Off The Record:ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో సెగలు కక్కుతోంది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ సొంత ఊరు మైలవరం నియోజకవర్గంలో ఉంది. 2014లో జోగి మైలవరంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ నందిగామలో పోటీ చేసి గెలిచారు. ఇద్దరూ అధికారపార్టీ శాసనసభ్యులుగా ఉన్నా అస్సలు పడటం లేదు. మొన్నటి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి అయ్యారు జోగి రమేష్. అప్పటి నుంచి మైలవరంలో చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఇంకా పెరిగాయి. మైలవరం రాజకీయం మడత పేచీలా మారి అధిష్ఠానం దగ్గర పంచాయితీల వరకు వెళ్లింది.
Read Also: Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..
జోగి మంత్రయ్యాక మైలవరం విషయాల్లో వేలు పెడుతున్నారని ఎమ్మెల్యే వసంత పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వర్గాలతో మాట్లాడారు. తర్వాత మైలవరంపై సీఎం జగన్ సమీక్ష చేశారు. ఆ సమీక్ష తర్వాత మైలవరం లెక్కలు మారుతున్నట్టు టాక్. సమీక్షల్లో అధినేత ఒకరి పేరు చెప్పి.. ఆ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించుకుని రావాలని ఆదేశించేవారు. కానీ.. మైలవరం సమీక్షలో అలా జరగలేదట. వసంత పేరు చెప్పకుండా కేవలం వైసీపీని గెలిపించుకు రావాలని సీఎం అన్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో మైలవరంలో అభ్యర్థిని మార్చేస్తారా అనే చర్చ మొదలైంది. మైలవరంలో వసంతను కొనసాగిస్తారా? లేక జోగి రమేష్‌కు ఛాన్స్ ఇస్తారా అనే అనుమానాలు వైసీపీ కేడర్‌లో ఉన్నాయి. ఇప్పటికే సీటు ఎవరిదో డిసైడ్ కావడం వల్లే వసంత పేరును సమీక్షలో ప్రస్తావించలేదనే వాదన ఉంది. అయితే మైలవరంతోపాటు పెడనలోనూ సిట్టింగ్‌లకు ఇద్దరికీ ఎదురుగాలి వీస్తోందని అధిష్ఠానానికి ఫీడ్ బ్యాక్ వెళ్లిందట. ఇద్దరు నేతలు కలహించుకుని ఆ సీటును చేజార్చుకుంటారా అనే అనుమానం అధిష్ఠానంలో ఉందట.
Read Also: Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? ఆ ప్రచారంలో నిజమెంత?
ఇటీవల ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ వివాహ వేడుకకు మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. ఆ సందర్భంగా వైసీపీ నేత నల్లమోతు మధుబాబు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారట. దానిపై వసంత అభిమానులు మధుబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న వసంత అండ్ కో మధుబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సజ్జల అపాయింట్‌మెంట్ కోరారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ సమస్యను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ దగ్గర పంచాయితీ పెట్టారు. మంత్రి జోగి వర్గం కూడా వసంతపై ఫిర్యాదు చేసింది. మధుబాబుపై చర్యలు తీసుకోకుంటే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని వసంత వర్గం హెచ్చరించగా.. గతంలో జోగి రమేష్‌పై వ్యాఖ్యలు చేసిన వారి సంగతేంటని మంత్రి వర్గం నిలదీసిందట. దీంతో మైలవరం జగడం తారాస్థాయికి చేరినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యకు హైకమాండ్ సూచించే పరిష్కారంపై పార్టీవర్గల్లోనూ ఉత్కంఠ నెలకొంది.