Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత పార్టీలో కొత్త చర్చ మొదలైందట. మరి కొందరు కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. వంశీ వ్యవహారం ఓవైపు నడుస్తుండగానే ఇక తర్వాతి నంబర్స్ కొడాలి నాని, పేర్ని నానిలవేనంటూ.. టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై ప్రతిపక్షంలో హాట్ హాట్ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. దీంతో టీడీపీ నెక్స్ట్ టార్గెట్ ఇద్దరు నానీలే అన్న ప్రచారం పెరుగుతోంది. ఈవీఎంల ధ్వంసం కేసులో పార్టీ ముఖ్యనేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు బుక్ అయి ఆయన జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత మాజీ ఎంపీ నందిగం సురేష్ మరో కేసులో అరెస్టై కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు కావటం.. కోర్టు బెయిలు ఇవ్వటంతో కాస్త ఊరట లభించిందని అంటున్నారు. ఇంకా పలువురు వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నడుస్తున్నాయి.
ఇక రకరకాల ట్విస్ట్‌ల మధ్య వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. అసలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంశీ, కొడాలి నానిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అన్నట్టుగా ఎదురు చూస్తోంది టీడీపీ కేడర్. వాళ్ళిద్దరూ రాజకీయాలను.. రాజకీయాల్లా కాకుండా… వ్యక్తిగత స్థాయికి తీసుకువెళ్లి కుటుంబాలను కూడా టార్గెట్ చేయడంతోనే టీడీపీ కార్యకర్తల్లో అంత కసి పెరిగిందని చెప్పుకుంటారు. వారితో పాటు మరో వైసీపీ కీలక నేత పేర్నినానిపై రేషన్ బియ్యం స్కాంలో కేసులు ఉన్నాయి. ఆయన ప్రస్తుతానికి బెయిల్ పై ఉన్నా ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చని అనుకుంటున్నారు. ఇలా… కారణాలు ఏవైనా కనిపిస్తున్న ఎలివేషన్లు మాత్రం వారి అరెస్టులు తప్పవనేలాగే ఉన్నయంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇక్కడే వైసీపీలో కొత్త రకం చర్చ మొదలైందట. చాలామంది మీద కేసులు ఉన్నాయి. వరుసగా అరెస్ట్‌లు జరుగుతున్నాయి. ఇలా.. ఎంత కాలం అరెస్ట్ చేయాలని డిసైడైన వాళ్ళు మనం ఆగమంటే ఆగుతారా? అలాగని ఎన్నాళ్ళు దాక్కుంటాం. దానికి బదులు బయటికి వచ్చి జనంలో తిరగడమే బెటరని అనుకుంటున్నట్టు సమాచారం. భయంతో ఏ మూలన దాక్కున్నా.. ఏదో ఒకరోజు అరెస్టుల నుంచి మాత్రం తప్పించుకోలేమని, దానికి బదులు ప్రజల్లో తిరుగుతూ అరెస్ట్ అయితే… కాస్తో కూస్తో సానుభూతి కూడా వస్తుందని ఫిక్స్ అవుతున్నారట. ఇప్పటికే వరుసగా పిన్నెల్లి, నందిగం సురేష్, వంశీ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్లు అనుకున్న వాళ్లను ఎలాగూ లోపలేస్తారు… ఇంకో పదో పన్నెండో కేసులు పెడతారు…. పెడితే పెట్టుకోనివ్వండి ఏమవుతుంది? మహా అయితే నాలుగు రోజులు జైల్లో ఉంటాం.. ఆ తర్వాత బయటకు వస్తాం.. ఆ మాత్రం దానికే భయపడి దాక్కుని దాక్కుని బతకడం ఎందుకుఅని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ రాజకీయం గురించి ప్రజలకు కూడా తెలుసుకదా… మనమెందుకు వెనకడుగు వేయడమన్నది వైసీపీ ముఖ్య నాయకుల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు కూటమి నేతలు కిడ్నాపులు చేసినా కేసులు నమోదు కావటం లేదని.. తమ మీద మాత్రం మూడు, నాలుగేళ్ల క్రితం జరిగిన విషయాలకు సంబంధించి ఫిక్స్ చేస్తున్నారంటూ వాపోతున్నారట వైసీపీ లీడర్స్. అరెస్ట్ అవ్వాలని రాసిపెట్టుంటే ఎవరూ తప్పించలేరంటూ మెట్ట వేదాంతం కూడా చెబుతున్నారట కొందరు ఫ్యాన్ లీడర్స్. భయపడుతూ కూర్చుంటే.. మరింత భయపెడతారు.. అలా భయపడుతూ రాజకీయాలు చేయలేం కదా అని అంటున్నట్టు సమాచారం. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఈ అరెస్టులు ఇంతటితో ఆగవని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే వంశీ ములాఖత్ సందర్బంలో కూడా మా నేతలు మరి కొందరిని టార్గెట్ చేశారు.. వారిపై కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు.. అయినా తగ్గేదే లేదనట్లుగా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.. మరి వైసీపీ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతుందా.. చేసుకుంటే చేసుకోనివ్వండని వాళ్ళు నిజంగానే డిసైడ్ అయ్యారా.. లేక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా.. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్ట్‌లు ఉండబోతున్నాయన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.