Site icon NTV Telugu

Off The Record : కన్నా – నాదెండ్ల భేటీ ఆంతర్యం ఏంటి? వ్యూహమా..? తెగింపా..?

Nadella And Kanna

Nadella And Kanna

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నెంబర్‌ టు నాదెండ్ల మనోహర్‌ భేటీ.. పొలిటికల్‌ సర్కిళ్లలోనే కాదు.. సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చ జరుగుతోంది. బీజేపీతోపాటు.. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కన్నా.. అంత ఈజీగా మీడియాలో ఫోకస్‌ అవ్వాలన్న ఆలోచన చేయరు. అదే విధంగా జనసేన PAC చైర్మన్‌గా ఉన్న మనోహర్ సైతం ఇంటర్నల్ వ్యవహారాలు మీడియా ముందు ఉంచరు. అలాంటి ఇద్దరు నేతలు హఠాత్తుగా భేటీ అవ్వడం.. దానికి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగటం వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి? ఈ ప్రశ్న చుట్టూనే చర్చ జరుగుతోంది.

Read Also: Off The Record about Aleru TRS: ఆలేరు గులాబీ శిబిరంలో అలజడి.. ఎమ్మెల్యే దంపతులపై కేడర్‌ గుర్రు..!

ప్రధానమంత్రి మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత జనసేన తన వ్యూహం మార్చుకున్నట్టు టాక్‌ నడుస్తోంది. బీజేపీతో ప్రయాణం సాగిస్తూనే వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయలేని కమలనాథులను దూరం పెట్టాలన్న ఆలోచనలో జనసేన ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుపై గుర్రుగా ఉన్న జనసేన నాయకులు.. ఇప్పుడు వీర్రాజు వ్యతిరేక నాయకులను, గ్రూపులను కలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారట. వాస్తవానికి బీజేపీతో జనసేనకు గ్యాప్ ఉందన్న ప్రచారం బయట నడుస్తుంది. అలాంటి ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టాలంటే బీజేపీలోని సీనియర్ నేతలను కలుపుకొని వెళ్లే యోచనలో జనసేన ఉందట. తాజా భేటీ ద్వారా వీర్రాజు వల్లే జనసేన బీజేపీకి దూరం అవుతుందన్న సంకేతాలను ఆ పార్టీ హైకమాండ్‌కు పంపిందనే అభిప్రాయం కలుగుతోంది.

తాజా భేటీ బీజేపీ పెద్దలకు తెలియకుండా జరుగుతుందా అంటే అది ప్రశ్నార్థకమే. బీజేపీలో కీలక నేతగా.. జాతీయ కార్యవర్గ సభ్యుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఎలాంటి అడుగు వేయాలన్నా అధిష్ఠానం నిర్ణయం.. ఆదేశం తప్పనిసరి. అలాంటిది మరోపార్టీ కీలక నాయకుడితో భేటీ అయ్యారంటే దానివెనుక ఉమ్మడి పార్టీల వ్యూహం అన్న ఉండి ఉండాలి.. లేక ఏం జరిగినా పర్లేదు అన్న తెగింపైనా ఉండి ఉండాలి. అలాగే కన్నాతో భేటీ తర్వాత సమావేశ వివరాలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు వివరిస్తామన్న నాదెండ్ల వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? నాదెండ్లతో కన్నా ఏం చెప్పారు? ఏ విషయంలో పవన్ కళ్యాణ్‌తో చర్చిస్తానని నాదెండ్ల వ్యాఖ్యానించారు? ఇలాంటి విషయాలన్నీ ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్ల చర్చల్లో ఉన్నాయి.

కన్నా జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? అదే విషయం మాట్లాడటానికి నాదెండ్ల వచ్చారా? అనే అనుమానాలు ఉన్నాయి. నిజానికి జనసేన PAC ఛైర్మన్‌గా ఉన్న నాదెండ్ల.. ఒక కీలక నేతను కలవాలంటే రాజకీయంగా అనేక లెక్కలు, అంచనాలు వేసుకుని వస్తారు. ముందుగా అంతో ఇంతో పాజిటివ్ ఆలోచనలు లేకపోతే ఇద్దరు కీలక నేతలు భేటీ కావడం దాదాపుగా కుదిరే పని కాదు. అలాంటిది కన్నా ఇంటికి వచ్చి నాదెండ్ల మీడియాతో మాట్లాడారంటే.. తమ భవిష్యత్‌ ప్రణాళికలు మీడియాకు తద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

ఇక మరో అంశం టీడీపీతో కన్నా జట్టు కడతారని. గుంటూరు పశ్చిమ లేదా పల్నాడు నుంచి కన్నా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంతో.. ముందుగానే జనసేన ఆయన్ను తమ గ్రూపులోకి ఆహ్వానించి ఉండవచ్చనే వాదన ఉంది. అంతే కాదు టీడీపీతో జనసేన జట్టు కట్టడానికి బీజేపీ అడ్డుపడితే.. బీజేపీలో ఉన్న కీలక నేతలను తమ వైపుకు తిప్పుకొనే వ్యూహంలో జనసేన నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న జనసేనాని పల్నాడులోని సత్తెనపల్లిలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో పవన్‌తో కన్నా భేటీ అవుతారన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కన్నా- నాదెండ్ల కావాలనే సమావేశమయ్యారని.. ఇది ఒకరకంగా బీజేపీ రాష్ట్ర కమిటీకి ఇతర రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరికలా మారబోతుందని ప్రచారం జరుగుతుంది. నిజానికి కన్నాతో భేటీకి ఒక్క జనసేనే కాదు ఇతర పార్టీలు కూడా ఊవ్విళ్లూరుతున్నాయి. అలాంటి పార్టీలతో భేటీలకు దూరంగా ఉంటూ వస్తున్న కన్నా.. ఒక్కసారిగా జనసేన నాయకులతో సమావేశం కావడం.. కొత్త చర్చలకు, కొత్త సమీకరణాలకు.. కొత్త లెక్కలకు కారణం అవుతుంది.
ప్రస్తుతానికి బీజేపీ నుంచి కన్నా జనసేనతో కలిసి ఉద్యమాలు చేసినా.. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలతో ఆయన కషాయ పార్టీకి దూరం అవుతారని.. రాజకీయంగా గెలుపు అవకాశం ఉంటుందన్న పార్టీలతో జట్టు కడతారనే ప్రచారం ఉంది. అందుకే ముందుగా ఆ ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకున్నారని అనుకుంటున్నారు. చూడాలి.. కన్నా-నాదెండ్ల భేటీతో రానున్న రోజుల్లో ఎలాంటి కీలక పరిణామాలు జరుగుతాయో..!

Exit mobile version