NTV Telugu Site icon

Off The Record: మంత్రి తానేటి వనితకు అసమ్మతి సెగ..! సొంత సామాజికవర్గం నేతలే దూరం..!?

Minister Taneti Vanitha

Minister Taneti Vanitha

Off The Record: తానేటి వనిత. ఏపీ హోంశాఖ మంత్రి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు ఎమ్మెల్యే. సామాజిక సమీకరణాలు కలిసి రావడంతో 2019లోనే కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు వనిత. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో హోంశాఖను అప్పగించి పదోన్నతి కల్పించింది అధిష్ఠానం. రాజకీయ సోపానంలో అడుగులు ముందుకు పడుతున్నా.. సొంత నియోజకవర్గం కొవ్వూరులో మంత్రికి ఎదురీత తప్పడం లేదనే టాక్‌ వైసీపీ వర్గాల్లో ఉందట. నియోజకవర్గానికి మంత్రి వస్తే చాలు.. చాలా మంది పార్టీ నేతలు ముఖం చాటేస్తున్నారనేది వినికిడి. ముఖ్యంగా వనిత సామాజికవర్గానికి చెందిన నాయకులే మంత్రిపై అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Read Also: Off The Record: టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతు ఎవరికి?

కొవ్వూరు నియోజకవర్గం ఎన్నికల్లో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉండే సామాజికవర్గాల్లో కమ్మ, కాపు, మాదిగలు కీలకం. కమ్మ, కాపు సామాజికవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు ఇప్పటికే వనితకు దూరంగా జరిగారని.. ఇప్పుడు మాదిగ సామాజికవర్గం నేతలు అదే బాట పట్టారని చెబుతున్నారు. ఆ మధ్య ఓ సామాజికవర్గాన్ని తాడేపల్లికి పిలిచిన అధిష్ఠానం.. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరులో తానేటి వనితే పోటీ చేస్తారని చెప్పిందట. ఆ సమయంలో అధిష్ఠానం నిర్ణయానికి అక్కడ తలాడించినా.. కొవ్వూరు చేరగానే సైలెంట్‌ అయ్యారట. ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయి కొవ్వూరు, చాగల్లు మండలాల్లో వనిత చేపట్టిన గడప గడప కార్యక్రమాలు. ఈ రెండు మండలాల్లో మంత్రి వస్తే.. అక్కడి ఎంపీపీలు, జడ్పీటీసీలు రాలేదట. అక్కడ సచివాలయ సిబ్బంది.. వాలంటీర్లు.. వివిధ ప్రభుత్వశాఖ అధికారుల సాయంతో కార్యక్రమాలు మమ అనిపిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Also: Off The Record: దుర్గగుడిలో చెల్లుబాటు కాని మంత్రి మాట..! మాజీ మంత్రిదే పెత్తనం..!

మంత్రి వనితపై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తుండటంతో సమస్య శ్రుతిమించుతోందనే వాదన అధికారపార్టీలో ఉందట. టీడీపీ నేతలతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, ఉద్యోగుల పోస్టింగ్‌లు, బదిలీల్లో మంత్రి బంధువుల పాత్ర ఎక్కువగా ఉంటోందని కూడా ఆరోపిస్తున్నారు అసమ్మతి నాయకులు. కొవ్వూరు నియోజకవర్గంలో 44 గ్రామ పంచాయతీలు ఉంటే.. వాటిల్లో 33 చోట్ల వైసీపీలోని కమ్మ సామాజికవర్గం వారి చేతిల్లో ఉన్నాయి. మిగిలిన 11 చోట్ల కాపు సామాజికవర్గానిదే పైచెయ్యి. ఈ రెండు వర్గాలను మంత్రే పక్కన పెట్టారనేది అసమ్మతి నేతల ఆరోపణ. కాదూ.. వాళ్లే మంత్రికి దూరంగా జరిగేరనేది వనిత వర్గం వాదన. కొవ్వూరు మున్సిపాలిటీలో ఉన్న కొందరు వైసీపీ కౌన్సిలర్లూ మంత్రికి దూరం జరిగినట్టు టాక్‌. ఇక మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు సైతం వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో కొవ్వూరులో మంత్రికి ఎదురీత తప్పదా..? సమస్యను గ్రహించి వనిత దిద్దుబాటు చర్యలు చేపడతారో లేదో చూడాలి.