Site icon NTV Telugu

Off The Record: కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయితీకి తెర లేస్తోందా..? ఆ ఎమ్మెల్యేలకు తిప్పలు తప్పవా..?

Rajagopal Reddy

Rajagopal Reddy

Off The Record: తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై కొంత కాలంగా… ధిక్కార స్వరం వినిపిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి విషయంలో దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించడంలేదన్న అభిప్రాయంతో ఉన్నారట ఈ హస్తం సీనియర్ నేత. దాంతో స్వరం పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఆలస్యం అయినా ఫర్వాలేదు…. మంత్రి పదవి వస్తుంది…. వేచి చూసే ఓపిక నాకుందని ఓవైపు అంటూనే…. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఏ మాత్రం వదలకుండా… రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారాయన. ఈ క్రమంలోనే…. తాజాగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూ బాధితులతో సమావేశమైన రాజగోపాల్ రెడ్డి… ఆ సమావేశంలో చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. తన ధిక్కారాన్ని మరో రూపంలోకి మార్చి… పోరుబాట ఎంచుకోవడం చర్చనీయాంశం అవుతోంది. అధికార పార్టీలో ఉండి కూడా… ప్రభుత్వం మీద పోరాటం కోసం… రూట్ మార్చి టాప్ గేర్ వేశారా అనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో. త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం భూ భాదితుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడబోనంటూ… గతంలో తన రాజీనామా ఎపిసోడ్‌ని గుర్తు చేస్తున్నారాయన. వ్యక్తిగతంగా నాకు అన్యాయం జరిగినా ఫర్వాలేదుగానీ…. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు జరిగితే మాత్రం ఊరుకోను, ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోను, రీజినల్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే.

Read Also: Revanth Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌ ప‌నుల ప్రారంభానికి అనుమతివ్వండి.. గడ్కరీకి సీఎం రేవంత్ విన‌తి!

తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగే తాజా అలైన్‌మెంట్‌ను మునుగోడు ఎమ్మెల్యేగా ఎట్టి పరిస్థితుల్లో… తాను ఒప్పుకునేది లేదని తేల్చిచెప్తున్నారు రాజగోపాల్‌రెడ్డి. అసలు మొత్తం దక్షిణభాగం అలైన్ మెంట్‌ని మార్చాల్సిందేనన్నది ఆయన లేటెస్ట్‌ డిమాండ్. అసలు ఎవరిని అడిగి దాన్ని ఆమోదించారని ప్రశ్నిస్తున్నారాయన. స్థానిక రైతుల అభిప్రాయం తీసుకొలేదని, కనీసం దక్షిణ భాగం ఎమ్మెల్యేలతోనైనా ప్రభుత్వ పెద్దలు మాట్లాడారా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు రాజగోపాల్‌రెడ్డి. వ్యవస్థను స్తంభింపజేస్తేనే అలైన్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందని, రైతులకు న్యాయం జరుగుతుందని అనడం ద్వారా తన రూట్‌ ఏంటో చెప్పకనే చెబుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలు భూ బాధితుల్లో ఉత్సాహం నింపుతుండగా…హస్తం పార్టీలో మాత్రం కొత్త పంచాయితీకి తెర లేస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. అధికార పార్టీలో ఉండికూడా…. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా, భూ బాధితులకు మద్దతుగా రాజగోపాల్ రెడ్డి అండగా నిలబడటం ఒక ఎత్తైతే.. ఆయన తీసుకున్న స్టాండ్… ట్రిపుల్‌ ఆర్‌ దక్షిణ భాగంలో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయవర్గాల్లో.

Read Also: Hyderabad kidnapping: బాబోయ్ బూచోళ్లు.. కొండాపూర్‌లో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం

ఇది ఒక్క మునుగోడు నియోజకవర్గంతోనే ఆగిపోదని అంటున్నారు… అనేక చోట్ల అలైన్ మెంట్ లు మార్చాలని, పరిహారం పెంచాలనే డిమాండ్స్‌ ఉన్న క్రమంలో… తాజాగా రాజగోపాల్ రెడ్డి దూకుడు ఇటు సొంత పార్టీకి ఇరకాటం కావడంతో పాటు…అటు ప్రతిపక్షానికి అస్త్రం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. పైగా… త్రిబులార్‌ భూ బాధితులు…. ప్రభుత్వాన్ని స్తంభింపచేయడానికి సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు పిలుపునిచ్చినా వేల సంఖ్యలో తరలిరావాలంటూ ఆయన చేసిన కామెంట్స్ మరింత కాకరేపుతున్నాయి. భూ బాధితులతో రాజగోపాల్ రెడ్డి వరసగా మీటింగ్స్‌ పెడుతుండటంతో… రాజు కంటే మొండోడు బలవంతుడన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు జిల్లా వాసులు. ఈ పరిస్థితుల్లో మునుగోడు ఎమ్మెల్యేని కాంగ్రెస్‌ పెద్దలు ఎలా డీల్‌ చేస్తోరోనన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version