Off The Record: ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా…. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి వాడే మొట్టమొదటి అస్త్రం లోకల్- నాన్ లోకల్. ఎందుకంటే ఏ ప్రాంతం వారైనా.. సాధారణంగా లోకల్ నాయకుల్నే ఎక్కువగా ఆదరిస్తారు. ఇతరులు వచ్చి పోటీ చేస్తే… ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం ఎలా చేస్తారన్నట్టుగా చూస్తారు. అయితే… అలా జరిగిన ఎక్కువ సందర్భాల్లో ఆ గొడవను దాటుకొని ఒకసారి విజయం సాధించారంటే మాత్రం ఆ ప్రాంత ప్రజలు సదరు నాయకుడిని ఓన్ చేసుకుంటారు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులుది కూడా ఇలాంటి సిచ్యుయేషనే. ఇక్కడి ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకున్నారు. కానీ… నాన్ లోకల్ అంటూ మొదలైన కొత్త ప్రచారం ఆయనకు కంట్లో నలుసులా మారిందట. కాల్వ శ్రీనివాసులు సొంతూరు శింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలోని అగ్రహారం. గతంలో జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు ఆయనకు పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కాల్వ ఫస్ట్‌టైం లోక్‌సభకు వెళ్లారు. ఆ తర్వాత మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారాయన. దీంతో ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలన్న లక్ష్యంతో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలనుకున్నారు మాజీ ఎంపీ. అందులో భాగంగానే రాయదుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి భారీ విజయమే సాధించారాయన. ఇక అప్పటినుంచి కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గం ప్రాంతంలో ఆదరణ లభించింది. ఈ ఎమ్మెల్యే హోదాతోనే… ప్రభుత్వ చీఫ్ విప్, మంత్రిగా కూడా పనిచేసే అవకాశాలు దక్కాయి. అందుకు తగ్గట్టే నియోజకవర్గం మీద తన మార్కు వేసుకున్నారాయన. అయితే… 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు కాల్వ. ఓడిపోయినప్పటికీ 2019- 24 మధ్య రాయదుర్గం నియోజకవర్గాన్ని వీడలేదు. ముఖ్యంగా కాపు రామచంద్ర రెడ్డితో ఢీ అంటే ఢీ అని తలపడుతూ ఐదేళ్లపాటు పెద్ద పోరాటమే చేసినట్టు చెబుతారు. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు శ్రీనివాసులు. ఈ సారి ప్రభుత్వ విప్‌గా ఛాన్స్ దక్కింది. అలా రెండేళ్లు గడిచాక ఇప్పుడు కొత్తగా ఆయన విషయంలో లోకల్-నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది. కాల్వ శ్రీనివాసులు నాన్ లోకల్ వ్యక్తి అంటూ కొద్ది రోజులుగా….. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో… అలర్ట్ అయిన తెలుగుదేశం నాయకులు ఎప్పుడో… ఒకటిన్నర దశాబ్దం క్రితం రాయదుర్గం వచ్చిన, ఇక్కడి నుంచే రాజకీయం చేస్తున్న నాయకుడు నాన్ లోకల్ ఎలా అవుతారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడి నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయ్యారు. అలాంటి నాయకునిపై నాన్ లోకల్ ముద్ర వేయడం సరైనది కాదంటూ టిడిపి నాయకులు కౌంటర్స్ వేస్తున్నారు. అదలా ఉంటే….అసలు కాల్వ శ్రీనివాసులు మీద ఈ ప్రచారం మొదలుపెట్టింది ఎవరన్నది ప్రస్తుతం అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. రాజకీయ ప్రత్యర్థులే ఆయన్ని టార్గెట్ చేశారా…? అంటే గత కొన్ని రోజులుగా రాయదుర్గం నియోజకవర్గంలో అసలు వైసీపీ నాయకులు యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. దాంతో… కూటమి పార్టీల నేతల్లో ఎవరైనా పథకం ప్రచారం సోషల్ మీడియాలో వదిలి తమాషా చూస్తున్నారా అన్న సందేహాలు సైతం వస్తున్నాయి. అయితే శ్రీనివాసులు మాత్రం దీనికి దీటుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రచారం చేసేది సొంతోళ్ళయినా, పగోళ్ళయినా… డోంట్ కేర్. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని క్లారిటీగా చెప్పేస్తున్నారు. అయితే అదే సమయంలో కనిపించని శత్రువుతో పోరాటం కాస్త కష్టమే అయినా…..కనుక్కుని చెక్ పెట్టకుంటే పంటికింద రాయిలా మారుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

