Off The Record: సత్యవేడు ఎమ్మెల్యే అదిమూలం రాసలీలలు వీడియోతో ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ ఒక్కసారి ఉలిక్కిపడిందట. పార్టీ క్యాడర్‌తోపాటు జిల్లా నాయకులు, ఇతర శాసనసభ్యులతో సమన్వయం చేసుకోకపోవడంలాంటి వైఖరితోనే ఇంత రచ్చ అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట పార్టీలో. ఏకంగా పార్టీ మండల మహిళా అధ్యక్షురాలే తాను ఎమ్మెల్యేతో ఏకాంతంగా ఉన్న వీడియోను బయటపెట్టడమేగాక ఆయన బెదిరించారంటూ మీడియాకు ఎక్కడంతో… ఈ వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. నాయకురాలి ఆరోపణల్లో నిజానిజాల సంగతి తర్వాత… ముందైతే వీడియో సాక్ష్యం కనిపిస్తోంది కాబట్టే… వెంటనే ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందట టీడీపీ అధిష్టానం. ఈ ఎపిసోడ్‌తో జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డ టైంలో… సస్పెన్షన్ వారిని తలెత్తుకునేలా చేసిందన్నది చిత్తూరు టీడీపీ టాక్. అయితే ఇదే సమయంలో ఈ రాసలీలల వీడియో విడుదల వెనుక ఎవరున్నారన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది.
సొంత పార్టీ నేతలే చేశారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి టీడీపీలోని ఒకరిద్దరు ప్లాన్ చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు ఆదిమూలం. ఈ కోణాన్ని కూడా కాదనలేమంటున్న ఇంకొందరు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే తనను బెదిరించారని చెబుతున్న బాధితురాలు దానిమీద మొదట్లోనే పోలీసులకు, పార్టీ అధిష్టానానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? జులై 10న ఆధారాలు సేకరిస్తే… ఇన్ని రోజులు ఏం చేస్తున్నారన్నది వాళ్ళ ప్రశ్న అట. జిల్లా స్థాయిలో ఎస్పీకి, విజయవాడలో హోం మంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేసే అవకాశముండగా, అదిఇది కాదని నేరుగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టడంపైనా అనుమానాలు ఉన్నాయట కొందరు టీడీపీ నేతలకు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాధితురాలు మరికొందరు నేతలతో కలసి స్వతంత్ర అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ఇచ్చి ప్రచారం చేశారంటూ పోలింగ్‌కు ముందే ఆరోపించారు ఆదిమూలం. దీంతో వీడియో వెనకున్న రాజకీయ కారణాలపై కూడా ఆరా తీస్తున్నాయట పార్టీ వర్గాలు. అన్నిటికీ మించి సొంత పార్టీకి చెందిన మండల మహిళా అధ్యక్షురాలే అయినందున నిజంగానే విషయం తేడాగా ఉంటే… పార్టీ పెద్దల దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదని లాజిక్ లాగుతున్నట్టు తెలిసింది.
ఎమ్మెల్యే చర్యను సమర్ధించలేకున్నా…. రెండో వైపు నుంచి కూడా ఆలోచిస్తే.. ఈ ఎపిసోడ్‌లో పలు అనుమానాలు ఉన్నాయంటున్నారు స్థానిక నేతలు. తాను చంద్రబాబు, లోకేష్‌కు ఉత్తరాలు రాశానని, అయినా పట్టించుకోలేదని బాధితురాలు చెబుతున్న మాటల్లోని వాస్తవాన్ని కూడా నిర్ధారించుకుంటామని చెబుతున్నారు చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు. సత్యవేడులో మాజీ ఎమ్మెల్యే హేమలత కూమార్తె హెలెన్‌ను కాదని వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలంకు టిక్కెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో స్థానికంగా పార్టీలో గ్రూపులు పెరిగాయి. ఆదిమూలంను వ్యతిరేకించిన చాలామంది నాయకులు ఇండిపెండెంట్ యాతాటి రమేష్‌కు మద్దతు పలికారు. ఇలా టీడీపీలోని అసమ్మతి గ్రూపులన్నీ కలిసి పనిచేసినా.. పార్టీ వేవ్‌లో కొట్టుకు వచ్చారు ఆదిమూలం. ఇక ఆ తర్వాత ఉద్యోగుల బదిలీలు, ఇసుక ర్యాంపుల దగ్గర వాహనాలు అడ్డుపెట్టుకోవడం లాంటి వ్యవహారాలతో ఎమ్మెల్యేకి, టీడీపీలోని ఇతర గ్రూపులకు మధ్య గ్యాప్ పెరిగిందన్నది నియోజకవర్గంలోని కేడర్ అభిప్రాయం. అదే సమయంలో ఎన్నికల్లో ఇండిపెండెంట్ దగ్గర డబ్బు తీసుకుని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి లిస్ట్ నాదగ్గరుందని, అధిష్టానానికి ఇచ్చి వాళ్ళ సంగతి తేలుస్తానంటూ ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరిస్తున్నారన్న ప్రచారం సైతం ఉంది. కానీ.. ఆ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్న ఎమ్మెల్యే… రాసలీలల వీడియో కూడా మార్ఫింగ్ అంటూ కొత్త రాగం అందుకున్నారు.
నా బిడ్డల సాక్షిగా అంటూ ప్రమాణాలు చేస్తూ… కుట్రకు కారకులంటూ కొందరు స్థానిక నేతల పేర్లు చెబుతున్నారాయన. అటు దీనివెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ… ఎమ్మెల్యే సొంత మండలమైన భీముని చెరువులో మహిళలు ఆయనకు మద్దతు పలకడం, టీడీపీ కేడర్ ధర్నా చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఎమ్మెల్యే మీద కేసు బుక్ అయింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే తన వ్యక్తిగత బలహీనతలతో తనకు తానే వెళ్ళి వివాదంలో ఇరుక్కున్నారా? లేక ఎవరైనా స్కెచ్ వేసి ఇరికించారా అన్నది ఆసక్తిరంగా మారింది. ఇరుక్కున్నా… ఇరికించినా… ఆ వీడియో తేడానే కాబట్టి ఈ వయసులో ఈ పెద్దాయనకు ఇదేం పాడుబుద్ధి అనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. 60 ఏళ్ళకు అంకసిరి అన్న ముతక సామెతను గుర్తు చేసుకుంటూ… 70 ఏళ్ళ వయసులో ఈయనగారికి అవసరమా అని కొందరు, ముసలోడేగానీ… అన్న బ్రహ్మానందం డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు. మొత్తం మీద కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అయింది.