NTV Telugu Site icon

Off The Record about Pinapaka BRS: కాక రేపుతోన్న గులాబీ పాలిటిక్స్‌.. ఎమ్మెల్యే వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే..

Pinapaka

Pinapaka

ఎమ్మెల్యే రేగా కాంతారావు.. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇద్దరిదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గమే అడ్డా. అధికారపార్టీలో ఇద్దరూ వలస నాయకులే. 2018 ఎన్నికల్లో పినపాకలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి తర్వాత కారు ఎక్కేశారు రేగా కాంతారావు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పాయం వెంకటేశ్వర్లు. అంతకుముందు జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకొన్నారు పాయం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు. 2014 తర్వాత జరిగిన జంపింగ్‌లు పినపాకలో పెద్దగా చర్చల్లోకి రాకపోయినా.. 2018 ఎన్నికల తర్వాత మార్చిన కండువాలతో సీన్‌ మారిపోయింది. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఉభయులూ తగ్గేదే లేదన్నట్టుగా ఎత్తుగడలు వేస్తున్నారు. దాంతో పినపాక గులాబీ రాజకీయాలు కాక రేపుతున్నాయి.

Read Also: Off The Record About Janasena Party: ఉత్తరాంధ్రపై జనసేన ఫోకస్‌.. టీడీపీకి టెన్షన్‌.. వైసీపీ విరుగుడు మంత్రం..!

రేగా కాంతారావు టీఆర్ఎస్‌ చేరాక.. విప్‌ పదవి దక్కింది. ఇప్పుడు అధికారపార్టీకి జిల్లా అధ్యక్షుడు కూడా. దీంతో నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు బిగించేందుకు.. సొంత పార్టీలో ప్రత్యర్థుల ఉనికి లేకుండా చేసేందుకు వేయని ఎత్తుగడ లేదు. అది సహజంగానే మాజీ ఎమ్మెల్యే పాయం వర్గానికి కంటగింపుగా మారింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్‌ అని అధినేత ప్రకటించడంతో రేగా ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో పనిచేసుకుని వెళ్తున్నారు. అయితే సిట్టింగ్‌లకే టికెట్స్ అని అధినేత చేసిన ఆ ప్రకటనకు షరతులు వర్తిస్తాయని.. విశ్వసిస్తున్నారు పాయం. గ్రాఫ్‌ బాగోలేకపోతే అభ్యర్థిని మార్చేస్తారనే లెక్కల్లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. పైగా మాజీ ఎంపీ పొంగులేటి ఆశీసులు.. రేగాపై ఉన్న వ్యతిరేకత తనకు ప్లస్‌ అవుతాయని బలంగా నమ్ముతున్నారట.

ప్రస్తుతం పినపాకలో రేగా.. పాయం మధ్య సోషల్‌ మీడియా వార్‌ నడుస్తోంది. అప్పట్లో పొంగులేటి వర్గాన్ని రేగా టార్గెట్‌ చేసేవారు. పినపాకకు పొంగులేటి వస్తున్నారంటే చాలు.. అదే పనిగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టేవారు రేగా. ఓ సందర్భంలో వైరివర్గంపై కేసులు పెట్టించిన ఉదంతాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రేగాకు మద్దతుగా నిలిచిన స్థానిక టీడీపీ శ్రేణులు.. పాయంవైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ విషయం గుర్తించారో ఏమో.. పాయంను టీడీపీలో చేర్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయని రేగా విరుచుకుపడుతున్నారు. వీటికి పాయం వర్గం నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని సవాళ్లు విసురుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ టికెట్‌పై ఇద్దరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇద్దరిలో ఒకరికే టీఆర్‌ఎస్‌ ఛాన్స్‌ వస్తుందన్నది వాస్తవం. మరి.. టికెట్‌ దక్కని రెండో నాయకుడు ఏం చేస్తారన్నది ప్రశ్న. పార్టీ పెద్దల బుజ్జగింపులతో సైలెంట్‌ అయినా.. బరిలో ఉన్న అభ్యర్థి విజయానికి ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. కాదూ కూడదని ప్రత్యర్థులుగా మారి పోటీ చేస్తే మాత్రం పినపాక పోరు రసవత్తరమే.