు తెలుస్తోంది. సమాచారం అంటే… ఏదో పేపర్ మీద ఇచ్చేశామన్నట్టు కాకుండా… ఎమ్మెల్యేలు, వాళ్ళ పీఏలు, అనుచరులు, స్థానిక నాయకులు చేసే అక్రమాలకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాల్ని కూడా పవన్ స్పెషల్ టీమ్స్ సేకరిస్తున్నట్టు సమాచారం. వాటి ఆధారంగానే ఒక క్లారిటీకి వస్తున్నారట ఉప ముఖ్యమంత్రి. తాను గీసిన బోర్డర్‌లైన్‌ను క్రాస్ చేసే ఎమ్మెల్యే ఎంతటి వాళ్ళయినా ఉపేక్షించే ప్రసక్తే లేదని పవన్ క్లారిటీగా చెప్పేస్తున్నారట. రహస్య నివేదికల ఆధారంగా…. ఇప్పటికే లైన్ క్రాస్ చేసిన కొందరు జనసేన శాసనసభ్యులకు డేంజర్ సిగ్నల్ పంపినట్టు తెలుస్తోంది.వాళ్ళు వీళ్ళని లేకుండా… సొంత పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను పవన్ కంటిన్యూస్‌గా మానిటర్ చేస్తున్నట్టు సమాచారం. అవినీతి, అక్రమాలతో పార్టీకి, తనకూ, ప్రభుత్వానికీ ఇబ్బందిగా మారుతున్న కొందరికి తాజాగా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారాల గురించి పవన్ స్వయంగా ఓపెన్‌గా మాట్లాడ్డం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, గ్రావెల్, ప్రైవేట్ సెటిల్మెంట్స్, ప్రభుత్వ పనుల్లో అనవసర జోక్యం లాంటి కారణాలతో మరి కొందర్ని హెచ్చరించారట పవన్. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే వ్యవహారం కూడా పవన్ దృష్టికి వచ్చిందంటున్నారు. ఆ ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచే మంచికన్నా చెడు విషయంలోనే బాగా పాపులర్ అవుతున్నారు. ఆయన మీద ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా రావడంతో…అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుకుంటున్నాయి జనసేన వర్గాలు. అధినేతకు స్వయంగా తన బాగోతం తెలిసిపోవడం, ఆయనే పిలిచి అక్షింతలు వేయడంతో… సదరు శాసనసభ్యుడు దిద్దుబాటలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఎమ్మెల్యే…. నా పేరు చెప్పి రేషన్ బియ్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు, రేషన్ మాఫియా సమాచారం ఇచ్చిన వారికి మంచి బహుమతి అంటూ బహిరంగంగా ప్రకటించాల్సి వచ్చింది. ఇలా పవన్ వ్యవహారశైలి చూస్తున్న పార్టీ నేతలు… జనసేనలో డిసిప్లిన్‌పై పవన్ ఫోకస్ అంటే ఇది. కేవలం వార్నింగ్స్ ఇవ్వడం కాదు. చర్యలు తీసుకోవడం ద్వారా… సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని క్లారిటీ ఇచ్చినట్టయిందని మాట్లాడుకుంటున్నారు గ్లాస్ లీడర్స్.