Off The Record: స్వతహాగా కాస్త దూకుడు నైజం ఉన్న నాయకుడు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. ఇప్పుడాయన వివాదాల్లో చిక్కుకోవడానికి అదే కారణమా అన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో. నిన్నటిదాకా ఇసుక అక్రమార్కులకు అండగా ఉన్నారన్న ఆరోపణలు. నేడు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య సంచలన ఆరోపణలు, ఆత్మహత్యాయత్నం లాంటివి ఆయన్ని రాజకీయంగా ఇరకాటంలో పెడుతున్నాయంటున్నారు. అందులో తప్పొప్పుల సంగతి ఎలాఉన్నా…గుడ్డ కాల్చి తనమీద పడేశారని ఫీలవుతున్నారట ఎమ్మెల్యే. తన బ్యాక్ ఎండ్‌లో ఏదో నడుస్తోందని, రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేని వారు కుట్రలకు తెరతీస్తున్నారని, వాటిని రాజకీయంగానే ఎదుర్కొంటానని సన్నిహితులతో అంటున్నారట కూన. మెదట మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రవికుమార్‌కు నిరాశే మిగిలింది. తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో అయినా కేబినెట్ ర్యాంక్ ఉన్న పదవి దక్కుతుందని ఆశించగా… అదీ దక్కలేదు. వీటన్నిటి వెనక జిల్లాకు చెందిన మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడు ఉన్నారన్నది కూన వర్గం ప్రధాన ఆరోపణ. జిల్లాలో మరో పవర్ సెంటర్ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో అచ్చెన్నాయుడు టీడీపీ పెద్దల దగ్గర తన గురించి చెడుగా చెబుతున్నట్టు అనుమానిస్తున్నారు ఆమదాలవలస ఎమ్మెల్యే. అంగబలం, అర్ధబలం ఉన్నా..అపోజిషన్‌ను గట్టిగా ఢీ కొట్టే వాగ్ధాటి ఉన్నా… పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినా… దక్కాల్సిన గౌరవం దక్కక పోగా, ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి బలమైన లాబీ పనిచేస్తోందన్నది కూన అభిప్రాయం అట.
Read Also: Deeksha Panth : ఇంకేదో అడిగేవాళ్లు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది నియెజకవర్గాల ఎమ్మెల్యేలు అచ్చన్న ఎస్ అంటే ఎస్ , నో అంటే నో అన్నట్టుగా ఉంటారు. ఒక్క కూన రవికుమార్ వైఖరే మంత్రికి మింగుడు పడటం లేదని చెప్పుకుంటున్నారు. గతంలో సిక్కోలు టిడిపిలో కింజరాపు వర్సెస్ కిమిడి కళావెంట్రావ్ గ్రూప్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు మాత్రం జిల్లాలో బాబాయ్ అబ్బాయ్‌లకు ఎదురు నిలుస్తున్నది కూన రవికుమార్ అన్న మాట టీడీపీ వర్గాల నుంచే బలంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో… రవికుమార్ మీద వస్తున్న ఆరోపణల వెనక టీడీపీ బడా నేతలు ఉన్నారన్నది ఆయనన వర్గం అభిప్రాయం. పైగా… ఇది మెల్లిగా కులం రంగు కూడా పులుముకుంటోంది. తమ సామాజికవర్గం నేతను ఇబ్బంది పెడుతున్నారంటూ స్వరం పెంచుతున్నారు కాళింగ నాయకులు. కూన ఇమేజ్ డామేజ్ చేయటంలో వైసీపీకంటే సొంత పార్టీనేతలే ముందున్నారని, వాళ్ళు గోతులు తీయడమే ప్రమాదకరంగా మారిందన్నది ఎమ్మెల్యే మనుషుల మాట. ఇప్పుడు కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారంలో కూడా రాజకీయ కుట్రలున్నాయని ఆరోపిస్తున్నారు కూన అనుచరులు. అదే సమయంలో ఆయన దుందుడుకు వ్యవహారశైలి కూడా ఓ సమస్య అన్నది జిల్లాలో జరుగుతున్న చర్చ. ఇసుక అక్రమ తవ్వకాల ముఠా చేసిన దాడుల్లో తన ప్రమేయం లేదని గతంలో స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆయన. ఇప్పుడు ప్రిన్సిపల్ చేసిన ఆరోపణలు కూడా తన క్యారెక్టర్‌ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆ విషయంలో న్యాయ పోరాటం చేస్తానంటున్నారాయన. మొత్తం మీద రాజకీయ ప్రత్యర్థులకన్నా… సొంత పార్టీ టీడీపీలోని వారే తనను గట్టిగా డ్యామేజ్ చేస్తున్నారని నిర్ధారణకు వచ్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే నెక్స్ట్ ఏం చేయబోతున్నారని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
